Chandrayaan-3 : చందమామపై భారత్ చెరగని ముద్ర.. గగనతలంలోకి చంద్రయాన్ 3
చంద్రయాన్ 3కి మొత్తం 619 కోట్లు ఖర్చుచేశారు. ఆగస్టు 23వ తేదీ లేదా 24 తేదీల్లో చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ అవుతుంది. ఇది చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. కాగా రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ రోజుగా అభివర్ణించారు.

Chandrayaan-3 : చందమామపై భారత్ చెరగని ముద్ర వేయనుంది. అంతరిక్ష ప్రయోగంలో భారత్ మరో కలికితురాయిగా మిగలనుంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో చేపట్టిన చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. గగనతలంలోకి దూసుకెళ్లింది. దీంతో ఇస్రో వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ రాకెట్ ప్రయోగం విజయవంతమైందని, త్వరలోనే చంద్రుడిని చేరుకుంటామని చెప్పారు. చంద్రయాన్ 2 ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నెల్లూరులోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు శాస్త్రవేత్తలు పంపించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండో ల్యాండ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం.3 బాహుబలి రాకెట్ నిప్పులుకక్కుతూ గగనతలంలోని దూసుకొని పోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలు జరగకుండా శాస్త్రవేత్తలు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు చంద్రయాన్ 3 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు.
మొత్తం 3,900 కిలోల పేలోడ్ తో రాకెట్ రోదసిలోకి వెళ్లింది. రాకెట్ నుంచి విడిపోయాక వ్యోమనౌక భూమికక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్, అక్కడ నుంచి చంద్రునిపై దిగిన తరువాత ప్రయోగాలు చేసే విక్రమ్ ల్యాండర్, ఉపరితంపై తిరుగుతూ పరిశోధనలు చేసే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్ 3లో అమర్చి ఉన్నాయి. చంద్రయాన్ 3కి మొత్తం 619 కోట్లు ఖర్చుచేశారు. ఆగస్టు 23వ తేదీ లేదా 24 తేదీల్లో చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ అవుతుంది. ఇది చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. కాగా రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ రోజుగా అభివర్ణించారు.
