IPL 2023 MI Vs GT: ముంబై ఇండియన్స్ నా.. మజాకా..!
శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై – గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఐదు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.

IPL 2023 MI Vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు చరిత్ర సృష్టించింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డును సృష్టించింది. ఒకే సీజన్ లో ఐదుసార్లు 200కుపైగా పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్రకు ఎక్కింది ముంబై జట్టు.
ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. అద్భుతమైన ఆట తీరుతో టైటిల్ ఫేవరెట్ గా దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించింది. తాజా విజయం ద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది ముంబై జట్టు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఇప్పటి వరకు మరో జట్టుకు సాధ్యం కానీ రికార్డును తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది.
ఐదుసార్లు 200కుపైగా పరుగులు సాధించిన జట్టుగా రికార్డు..
ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటతీరు గొప్పగా లేకపోయినప్పటికీ.. ఆడిన కొన్ని మ్యాచ్ లోనైనా అద్భుత ప్రదర్శనతో అలరించింది. 16వ ఎడిషన్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు 200కుపైగా పరుగులు సాధించింది. ఈ ఘనతను సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. పంజాబ్, రాజస్థాన్, పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లపై రోహిత్ సేన ఇప్పటి వరకు 200కుపైగా పరుగులు చేసింది. అంతే కాకుండా ఈ సీజన్ లో మూడుసార్లు 200, అంతకంటే ఎక్కువ పరుగులు లక్ష్యాన్ని చేదించింది.
అద్భుత ఆట తీరుతో అదరగొట్టిన ముంబై..
శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై – గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఐదు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 31 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 18 బంతుల్లో 29 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 49 బంతుల్లో 103 పరుగులు, విష్ణు వినోద్ 20 బంతుల్లో 30 పరుగులు చేయడంతో భారీ స్కోర్ నమోదు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసి 27 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. ఈ జట్టులో విజయశంకర్ 14 బంతుల్లో 29 పరుగులు, డేవిడ్ మిల్లర్ 26 బంతుల్లో 41 పరుగులు, రషీద్ ఖాన్ 32 బంతుల్లో 79 పరుగులు చేయడంతో 191 పరుగులను చేసింది.
మరో నాలుగుసార్లు 200కిపైగా పరుగులు చేసిన ముంబై..
శుక్రవారం జరిగిన మ్యాచ్ కంటే ముందు మరో నాలుగు సార్లు 200కిపైగా పరుగులు చేసింది ముంబై జట్టు. పంజాబ్ జట్టుపై రెండుసార్లు ఈ ఘనత సాధించింది ముంబై జట్టు. పంజాబ్ జట్టు 214 పరుగుల లక్ష్యాన్ని విధించగా, నిర్ణీత 20వ ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి 216 పరుగులు చేసి విజయం సాధించింది ముంబై జట్టు. మరో మ్యాచ్ లో పంజాబ్ జట్టు 214 పరుగులు చేయగా, ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసి 13 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ 200 పరుగుల దాటి స్కోర్ చేసింది ముంబై జట్టు. రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 19.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా 200కి పైగా పరుగులు చేసింది ముంబై జట్టు. మరో మ్యాచ్ లో బెంగుళూరు జట్టు, ముంబై జట్లు తలపడగా.. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో 16.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి విజయం సాధించింది ముంబై జట్టు. మొత్తంగా ఒకే సీజన్ లో ఐదుసార్లు 200కిపైగా పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డ్ సృష్టించింది.
