Ainavilli Temple: కోరిన కోరికలు తీర్చే అయినవిల్లి వినాయకుడు.. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ క్షేత్ర ప్రాశస్త్యం తెలుసుకోవాల్సిందే..

అయినవిల్లి గణేశుడు గరిక, నారికేళ ప్రియుడు. ఇక్కడ స్వామిని గరికతో విశేషంగా పూజిస్తారు. భక్తులు తమ సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని వెళ్లి అది తీరగానే మళ్ళీ వినాయకుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.

  • Written By: Bhaskar
  • Published On:
Ainavilli Temple: కోరిన కోరికలు తీర్చే అయినవిల్లి వినాయకుడు.. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ క్షేత్ర ప్రాశస్త్యం తెలుసుకోవాల్సిందే..

Ainavilli Temple: వృద్ధ గౌతమి తీరానా, శతాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రం అయినవిల్లి వినాయకుడి ఆలయం. కృతయుగంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేపట్టే ముందు ఈ స్వామినే అర్చించారని ప్రతీతి. నేటికీ అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సామాన్యుల సైతం ఏ పని ప్రారంభించాలన్నా మొదట అయినవిల్లి వినాయకుడి ఆశీర్వచనం తీసుకున్నాకే ముందడుగు వేయడం స్వామి మహిమకు నిదర్శనం. కోరిన కోరికలు తీర్చి, సకల విఘ్నాలు తొలగించే వినాయకుడు తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి గ్రామంలో శ్రీ సిద్ధి వినాయకుడిగా కొలువుదీరాడు. దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు ముందుగా అయినవిల్లి గణపతిని కొలిచాడని పురాణాలు చెబుతున్నాయి. స్వామిని స్వయంభుగా చెబుతారు. 14వ శతాబ్దంలో శంకరపట్టు సంస్కృతంలో రాసిన శ్రీపాద వల్లభ చరిత్రలోని ఐదవ అధ్యాయంలో ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావన ఉంది.

దాని ప్రకారం క్రీస్తుశకం 1320లో జన్మించిన శ్రీపాద వల్లభుల మాతామహులు మల్లాది బాపన్నావధానులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహా యజ్ఞం నిర్వహించారు. శాస్త్ర ప్రకారం చివరి రోజు హోమంలో వేసే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండముతో అందుకోవాలని అక్కడి పండితులు చర్చించారట. వినాయకుడు వారి కోరికను మన్నించి యజ్ఞాంతంలో అదేవిధంగా దర్శనమిచ్చి కొద్ది కాలంలోనే భాద్రపద శుద్ధ చవితి నాడు దత్తావదారుడై శ్రీపాద వల్లభుడిగా అవతరిస్తానని వరమిచ్చాడట. అదే అధ్యాయంలో ముగ్గురు నాస్తికులు గణపతిని అవహేళన చేస్తే, పర్యవసానంగా తర్వాత జన్మలో వారు దివ్యాంగులుగా పుట్టినట్టు చరిత్ర చెబుతోంది. అయితే ఆ దివ్యాంగులు ఖాళీ స్థలాన్ని సేద్యం చేస్తున్నప్పుడు బావిలో గణపతి దొరికాడు. ఆయనే కాణిపాక వినాయకుడిగా ప్రసిద్ధి చెందినట్లు శాస్త్రం చెబుతోంది. దీనిని బట్టి కాణిపాక వినాయకుడి కన్నా ఈ వినాయకుడు ప్రాచీనుడని తెలుస్తోంది.

అయినవిల్లి గణేశుడు గరిక, నారికేళ ప్రియుడు. ఇక్కడ స్వామిని గరికతో విశేషంగా పూజిస్తారు. భక్తులు తమ సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని వెళ్లి అది తీరగానే మళ్ళీ వినాయకుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఏటా ముక్కలు తీసుకునే భక్తులు 30 లక్షల కొబ్బరికాయలు కొడతారు అంటే స్వామి మహత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. భక్తులు 300 చెల్లించి లక్ష్మీ గణపతి హోమం లో పాల్గొంటారు. మాములుగా అయితే ఈ హోమానికి వేలల్లో ఖర్చవుతుంది. ఆలయంలో నిత్యం ఏకాదశి రుద్రాభిషేకం, మహాన్యాసాభిషేకాలతో పాటు పుస్తక పూజ, అక్షరాభ్యాసం తదితర క్రతవులు నిర్వహిస్తూ ఉంటారు..ప్రతీ నెలా ఉభయ చవితి తిధులు, దశమి ఏకాదశి లో విశేషర్చనలు చేస్తుంటారు. సంకటహర చతుర్థి నాడు ప్రత్యేక గరిక పూజ నిర్వహిస్తారు. విద్యార్థుల కోసం ఏటా వార్షిక పరీక్షలకు ముందు లక్ష పేనులతో పూజ నిర్వహించి పంపిణీ చేస్తారు. స్వామివారు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పేరు పొందడంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధికారులు, రాజకీయవేత్తలు, న్యాయమూర్తులు దర్శనానికి వస్తుంటారు. చాలా మంది రాజకీయ నాయకులు తమ నామినేషన్ పత్రాలకు ఇక్కడే పూజలు చేయిస్తూ ఉంటారు. కోనసీమ ముఖ్య కేంద్రమైన అమలాపురానికి 12 కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం ఉంది.

Read Today's Latest Festive glory News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు