Khairatabad Ganesh: 63 అడుగుల ఎత్తు. మట్టితో తయారీ.. ఖైరతాబాద్ వినాయకుడి విశిష్టతలు ఎన్నో..

వినాయక ఉత్సవాల 11 రోజులలో దాదాపు 20 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకుంటారు. దేశం మొత్తం వినాయక ఉత్సవాలు ఒక ఎత్తు అయితే ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు మరొక ఎత్తు.

  • Written By: Bhaskar
  • Published On:
Khairatabad Ganesh: 63 అడుగుల ఎత్తు. మట్టితో తయారీ.. ఖైరతాబాద్ వినాయకుడి విశిష్టతలు ఎన్నో..

Khairatabad Ganesh: తెలుగు రాష్ట్రాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అని చెప్పగానే ముందుగా మదిలో మెదిలేది ఖైరతాబాద్ వినాయకుడు. స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో హైదరాబాదులోని ఖైరతాబాద్ లో 1954లో గణేష్ ఉత్సవాలు మొదలయ్యాయి. నాటి నుంచి 69 సంవత్సరాలుగా లక్షల మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం ప్రత్యేక రూపంలో దర్శనం ఇచ్చే గణపతి.. ఈసారి దశమహావిద్య గణపతిగా ముస్తాబయ్యాడు.

వినాయక ఉత్సవాల 11 రోజులలో దాదాపు 20 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకుంటారు. దేశం మొత్తం వినాయక ఉత్సవాలు ఒక ఎత్తు అయితే ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు మరొక ఎత్తు. పూణే, బై మహా నగరాలలో చిన్న చిన్న విగ్రహాలైనా, చూడముచ్చటగా తయారు చేయడమే కాకుండా పూజలు, ఊరేగింపులు వైభవంగా జరుగుతాయి. ఎంత ఖరీదైన గణపతులుగా ముంబై నగరానికి చెందిన లాల్ బాగ్ గణపతి, గుజరాత్ లోని సూరత్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి గణపతి ఉండగా.. ఎత్తైన గణపతిగా, అత్యంత ప్రజాదరణ భక్తులు కలిగిన గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు ప్రఖ్యాతిగాంచాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఒక రూపంతో గణపతిని తయారు చేసి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రముఖ సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ గణపతిని ఎలా తయారుచేస్తే అందరికీ శుభం జరుగుతుందో నిర్ణయించి చెబుతారు. ఆయన సూచనల మేరకే వినాయకుడిని సిద్ధం చేస్తారు. ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ డ్రాయింగ్ మేరకు గ్రాఫిక్ డిజైనర్ శరత్ నల్ల నాగుల సహకారంతో గణపతికి ఒక రూపు ఇవ్వగా.. కళాకారులు విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఈసారి దశమహావిద్య గణపతి గా పూజిస్తే సర్వజనులకు మేలు కలుగుతుందనే సూచన మేరకు గణనాథుడిని ముస్తాబు చేశారు. 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఉండే మహాగణపతి 10 చేతులతో, ఏడు తలల పడగలున్న కాలనాగుపై నిలబడేలా చూడముచ్చటగా తయారు చేశారు. ఎడమ వైపున రాజశ్యామల (సరస్వతి దేవి), కుడి వైపున వారాహి(లక్ష్మీ దేవి) సమేతంగా గణనాథుడు నిలబడి ఉండగా ఆయన వెనకవైపున పుస్తకం, దానిపై సంస్కృత శ్లోకాలు కనిపించేలా విద్యా గణపతి కొలువై ఉన్నాడు. గణపతి తో పాటు కుడివైపున 15 అడుగుల ఎత్తుతో పంచముఖ లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపున అదే 15 అడుగుల ఎత్తుతో వీరభద్రస్వామి ల విగ్రహాలు తయారు చేశారు.

ఆగమ శాస్త్రం ప్రకారం దశమహావిద్య గణపతికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అమ్మవారి ఉపాసనలో దశమహావిద్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. పది రకాల ఉపాసనల్లో దశ మహా విద్య దేవతలైన వారాహి,కాళీ, తారా, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్న మస్త, ధూమవతి, బగాళా ముఖి, మాతంగి, కమలామాతను పూజించిన పుణ్యం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకుంటే కలుగుతుంది. దీంతోపాటు పంచముఖ నారసింహ క్షేత్రంగా వెలుగొందుతున్న లక్ష్మీ, యోగ, జ్వాలా, ఉగ్ర, గండ బేరుండ నరసింహ స్వామి దర్శించిన పుణ్యం దక్కుతుందని తెలుస్తోంది. ఇక శివకేశవులుండాలన్న సంకల్పం మేరకు పరమశివుడి ఉగ్ర స్వరూపమైన శ్రీ వీరభద్రుడిని పూజలకు సిద్ధం చేసినట్టు అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు.

Read Today's Latest Festive glory News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube