CM Jagan – I-Pac : అందుకే అంటారు అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలనేది. సొంత పార్టీల నేతల కంటే ఎక్కువగా జగన్ ఐ ప్యాక్(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) సర్వేలనే నమ్ముతున్నారు. రిషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఈ టీం పనిచేస్తుంది. ఆపరేషన్ 2024 దీని ముఖ్య విధి. ఆ టీం ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా పార్టీ శ్రేణులను జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐ ప్యాక్ సర్వేలు ఏమయ్యాయి. అంచనాలు ఎక్కడ తప్పాయి. దీనిపై జగన్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
మొదటి నుంచి జగన్ వ్యూహకర్తల మీదే ఆధారపడ్డారు. వారే తనను గట్టెక్కిస్తారని భావిస్తున్నట్లున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్‌ను అపాయింట్ చేసుకున్నారు. కోట్లకు కోట్లు తగలేసి అధికారంలోకి వచ్చారు. పీకే టీం చేసిన సర్వేలు ఆయన గెలుపునకు ఎంతో దోహదపడ్డాయి. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఐ ప్యాక్ టీం ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ టీం చురుగ్గా పనిచేస్తుంది.
నియోజకవర్గాల వారీగా పార్టీ మంచి చెడులను అంచనా వేసి జగన్‌కు రిపోర్టు ఇస్తూ తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించడం ఐ ప్యాక్ పని. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెట్టి అధికారంలోకి తీసుకురావాల్సిన టీం సభ్యులు పప్పులో కాలేశారు. ఇది ఎంతలా అంటే వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బ పడిపోయింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐ ప్యాక్ టీం చేసిన నిర్లక్యంగా కారణంగా రాబోవు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుండనడంలో సందేహం లేదు.
ముందు నుంచి ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. తమ సత్తా చాటి వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్న ఉద్యోగ సంఘాలపై ఐ ప్యాక్ టీం దృష్టి పెట్టింది. ఆ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుచుకునేందుకు వ్యూహాలు రచించారు. ఉద్యోగ సంఘాల్లో ఐనైక్యత ఆధారంగా పార్టీని గెలిపించుకోగలిగారు. అయితే, పట్టభద్రల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతిపక్షాల నోళ్లకు పని కల్పించింది.
ఐ ప్యాక్ చేసిన చిన్న తప్పిదాన్ని జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం తమ టీం విజయాన్ని తెలియజేసేందుకు వెళ్లగా, అక్కడ సీన్ మరో రకంగా ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అడిగినన్ని డబ్బులు ఇస్తున్నాము.. ఒక్కొక్కరికి వేలకు వేలు జీతాలు ఇస్తున్నాము.. చిన్న ఎన్నికను కూడా హ్యాండిల్ చేయలేకపోతే ఎలా అని నిలదీసినట్లు తెలుస్తుంది. ఇలా అయితే ఇంకొకరిని చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారట.
దీంతో ఐ ప్యాక్ టీం సభ్యులు జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలోనన్న ఆలోచనలో పడిపోయారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోవు ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుచుకునేలా ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయారు. చూద్దాం ఏం అవుతుందో…