Gongadi Trisha: ఎవరైనా చిన్నప్పుడు కార్టూన్ షోలు చూస్తారు.. కార్టూన్ బొమ్మలను ఇష్టపడతారు.. భద్రాచలానికి చెందిన త్రిష మాత్రం పూర్తిగా భిన్నం.. కార్టూన్ చానల్స్ కు బదులు క్రికెట్ మ్యాచ్లు చూసేది.. బొమ్మలకు బదులుగా క్రికెటర్ల బొమ్మలను ఇష్టపడేది.. అలా ఆ ఇష్టం పెరిగి అండర్ 19 క్రికెటర్ ను చేసింది.. ఏకంగా టీం ఇండియాకు కప్ తెచ్చేలా పురిగొలిపింది. ఇప్పుడు ఓ సెలబ్రిటీ అయిపోయింది. మొదటిసారి వరల్డ్ కప్ సొంతం చేసుకున్న అండర్ 19 జట్టులో తెలుగు తేజం గొంగటి త్రిష అద్భుత ప్రదర్శన చేసింది.. ఫైనల్ మ్యాచ్ లో సౌమ్యతో కలిసి 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.. జట్టును విజయతీరాలకు చేర్చింది.. ఇండియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.. అయితే త్రిష విజయం వెనుక ఆమె తండ్రి కష్టం ఎంతో ఉంది.. కుమార్తె కెరియర్ కోసం తన జీవన ఉపాధిని కూడా త్యాగం చేశాడు.

Gongadi Trisha
అండర్ 19 వరల్డ్ కప్ సాధించిన తర్వాత అమ్మాయిలను అందరూ అభినందిస్తున్నారు.. వారు అనుభవించిన కష్టాల కన్నీళ్ళకు ఈ గెలుపు ఆనంద భాష్పాలు సమాధానాలు అని చెబుతున్నారు.. ఇప్పుడు దేశం వారి వైపు చూస్తోంది.. వీర గాథలను వింటోంది.. ఆ ప్లేయర్లలో ఓ ఆణిముత్యమే ఈ తెలుగు తేజం గొంగడి త్రిష. త్రిష స్వస్థలం భద్రాచలం.. తండ్రి పేరు గొంగడి రెడ్డి.. త్రిషకు చిన్నప్పటినుంచి క్రికెట్ పై అభిమానం ఏర్పడింది.. సాధారణంగా చిన్నపిల్లలు టీవీలో వచ్చే కార్టూన్లు ఎక్కువగా చూస్తారు.. కానీ ఏడు సంవత్సరాల వయసు నుంచే త్రిష కార్టూన్లకు బదులు క్రికెట్ చూడటం మొదలు పెట్టింది. అలా క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుంది. ఈ సక్సెస్ వెనుక త్రిష ఆసక్తి మాత్రమే కాదు, ఆమె తండ్రి సంకల్పం కూడా ఉంది.. త్రిష భవిష్యత్తు కోసం తన జీవన ఆధారాన్ని అతను త్యాగం చేశాడు.. తనకు ఉన్న జిమ్ ను నష్టానికి తన బంధువులకు అమ్ముకున్నాడు.. అంతేకాదు మరో జిమ్ లో ఫిట్నెస్ ట్రైనర్ గా జాయిన్ అయ్యాడు.. కుమార్తె భవిష్యత్తు కోసం అది కూడా వదులుకున్నాడు.. అంతేకాదు తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిని కూడా అమ్మాడు. కుమార్తెను ఎలాగైనా క్రికెటర్ చేయాలనే ఉద్దేశంతో కుటుంబంతో సహా సికింద్రాబాద్ షిఫ్ట్ అయ్యాడు.. అక్కడైతే క్రికెట్ ట్రైనింగ్ కు అన్ని సౌకర్యాలు ఉంటాయని భావించాడు.

Gongadi Trisha
2012లో తన కుమార్తె నెట్ స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సెయింట్ జాన్ అకాడమీ లోని కోచ్ లు జాన్ మనోజ్ , శ్రీనివాస్ కు చూపించాడు.. కాగా, త్రిష బ్యాటింగ్ స్పీడ్ కు, ఆమె కళ్ళు, చేతులకు ఉన్న కోఆర్డినేషన్ కు ఇంప్రెస్ అయ్యి ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు.. అలా ఆమె రాటు తేలింది.. 2014-15 ఇంటర్ స్టేట్ టోర్నీలో మొదటిసారిగా అండర్ _16 లో ఆడింది. అనంతరం స్టేట్ తరఫున అండర్ 16, అండర్ 19 టోర్నీలకు ఆడింది.. తర్వాత అండర్ 19 ఛాలెంజర్ ట్రోఫీలో ఛాన్స్ సంపాదించింది.. ఆదివారం జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో త్రిష మంచి ప్రదర్శన చేసింది.. వికెట్ కు సౌమ్య తో కలిసి 46 పరుగులు జోడించింది.. దీంతో ఇంగ్లాండ్ నిర్దేశించిన 69 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఛేదించడంలో కీలకపాత్ర పోషించింది.