MS Dhoni IPL 2023: దటీజ్‌ ధోనీ.. అట్టడుగు నుంచి అగ్రస్థానానికి!

కెప్టెన్‌ కూల్‌.. మహేంద్ర సింగ్‌ ధోనీకి అభిమానులు పెట్టుకున్న పేరు ఇది. గతేడాది రవీంద్ర జడేజా, ధోనీ జట్టును నడిపించారు. దీంతో మ్యాజిక్‌ మిస్‌ అయ్యింది.

  • Written By: DRS
  • Published On:
MS Dhoni IPL 2023: దటీజ్‌ ధోనీ.. అట్టడుగు నుంచి అగ్రస్థానానికి!

MS Dhoni IPL 2023: పడిపోవడం తప్పు కాదు.. పడి లేవకపోవడం తప్పు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌. గతేడాది పాయింట్ల టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచిన చెన్నై… ఈసారి అద్భుతంగా పుంజుకుని ఫైనల్‌కి చేరింది. గత సీజన్‌కు ఈసారి టీమ్‌లో ఏం మార్పులొచ్చాయి. మహేంద్ర సింగ్‌ ధోనీ ఏం చేశాడు? అవి ఎంతవరకు జట్టు విజయానికి కారణం అన్న చర్చ జోరుగా జరుగుతోంది. దటీజ్‌ ధోనీ అని చాలా మంది ప్రశంసిస్తున్నారు.

అనుకూలించిన అంశాలు..
చెన్నై విజయానికి కారణాలు అని లిస్ట్‌ రాయడం మొదలుపెడితే.. ధోనీ పేరు తొలుత వస్తుంది. ఆ తర్వాత వచ్చేది.. ఓపెనింగ్‌ జోడీ. డేవాన్‌ కాన్వే(625), రుతురాజ్‌ గైక్వాడ్‌(564) కలసి ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో తొలి వికెట్‌కు 1,189 పరుగులు చేశారు. అందుకే వీరిద్దరూ ఆరెంజ్‌ క్యాప్‌ టాప్‌ 10 లిస్ట్‌లో ఉన్నారు. జట్టుకు పవర్‌ ప్లేలో భలే ఆరంభాన్నిచ్చారు ఈఇద్దరూ. ఏ జట్టుకైనా సొంత మైదానం అతి పెద్ద బలం. చెన్నై ఈ ఏడాది జైత్ర యాత్ర చేయడానికి చెపాక్‌ స్టేడియమూ ఓ కారణం అని చెప్పాలి. ఇక్కడ ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే ఐదింట్లో గెలుపొందారు. ఇవి పాయింట్ల పట్టికలో చెన్నై టాప్‌ 2కి రావడానికి చాలా సాయపడ్డాయి.

ధోనీ మ్యాజిక్‌తోనే..
కెప్టెన్‌ కూల్‌.. మహేంద్ర సింగ్‌ ధోనీకి అభిమానులు పెట్టుకున్న పేరు ఇది. గతేడాది రవీంద్ర జడేజా, ధోనీ జట్టును నడిపించారు. దీంతో మ్యాజిక్‌ మిస్‌ అయ్యింది. ఈ ఏడాది మాత్రం తన ట్రేడ్‌ మార్క్‌ కెప్టెన్సీతో జట్టును సమర్థవంతంగా నడిపించాడు. కీలక సమయాల్లో ధోనీ నాయకత్వం ఈ సీజన్‌లో చాలా ఉపయోగపడింది. అదే ఇప్పుడు ఫైనల్‌కి తీసుకెళ్లింది. పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లను తీసుకొచ్చి వాళ్లను పర్పుల్‌ క్యాప్‌ రేసులో నిలిపాడు. తుషార్‌ దేశ్‌పాండే(21) టాప్‌ వికెట్‌ టేకర్‌ లిస్ట్‌లో నాలుగులో ఉన్నాడంటే అదే కారణం. ఇక ధోనీ ఈ ఏడాది ఆయుధంగా వాడుతున్నది మతీశా పతిరనను. శ్రీలంకకు చెందిన ఈ యువ పేసర్‌.. కీలక సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌లు మలుపుతిప్పాడు. ధోనీ చెప్పినట్లు బంతి వేస్తే చాలు.. ఆటోమేటిగ్గా వికెట్లు వస్తాయి అనేది మరోసారి వాళ్లు చేసి చూపించారు.

కూల్‌గా విన్నింగ్‌..
మైదానంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. కామ్‌గా, కూల్‌గా ఉంటాడు ధోనీ. అలా ఉండటం కాదు ఈ ఏడాది తన టీమ్‌కి కూల్‌గా ఎలా ఉండాలో నేర్పించాడు కూడా. క్వాలిఫయర్‌ 1లో చూస్తే.. ఇలాంటి ఓ సీన్‌ చూడొచ్చు. ఫీల్డింగ్‌లో సేనాపతి తత్తరపాటుకు గురవుతుంటే.. కూల్‌గా ఉండు అని చెప్పాడు. ఆ తర్వాత అంతే కూల్‌గా అతను దర్శన్‌ నల్కాండేను రనౌట్‌ చేశాడు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి సంఘటనలు ఈ సిరీస్‌లో చాలా ఉన్నాయి.

ఓ పెద్దన్నలా..
ధోనీలో ఓ పెద్దన్న ఉంటాడు అంటుంటారు సహచరులు. తప్పు చేస్తే నొప్పించకుండా జాగ్రత్త చెబుతూ ఉంటాడు. ఈ సిరీస్‌ ప్రారంభంలో వైడ్స్, ఫీల్డింగ్‌ మిస్టేక్‌ల గురించి ధోనీ కాస్త కఠువుగానే చెప్పాడు. ‘‘మీరు ఇలా కొనసాగిస్తే.. వేరే కెప్టెన్‌ నేతృత్వంలో ఆడాల్సి ఉంటుంది’’ అని వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ మాటలు టీమ్‌లో చాలా మార్పే తీసుకొచ్చాయి. అవే విజయాన్ని కూడా తెచ్చాయి అని చెప్పాలి. ధోనీ కెప్టెన్సీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫీల్డింగ్‌ గురించే. తాను కీపింగ్‌లో ఎంత అలర్ట్‌గా ఉంటాడో.. టీమ్‌ మొత్తం అలానే ఉండాలి అంటుంటాడు. ఒక్కోసారి ఫీల్డర్‌ను రెండు అడుగులు అటు, మూడు అడుగులు ఇటు అని మారుస్తుంటాడు. ఆ మార్పులు చక్కటి ఫలితాలు ఇస్తాయి. రీసెంట్‌గా జరిగిన గుజరాత్‌ మ్యాచ్‌లోనూ ఇలాంటి మార్పులే వికెట్లు తీశాయి. అయితే ఇలా మార్చి తాను విసిగించే కెప్టెన్‌ అవుతున్నా అంటూ తనను తాను సరదాగా విమర్శించుకున్నాడు ధోనీ.

సంబంధిత వార్తలు