IT Layoffs 2023: అమెరికాలో ఉద్యోగం… ఆరు అంకెల జీతం.. అందమైన జీవితం.. ఇప్పటిదాకా భారతీయులు అనుభవిస్తున్న సౌకర్యం ఇది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులౌతోంది. రాత్రికి రాత్రే కొలువులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ వస్తుందోనన్న భయం వెంటాడుతోంది.. ఆర్థిక మాంద్యం బూచి చూపి బడా ఐటి కంపెనీలు లే ఆఫ్ లు అంటూ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలా కొలువులు కోల్పోయిన మనవాళ్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.. దీనికి తోడు హెచ్ _1 బీ వీసా నిబంధనల కత్తి వీరిపై వేలాడుతోంది. 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలనే నిబంధన ప్రవాస భారతీయులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఉన్న ఉద్యోగం ఊడిపోయి.. కొత్త ఉద్యోగం దొరకక ఒకవైపు సతమతమవుతూ ఉంటే… ఈ రెండు నెలల గడువు వారిని మరింత కుంగదీస్తోంది.

IT Layoffs 2023
వేలల్లో ఉద్యోగాల కోత
ఆర్థిక మాంద్యాన్ని చూపి అమెరికాలోని అనేక కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించాయి. వీటిలో అమెజాన్ ముందు వరుసలో ఉంది.. ఇప్పటివరకు అమెజాన్ 18,000 మందికి ఉద్వాసన పలికింది. గూగుల్ 12,000 మందిని ఇంటికి పంపించింది.. ఫేస్బుక్ పదకొండు వేలమంది పై వేటు వేసింది. మైక్రోసాఫ్ట్ పదివేల మంది కొలువులను ఊడబీకింది. సేల్స్ ఫోర్స్ ఎనిమిది వేల ఉద్యోగాల్లో కోత విధించింది. ట్విట్టర్ 3700 మందికి ఉద్వాసన పలికింది. స్నాప్ చాట్ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది.. స్పాటి ఫై అనే సంస్థ 6% ఉద్యోగులను ఇంటికి పంపించింది.. మొత్తంగా ఐటి రంగంలో గత నెల రోజుల్లోనే 50 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.

IT Layoffs 2023
పరిస్థితి క్లిష్టం
అమెజాన్ లో పనిచేస్తున్న ఓ యువతి 3 నెలల క్రితమే అమెరికాకు వెళ్లారు.. ఇటీవల లే ఆఫ్ లో భాగంగా ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు సంస్థ యాజమాన్యం సమాచారం ఇచ్చింది.. మార్చి 20 ఆమె చివరి పని దినమని తెలిపింది.. హెచ్ వన్ బి వీసా తో అగ్ర రాజ్యానికి వెళ్ళిన ఆమె ఇప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. లేకుంటే స్వదేశానికి తిరిగి వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. హెచ్ వన్ బి వీసాతో మైక్రోసాఫ్ట్ లో లో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి ఈనెల 18న లే ఆఫ్ కు గురైంది. ఆమె ఒంటరితల్లి. తన కుమారుడు త్వరలోనే కళాశాలలో చేరబోతున్నాడు.. ఈ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో ఆమె పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది.. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇలాంటివారు చాలామంది. ఒక్కొక్కరిది ఒక్కో బాధ.. కొలువు లేక.. కొత్త కొలువు దొరికే మార్గం లేక… దేశం కాని దేశంలో ఉండలేక వారు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.