Hyderabad- Investors: దక్షిణంలో అమాంతం పెరిగిపోయింది. ఉత్తరంలో పరుగులు పెడుతోంది.. తూర్పు దిక్కున సూర్యుడికి సింధూరం అద్దుతోంది. పడమరన కొత్త కొత్త సొబగులను సింగారించుకుంతున్నది. మొత్తానికి హైదరాబాద్ నాలుగు దిశలా అభివృద్ధి చెందుతోంది. దక్కన్ పీఠభూమి లో విభిన్నమైన ప్రాంతంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ఇప్పుడు పెట్టుబడులకు సుశిక్షితమైన గమ్యంగా వినతి కెక్కుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, హుస్సేన్ సాగర్, బిర్లా టెంపుల్ మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు.. హైదరాబాద్ కు గుండెకాయల్లా ఎన్నో ప్రాంతాలు, మరెన్నో వ్యాపార సముదాయాలు ఆవిర్భవించాయి. ఆవిర్భ విస్తూనే ఉన్నాయి.

amara raja batteries telangana
రోజుకొక అమర రాజా
తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిది.. ఈ నగరంలో విస్తారంగా భూమి లభ్యత ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సులభం అవుతున్నది. మరీ ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు తమ వ్యాపార కేంద్రాలను ఉపఖండం వెలుపల హైదరాబాదులోనే ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి వారానికి ఒక పెట్టుబడి హైదరాబాద్ కు వస్తుండడం ఇక్కడ గమనార్హం.. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో తిరోగమనంలో ఉంటే ఒక హైదరాబాద్ మాత్రమే పురోగమనంలో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ రాజధాని బెంగళూరు ప్రాంతాలను అతి త్వరలో అధిగమించేందుకు సమాయత్తమవుతోంది.
వెల్లువలా పెట్టుబడులు
హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. గతవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ 9,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని తర్వాత తాజాగా కాపిటల్ లాండ్ కంపెనీ 6,200 కోట్లతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.. హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించుకోవాలని నిర్ణయించింది. దీనికోసం 1,200 కోట్ల పెట్టుబడితో మాదాపూర్ లో కాపి టల్ లాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రెండు లక్షల 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండే ఈ ఐ టీ పీ హెచ్ డాటా సెంటర్ ను ఐదు సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయిలోకి కంపెనీ అందుబాటులోకి తెస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకు హైదరాబాద్ నగరంలో ఆరు మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణం ఉంది. దానిని వచ్చే ఐదు సంవత్సరాలలో రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది..ఇందుకు గానూ మరో ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉంది.
ఐటీ డెవలప్ అవుతుండడంతో
భారతదేశంలో వేగంగా డేటా సెంటర్ మార్కెట్ అభివృద్ధి చెందుతున్నది.. హైదరాబాదులో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ అవసరాలు ఈ డాటా సెంటర్లు తీర్చుతున్నాయి.. అందువల్లే కాపిటల్ ల్యాండ్ ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టింది.. ఇక ఈ సంస్థ నవీ ముంబైకి చెందిన గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్ డెవలప్మెంట్ సైట్ ను కొనుగోలు చేసి 2021లో ఇండియన్ డేటా సెంటర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పుడు హైదరాబాదులో రెండవ కేంద్రం ఏర్పాటు చేస్తోంది.. మైక్రోసాఫ్ట్ కూడా అతిపెద్ద డేటా కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసేందుకు ముందుకు రానుంది.

Hyderabad- Investors
మినీ ఇండియా
పని వాతావరణం మారిపోయిన నేపథ్యంలో హైదరాబాదులో రకరకాల ప్రజలు నివసిస్తున్నారు.. తెలంగాణలో సుమారు 25% మంది ఈ నగరం ఆధారంగానే ఉపాధి పొందుతున్నారు. బహుళ జాతి సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో వివిధ ప్రాంతాలు, దేశాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ పనిచేస్తున్నారు.. ఫలితంగా ఇక్కడ విభిన్నమైన సంస్కృతి ఏర్పడుతోంది.. హైదరాబాద్ మినీ ఇండియాగా రూపాంతరం చెందుతోంది. మెరుగైన వాతావరణం, విస్తారంగా భూములు, కావాల్సినంత ఆఫీసు స్పేస్ ఉండడంతో బహుళ జాతి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడికి వస్తున్నాయి. దీనివల్ల హైదరాబాద్ ఖ్యాతి మరింత విస్తృతం అవుతోంది.. ముందుగానే చెప్పినట్టు పెట్టుబడుల ప్రవాహం ఇదే స్థాయిలో ఉంటే హైదరాబాద్ దేశ ఆర్థిక రాజధానిగా రూపాంతరం చెందే రోజులు ఎంతో దూరంలో లేవు.