Virat Kohli Tears: ఇదేమన్నా కొత్తా.. అదే ఓటమి, అవే కన్నీళ్ళు: పాపం కోహ్లీ
గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.. ఇక ఈ మ్యాచ్ ను కూడా అతడు గెలిపించినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ బెంగళూరు బౌలర్లు ఎప్పటిలాగే ధారాళంగా పరుగులు ఇచ్చారు.

Virat Kohli Tears: సెంచరీ సాధించాడు. జట్టు గెలుస్తుంది అనుకున్నాడు. కానీ తాను ఒకటి తలిస్తే గిల్ మరొకటి తలిచాడు.. ఫలితంగా బెంగళూరు జట్టుకు బెంగ మిగిలింది. విరాట్ కోహ్లీకి ఏడుపే పునరావృతమైంది. సీజన్ ప్రతిసారీ కప్ మనదే అనుకోవడం.. తర్వాత డీలా పడటం బెంగళూరు జట్టుకు పరిపాటిగా మారింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో గెలిచి ఆ తర్వాత…కప్ వేట లో ఊచకోత అని సంకేతాలు ఇచ్చిన బెంగళూరు జట్టు.. రాజస్థాన్ రాయల్స్ పై 112 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం మరింత రెచ్చిపోయింది. హైదరాబాద్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం అందుకున్న తర్వాత ఇక ప్లే ఆప్స్ చేరిపోయామని భావించింది. కానీ ఇక్కడే కోహ్లీ కథ అడ్డం తిరిగింది.
సెంచరీ చేసినప్పటికీ
గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.. ఇక ఈ మ్యాచ్ ను కూడా అతడు గెలిపించినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ బెంగళూరు బౌలర్లు ఎప్పటిలాగే ధారాళంగా పరుగులు ఇచ్చారు. రాజస్థాన్ జట్టును 59 పరుగులకు ఆల్ అవుట్ చేసి ప్లే ఆఫ్ వెళ్లకుండా చేసిన వారు.. టైటాన్స్ బ్యాటర్లు ముఖ్యంగా గిల్ కు దాసోహం అయ్యారు. ఫలితంగా వరుసగా నాలుగో సీజన్లో ప్లే ఆఫ్ చేరాలని అనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరవ స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. ఎప్పటిలాగే రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు టైటిల్ పోరు నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
వాస్తవానికి ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, నాలుగు సార్లు కప్ ను ముద్దాడిన చెన్నై,రెండు సార్లు టైటిల్ గెలిచిన కోల్ కత్తా కు బెంగళూరు జట్టుకు పెద్ద తేడా ఏమీ లేదు. నాలుగు జట్లల్లో పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు. మ్యాచ్ విన్నర్లూ ఉన్నారు. కానీ బెంగళూరు మీద దరిద్రం కూర్చున్నప్పుడు ఎవరూ ఏం చేయగలరు? కోహ్లీ కన్నీరు కార్చినంత మాత్రాన ఓటమి గెలుపు అవుతుందా? చేజారిన కప్ తిరిగి వస్తుందా? అసలు సమస్య జట్టును నడిపించే విధానం లో ఉంది.
విరాట్ కోహ్లీ, అప్పట్లో డివిలియర్స్, క్రిస్ గేల్, ఇప్పుడు ప్లేసెస్, మ్యాక్స్ వెల్, మహమ్మద్ సిరాజ్ ఇలా నలుగురు ప్లేయర్లు తప్ప.. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇది మా టీం, గెలిచి తీరాలి అనే కసి బెంగళూరు జట్టులో కనిపించలేదు. ఆ జట్టులో ఎమోషన్స్ అంటూ లేవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అది పక్కా కమర్షియల్ జట్టు. బెంగళూరు జట్టు కోసం మేనేజ్మెంట్ కోట్లకు కోట్లు కుమ్మరిస్తుంది. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది. చివరికి ప్లేయర్లకు గర్ల్ ఫ్రెండ్స్ కి, వాళ్ళ కుటుంబాలకి కూడా ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్, హోటళ్ళల్లో ఏసీ రూమ్స్ బుక్ చేసి వివిఐపి ల్లాగా చూసుకుంటుంది. కానీ ఇది మా జట్టు, దీనికోసం ఆడాలి అనే కసి మాత్రం ప్లేయర్లలో పుట్టించలేకపోయింది. చివరికి కోహ్లీ లాంటి ఆడగాడు వరుస సెంచరీలు సాధించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కన్నీరే మిగిలిందిక నేస్తం అని పాడుకొనే దుస్థితికి దిగజారింది.