V. C. Sajjanar: బీసీసీసీఐ, ఐపీఎల్ ను సూటిగా ప్రశ్నించిన ఐపీఎస్ సజ్జనార్

ఐపీఎల్ కు స్పాన్సర్షిప్ చేస్తున్న అనేక కంపెనీలో మోసపూరిత సంస్థలు ఉన్నట్లు సజ్జనార్ పేర్కొంటున్నారు. మోసపూరిత సంస్థలను ఐపీఎల్ లో భాగం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

  • Written By: BS Naidu
  • Published On:
V. C. Sajjanar: బీసీసీసీఐ, ఐపీఎల్ ను సూటిగా ప్రశ్నించిన ఐపీఎస్ సజ్జనార్

V. C. Sajjanar: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ ఐపీఎల్. అనేక దేశాలకు చెందిన ముఖ్యమైన ఆటగాళ్లు ఈ లీగ్ లో ఆడుతుంటారు. ప్రపంచం మొత్తం ఈ లీగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు ఈ లీగ్ లో జరిగే మ్యాచ్ లను ఆస్వాదిస్తుంటారు. అయితే అటువంటి లీగ్ ప్రజలకు ఇబ్బందులను కలిగించే రకంగా మారుతోందంటూ తెలంగాణకు చెందిన సీనియర్ అధికారి సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా బీసీసీఐకి పలు కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ ముగింపు దశకు వస్తున్న తరుణంలో సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఐపీఎల్ గత కొద్ది వారాల నుంచి ప్రపంచ క్రికెట్ ను ఊపేస్తోంది. ఈ ఏడాది సీజన్ మరో రెండు రోజుల్లో ముగిసిపోనుంది. ఇటువంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీ ఎండి వీసీ సజ్జానార్ ఐపీఎల్ తీరు పట్ల ఘాటుగా స్పందించారు. ఆయన ఏకంగా ఐపీఎల్ యాజమాన్యానికి చేసిన ఓ విజ్ఞప్తి ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. ప్రజలను ఇబ్బందికి గురి చేసేలా చేస్తున్న సంస్థలను ఆయన ఈ సందర్భంగా తూర్పారబట్టారు.

ఆట కాస్త వ్యాపారంగా మారిపోయింది అంటూ ఆవేదన..

కొన్నాళ్ల క్రితం వరకు క్రికెట్ అంటే కేవలం ఓ ఆటగా మాత్రమే ఉండేది. ఎప్పుడైతే ఈ ఆటలోకి కార్పొరేట్ ఎంటర్ అయిందో క్రికెట్ కాస్త లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఐపీఎల్ రాకతో ఆటలో ఆదాయమే పరమావధి అన్నట్లు లెక్కలు మారిపోయాయి. ఈ క్రమంలోనే ప్రజలకు హాని చేసే కొన్ని కంపెనీలు కూడా కోట్లు కుమ్మరించి అఫీషియల్ పార్టనర్ అనే హోదాను దక్కించుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలోనే సజ్జనార్ ఐపీఎల్ యాజమాన్యానికి కీలక సూచనలు చేశారు.

సంస్థలపై చర్యలు తీసుకొని మోసాలకు అడ్డుకట్ట వేయాలి..

ఐపీఎల్ కు స్పాన్సర్షిప్ చేస్తున్న అనేక కంపెనీలో మోసపూరిత సంస్థలు ఉన్నట్లు సజ్జనార్ పేర్కొంటున్నారు. మోసపూరిత సంస్థలను ఐపీఎల్ లో భాగం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. హెర్బల్ లైఫ్ లాంటి సంస్థలు గొలుసు కట్టు విధానంలో పని చేసేవని, ఇలాంటి గొలుసు కట్టు కంపెనీలను నమ్మి లక్షల మంది మోసపోయారని ఆయన వెల్లడించారు. ఇలాంటి సంస్థను బిసిసిఐ తమ భాగస్వామిగా ప్రకటించడం పట్ల కాస్త పునరాలోచన చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ఇలాంటి సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుని మోసాలకు అడ్డుకట్ట వేయాలని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అఫీషియల్ పార్టనర్ గా వ్యవహరిస్తున్న హెర్బల్ లైఫ్ సంస్థ..

ఇక 2023 ఐపీఎల్ కు సంబంధించి హెర్బల్ లైఫ్ సంస్థ బీసీసీఐ అఫీషియల్ పార్టనర్ గా వ్యవహరిస్తోంది. కానీ సజ్జనార్ దీన్ని క్వశ్చన్ చేయడంతో నెటిజన్స్ ఆయన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ మద్దతు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా ఆటని కలుషితం చేసే బెట్టింగ్ యాప్స్ అదే ఆటకి అఫీషియల్ పార్టనర్ గా ఉండడం ఏమిటి..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సజ్జనార్ వేసిన ప్రశ్నలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ ట్వీట్ ను పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతోపాటు రిపీట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు