AP CM Jagan Vs Chandrababu : చంద్రబాబు ముసలోడా? జగన్ ఏంటిది?
ఇలాంటి విమర్శలు రాజకీయాలను పక్కకు నెడతాయి. మంచి వాతావరణాన్ని చెడగొడతాయి. సమాజం పట్ల బాధ్యతాయుతమైన నాయకులు.. ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడకుండా మారితే బాగుంటుంది.

AP CM Jagan Vs Chandrababu : ఏపీ సీఎం జగన్ స్పీచ్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ప్రజలకు భరోసా చెప్పే మాటలు చెప్పారు. ఇప్పుడు కొత్తగా క్లాస్ వార్, పెత్తందారి వ్యవస్థ అంటూ కొత్త లెక్కలు చెబుతున్నారు. పథకాలు అందుకున్న వారంతా పేదలేనని.. వారంతా నా పక్షమేనంటూ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసంగాల్లో సైతం వ్యక్తిగత టార్గెట్ ను పెంచుతున్నారు. తాను ఏం చేశానని చెప్పడంతో పాటు వారు చేయలేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. సమాజంలో విభజన రేఖ గీస్తున్నారు. పలానా వాళ్లు నావారు.. మిగతా వారు అంతా ప్రత్యర్థులన్న రీతిలో మాట్లాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబునుద్దేశించి చేస్తున్న కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి.
ఇటీవల రాజకీయ నాయకుల భాష, ప్రవర్తన దారి తప్పుతోంది. ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేసినప్పుడు పట్టు తప్పుతున్నారు. తప్పుడు అర్ధాలు ధ్వనించేలా మాట్లాడుతున్నారు. రాముడు, హనుమంతుడు, హిందూత్వ వాదం లేకుండా మోడీ మాట్లాడలేరు. జగన్ ఆర్థిక ఉగ్రవాది, సైకో అనే వ్యాఖ్యలు చేయకుండా చంద్రబాబు ఉండలేరు. ముసలాయన, నరహంతుకులకు నమ్మవచ్చేమో కానీ.. నారా వారిని నమ్మలేమంటూ సీఎం జగన్ తీవ్రమైన వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. అయితే ఇవి జుగుప్సాకరంగా ఉంటున్నాయి. నిషేధిత పదాలను వాడి నేతలు రోత పుట్టిస్తున్నారు.
ప్రజల కోసం పనిచేసే నాయకులు కాబట్టి వారికి ప్రజాదరణ ఉంటుంది. ఎక్కువా తక్కువా అని చెప్పలేం కానీ.. నేతలను ప్రజలు అనుసరిస్తుంటారు. అటు తటస్థులపై సైతం నేతల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ప్రజాహితమైన వ్యాఖ్యలు చేస్తేనే అర్ధవంతంగా ఉంటుంది. తమ ప్రత్యర్థుల లోపాలను, వైఫల్యాలను, చేతగానితనాన్ని విమర్శించాలే తప్ప.. దారితప్పిన ప్రసంగాల్లో అనుచితమైన విషయాలను ప్రస్తావించడం మంచిది కాదు. వాంఛనీయం అంతకంటే కాదు. ఎదుటి వారిని ఎద్దేవా చేయడానికి హేళన చేయడానికి అనుచితమైన దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదు.
ఏపీనే తీసుకుందాం. జగన్ వైఫల్యాలను, పాలనలో అస్తవ్యస్థ విధానాలపై చంద్రబాబు ప్రసంగాలు చేయవచ్చు. కానీ సైకో, ఉగ్రవాది అన్న పెద్ద మాటలు సరికాదు. అదే సమయంలో తండ్రి వయసున్న చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు తగనివి. ఆయన వైఫల్యాలు, నిష్క్రియాపరత్వాన్ని మాత్రమే ప్రస్తావించాలి. కానీ అదే పనిగా టార్గెట్ చేయడం కూడా అనుచితం కాదు. ముసలాయన అని సంభోదించడం తగదు. అయితే రాజకీయంగా అనుచిత భాషకు మొదటి బాధితుడు పవన్ కళ్యాణే. ఆయన వ్యక్తిగత జీవితంపై జరిగిన దాడి ఏ నాయకుడికీ ఎదురుకాలేదు. ఇలాంటి విమర్శలు రాజకీయాలను పక్కకు నెడతాయి. మంచి వాతావరణాన్ని చెడగొడతాయి. సమాజం పట్ల బాధ్యతాయుతమైన నాయకులు.. ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడకుండా మారితే బాగుంటుంది.
