
TSPSC Paper Leak Issue
TSPSC Paper Leak Issue: సముద్రాన్ని అవలీలగా ఈదిన వ్యక్తి..పిల్ల కాలువలో దూకి మరణిస్తాడా? ఇది సాధ్యమేనా? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీకి సంబంధించి ప్రవీణ్ వ్యవహారం కూడా అలాగే ఉంది. కఠినమైన గ్రూప్_1 ప్రిలిమినరీ పరీక్ష లో 103 మార్కులు సాధించిన అతడు బుక్ లెట్ కోడ్ తప్పుగా బబ్లింగ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు. 103 మార్కులు కూడా వచ్చాయి. కానీ, ఓఎంఆర్ షీట్ డిస్‌క్వాలిఫై అయింది. కఠినమైన గ్రూప్-1పరీక్షలో 150కి 103 మార్కులు సాధించిన ప్రవీణ్.. బుక్‌లెట్ కోడ్ తప్పుగా బబ్లింగ్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్ పీఎస్సీలో నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్‌లో పనిచేసిన ప్రవీణ్.. ఆ తర్వాత సెక్షన్ ఆఫీసర్‌గా ఎదిగాడు. అలాంటి వ్యక్తికి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే విధానంపై అవగాహన లేదనుకోవడం పొరపాటని సిట్ అధికారులు భావిస్తునట్లు తెలుస్తోంది.
103 మార్కులు వచ్చేలా పరీక్ష రాసిన ప్రవీణ్.. కావాలనే డిస్‌క్వాలిఫై అయ్యేందుకు బబ్లింగ్‌లో తప్పు చేసినట్లు అనుమానిస్తున్నారు. గ్రూప్-1 పరీక్ష ఎందుకు రాశాడు..? ఎందుకు తప్పులు చేసి డిస్‌క్వాలిఫై అయ్యాడు? అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ప్రశ్నపత్రం లీకేజీలో భాగంగానే ప్రవీణ్ ఈ కిటుకులు వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేపర్ లీకేజీలో నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు సిట్ అధికారులు టీఎస్ పీఎస్సీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. రాజశేఖర్ ఉద్దేశపూర్వకంగానే టెక్నికల్ సర్వీస్ నుంచి టీఎస్ పీఎస్సీకి డిప్యుటేషన్‌పై నెట్‌వర్క్ అడ్మిన్‌గా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రవీణ్, రాజశేఖర్‌లు ఒక్కటై పేపర్ లీకేజీల దందాకు పాల్పడినట్లు తేల్చారు.

TSPSC Paper Leak Issue
రాజశేఖర్ నుంచి ప్రశ్నపత్రాలను తీసుకున్న ప్రవీణ్ ముందస్తు ఒప్పందం ప్రకారం.. వాటిని రేణుకకు అమ్మినట్లు తేల్చారు. ఇలాగే గత ఏడాది జరిగిన గ్రూప్-1 పేపర్‌ను సైతం నిందితులు తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాగా, ప్రశ్నపత్రం లీకేజీలో అరెస్టయిన 9 మంది నిందితులను తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని బేగంబజార్ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులను 6 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ప్రవీణ్ రేణుక తో సన్నిహితంగా దిగిన ఫోటోలు సిట్ అధికారులకు షాక్ కలిగిస్తున్నాయి. రేణుక వలపు వల విసిరి ప్రవీణ్ తో ప్రశ్నపత్రాలు లీక్ చేయించిందని సిట్ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు.. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు..