S. V. Ranga Rao- Jamuna: ఆ రోజుల్లో పాత తరం నటీనటులు ఎక్కువగా వ్యసనాలకు బానిస అయ్యేవారు. మహా నటుడు ఎస్వీఆర్ కూడా మత్తుకు తలొగ్గారు. ఆయన తాగినప్పుడు నిర్మాతలను, తాగనప్పుడు తోటి నటీనటులను ఏడిపించే వారు అని పేరు. పైగా ఆ రోజుల్లో షూటింగ్ సమయంలో అందరూ కలిసి భోజనం చేసేవాళ్లు. అలా ఆ రోజు కూడా అందరూ భోజనం చేయడానికి ఓ చెట్టు కిందకు చేరారు. అప్పటికే ఎస్వీఆర్ తాగుడు అలవాట్ల గురించి రకరకాల పుకార్లు వినిపించేవి. అప్పుడే కొత్తగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జమున గారు ఆ భోజనం చేసే బ్యాచ్ లో ఉంది. ఆమె చూపు అంతా ఎస్వీఆర్ మీదే ఉంది. అసలు ఆయన తాగుడు గురించి తాను విన్నది నిజామా ? అబద్దమా ? అని తెలుసుకోవాలనేది జమున తాపత్రయం. అందరూ కూర్చున్నారు. భోజనాలు వడ్డిస్తున్నారు. ఆ రోజుల్లో ఎవరి క్యారేజీ వారి ఇంటి నుండి వచ్చేది. కానీ ఎస్వీఆర్ కి మాత్రం క్యారేజీతో పాటు పెద్ద బాటిల్ కూడా వచ్చేది.

S. V. Ranga Rao- Jamuna
ఎస్వీఆర్ ఆ బాటిల్ చేతిలో పెట్టుకుని, చిన్నగా పైకి లేచి చెట్టు చాటుకు వెళ్ళారు. జమున ఆయనను చూసి.. తాను విన్న మాటలు నిజమే అనుకుంది మనసులో. మరోపక్క ఎస్వీఆర్ తాగడం మొదలుపెట్టారు. అప్పటికే అందరికీ విషయం అర్థమైంది. అందుకే, ఎవరూ ఎస్వీఆర్ వైపు చూడటం లేదు. పొరపాటున చూస్తే.. ఆయన దగ్గరకు పిలుస్తారు. పిలిచాకా ఏమైనా జరగొచ్చు. ఆయన మనసు బాగుంటే.. ఆప్యాయతను చూపిస్తారు. మనసు బాగాలేక పోతే ఆయన తన రౌద్రన్ని చూపిస్తారు. అందుకే, ఎవ్వరూ ఆయన వైపు చూసే సాహసం కూడా చేయడం లేదు. కానీ, జమున మాత్రం అలాగే ఎస్వీఆర్ వైపే నోరెళ్ళబెట్టి చూస్తోంది.
అది గమనించారు ఎస్వీఆర్. ‘ఏమిటి పిల్ల. రుచి చూస్తావా ?, లేక అలాగే నన్నే చూస్తూ ఉండిపోతావా ?’ అని గంభీరంగా అన్నారు. దాంతో ఉలిక్కిపడ్డ జమున ‘లేదు అన్నగారు’ అంటూ తల దించుకుంది. దాంతో, ఎస్వీఆర్ కోపంగా ముందుకు వచ్చి.. అన్న గారు ఏమిటే.. మామ అని పిలువు, లేదా బావ అని పిలువు ‘ అంటూ హుంకరించారు. ఆ రోజు నుంచి ఇష్టం ఉన్నా లేకపోయినా జమున గారు ఎస్వీఆర్ ను మామగారు అని పిలిచేవారు. ఆ పిలుపే ఇద్దరి మధ్య చనువు వచ్చేలా చేసింది. ఎస్వీఆర్ కూడా జమున అంటే తమ పిల్ల అనేవారు.

Jamuna
అయితే, గుండమ్మ కథ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు అర్ధరాత్రి ఎస్వీఆర్, జమున తలుపు తట్టారు. ఆ రోజు మాత్రం జమున జీవితంలోనే శాశ్వతంగా గుర్తుండిపోయిందట. ఆ రాత్రి అంతా ఆమె నిద్ర పోలేదు. ఆమెకు ఎదురుగా ఎస్వీఆర్ గారు కూర్చుని తాగుతూనే ఉన్నారు. ఆయన తాగుతూనే… జీవితంలో ఎలా ఉండాలి ?, ఎంత జాగ్రత్తగా ఉండాలి ?, లాంటి విషయాలను ఆమెకు చెబుతూ ఉన్నారట. జమునకు మాత్రం మరోవైపు చిరాగ్గా ఉంది.
ఉదయం 5 గంటల సమయం అవుతుంది. ఎస్వీఆర్ చిన్నగా పైకి లేచారు. ‘ఏమే పిల్ల.. ఆ కుర్ర వెధవతో నీ యవ్వారం విన్నా. అందరూ.. ఆడు మరో ఎన్టీఆర్ అంటున్నారు, కాదు వాడు మరో తాగుబోతు ఎస్వీఆర్. జాగ్రత్త. వాడికి దూరంగా ఉండు’ అని ఎస్వీఆర్ తూలుతూ ముందుకు కదిలారు. జమున మనసు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమెకు వెంటనే ఓ సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ కుర్ర హీరో ఓ రోజు సాయంత్రం అరచేతి మందంలో ఉండే ఓ పెద్ద మందు బాటిల్ ను అతి సులువుగా తాగేశాడు. ఇన్నాళ్లు ప్రేమ మత్తులో ఉన్న జమునకు ఆ కుర్ర హీరో బలహీనత అర్థం అయింది. ఆ రోజు నుంచే జమున, హీరో హరినాథ్ కు దూరం అయ్యారు. అందుకే, ఎస్వీఆర్ గారు ఆ రోజు అలా చెప్పకపోతే తన జీవితం ఎప్పుడో నాశనం అయ్యేది అని ఆమె నేటికీ ఫీల్ అవుతూ ఉంటారు. ఏది ఏమైనా ఎస్వీఆర్ మహా నటుడే కాదు, మహా మనిషి కూడా.
Also Read:Balakrishna: రెస్టారెంట్ కు వెళ్లిన బాలయ్యలో మరో యాంగిల్ ఇదీ.. చూస్తారా?