Kenya Pastor: పాస్టర్ మాటలు నమ్మి.. ప్రాణాలు తీసుకున్న 201 మంది..!

కెన్యాలో ఒక చర్చి పెద్ద నిర్వాకం కారణంగా ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారు. గత నెల నుంచి అధికారులు కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు అధికారులు నిర్ధారించారు.

  • Written By: Shankar
  • Published On:
Kenya Pastor: పాస్టర్ మాటలు నమ్మి.. ప్రాణాలు తీసుకున్న 201 మంది..!

Kenya Pastor: దేవుడిపై భక్తులకు ఉన్న నమ్మకాన్ని కొంతమంది అలుసుగా తీసుకుంటున్నారు. ఈ నమ్మకం మరింత ఎక్కువగా ఉన్న వారిని పలువురు మోసం చేస్తున్నారు. అటువంటి ఘటనే చోటు చేసుకుంది కెన్యాలో. ఆకలితో అలమటించి చనిపోతే జీసస్ ను కలుస్తారని తన అనుచరులకు నమ్మబలికాడు ఒక పాస్టర్. ఫలితంగా వందల మంది ఆహారం తినడం మానేసి ప్రాణాలను కోల్పోయారు. వందలాది మందిని అధికారులు కాపాడారు.

కెన్యాలో ఒక చర్చి పెద్ద నిర్వాకం కారణంగా ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారు. గత నెల నుంచి అధికారులు కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు అధికారులు నిర్ధారించారు.

మరో 600 మంది జాడ కోసం వెతుకులాట..

ఈ ప్రాంతంలో మరో 600 మంది జాడ తెలియడం లేదని అధికారులు గుర్తించారు. వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహార దీక్ష చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. 2019లో పాల్ మెకాంజి అనే చర్చి పాస్టర్ ఈ అటవీ ప్రాంతంలో కిలిఫీ అనే చోట ఎనిమిది వందల ఎకరాల్లో విస్తరించిన ప్రాపర్టీలో మకాం వేశాడు. జీసస్ ను నమ్మే వారిని గుడ్డిగా తనను నమ్మేలా చేశాడు. దీంతో ఆయన చెప్పిన మాటలు విని ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడ్డారు పలువురు భక్తులు. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే జీసస్ ను కలిసే అదృష్టం వస్తుందని తన అనుచరులకు తెలియజేశాడు. దీంతో అతని అనుచరులు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. రోజులు తరబడి తినకుండా ఉండడం వల్ల పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు విడిచారు. వీరందరిని ఆ ప్రాపర్టీ లోనే సామూహిక ఖననాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కెన్యా అధికారులు దాడులు చేసి గత నెలలో మెకంజీని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి దాదాపు 100కు పైగా మృతదేహాలను వెలికి తీసి శవ పరీక్షలు నిర్వహించారు.

అదృశ్యమైన శరీర భాగాలు..

ఇక మృతదేహాలను వెలికి తీసిన అధికారులకు షాక్ కలిగించే రీతిలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది ఆహారం తినక, గొంతు నులమడం, ఆయుధాలతో దాడి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు అధికారులు కనుగొన్నారు. మెకంజీ భార్య సహా 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెలలో కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది మిస్ అయినట్లు కోస్టు రీజియన్ కమిషనర్ రోడా వెల్లడించారు. అంతేకాదు అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను విడిపించారు. వీరంతా నడవలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో మెకంజి చర్చిలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు అడవిలోకి మకాం మార్చాడు. అతడి అనుచరులు కూడా అడవుల్లోకి వెళుతుండడంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు. కెన్యాలో మతపరమైన ఆచారాలను బలంగా పాటించే అలవాటు ఉంది. దీంతో దేశంలో మరి ఎక్కడైనా ఇటువంటివి ఆచరిస్తున్నారేమో గుర్తించాలని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ఆదేశాలు జారీ చేశారు. చూడాలి ఇంకా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తాయేమో. భక్తి ఉండవచ్చుగానీ ప్రాణాలను తీసుకునేంత నమ్మకాలు ఉండకూడదని ఈ ఘటనలు చూసిన తర్వాత పలువురు పేర్కొంటున్నారు.

Read Today's Latest International politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube