DSP Dhanunjaidu: మరో జేడీ లక్ష్మీనారాయణ అయ్యేది ఎవరు?
కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ 1990 మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి. 2006లో డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ సిపిఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు.

DSP Dhanunjaidu: వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ.. ఈ పేరు అంత సుపరిచితం కాదు. పెద్దగా తెలియదు కూడా. అదే జేడీ లక్ష్మీనారాయణ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తాం. ఫలానా వ్యక్తి అని చెప్పేస్తాం. అంతలా ప్రాచుర్యం పొందింది ఆ పేరు.ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ అక్రమస్తుల కేసు, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసులో జేడీ లక్ష్మీనారాయణ విచారణ అధికారిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా సూపరిచితులయ్యారు.ఇప్పుడు చంద్రబాబు కేసు విచారణలో సైతం ఓ అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ 1990 మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి. 2006లో డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ సిపిఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. సరిగ్గా జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ అధికారిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఈ కేసు విచారణలో భాగంగా జగన్ ఎంత సంచలనంగా మారారో.. దర్యాప్తు అధికారిగా జేడీ లక్ష్మీనారాయణ పేరు మార్మోగిపోయింది. ఆయన ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ తీసుకున్నా.. ఇప్పటికీ ఆయన జేడీ లక్ష్మీనారాయణ గానే పేరు పొందారు. ప్రస్తుతం రాజకీయ, సేవా రంగాల్లో ఉన్న ఆయన్ను.. ఏపీ ప్రజలు జేడీ లక్ష్మీనారాయణ గానే పిలుచుకుంటారు. అంతలా ప్రభావం చూపింది ఆ కేసు విచారణ.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సిఐడి వెంటాడుతోంది. ఈ ఒక్క కేసుతోనే కాకుండా పాత కేసులను సైతం తిరగ దోడుతోంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును సిఐడి బృందం విచారణ చేపడుతోంది. ఈ బృందంలో కీలక అధికారిగా డి.ఎస్.పి ధనుంజయుడు ఉన్నారు. ఆయన నేతృత్వంలోని 9 మంది అధికారులు చంద్రబాబును విచారణ చేపడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ధనుంజయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ద్వారా చంద్రబాబును కేసుల్లో మరింత ఇరికించేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సిఐడిలో ధనంజయుడు సీనియర్ అధికారిగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన పేరు తెలుగు మీడియాలో నానుతోంది. చంద్రబాబు దేశంలోనే మోస్ట్ సీనియర్ లీడర్. హై ప్రొఫైల్ కేసు కావడం.. విచారణ అధికారిగా ధనుంజయుడు ఉండడంతో.. ఆయన మరో జేడీ లక్ష్మీనారాయణ అవుతారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు చంద్రబాబు కేసులకు సంబంధించి అధికారులకు జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.వచ్చేది తన ప్రభుత్వమేనని.. ఏం జరిగినా తాను చూసుకుంటానని.. ఎవర్ని విడిచి పెట్టవద్దని జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అందుకే సిఐడి చీఫ్, ఏసీబీ న్యాయవాది దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ధనుంజయుడు టీంకు సైతం పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించినట్లు సమాచారం. ఇప్పటికే గత ఎన్నికలకు ముందు అప్పటి టిడిపి సర్కార్ పై దూకుడు కనబరిచిన ఒకరిద్దరు పోలీస్ అధికారులకు టిక్కెట్లు ఇచ్చి జగన్ గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా అవసరమైతే పదవీ విరమణ తర్వాత పొలిటికల్ కెరీర్ కు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే హై ప్రొఫైల్ కేసులో అధికారుల పేర్లు మార్మోగుతున్నాయి.
