Homeజాతీయ వార్తలుNDTV Prannoy Roy: ఎన్టీటీవీ ప్రణయ్ రాయ్ ఎందుకు అప్పుల పాలయ్యారు? ఎందుకు అమ్ముకుంటున్నారు?

NDTV Prannoy Roy: ఎన్టీటీవీ ప్రణయ్ రాయ్ ఎందుకు అప్పుల పాలయ్యారు? ఎందుకు అమ్ముకుంటున్నారు?

NDTV Prannoy Roy: అప్పు ఎప్పటికైనా ముప్పే. ఎంతటి ఆగర్భ శ్రీమంతుడైనా ఒక్కసారి గనుక అప్పుల ఊబిలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులు. ఓ లేమాన్ బ్రదర్స్, సిటీ బ్యాంకు, అడాగ్, సత్యం కంప్యూటర్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు వేల కోట్ల లాభాలు ప్రకటించిన కార్పొరేట్ సంస్థలు చివరకు అప్పులు తీర్చేందుకు ఆస్తులు తెగనమ్మాయి. బోనసులు, డివిడెండ్లు ప్రకటించిన చోటే.. తమను దివాళా దారులుగా ప్రకటించాలని కోరాయి. తాజాగా న్యూఢిల్లీ టెలివిజన్ అలియాస్ ఎన్డిటీవీ లో వాటాలు గౌతమ్ అదాని కొనడం పొలిటికల్ వర్గాల్లోనే కాకుండా, వ్యాపార వర్గాల్లోనూ తీవ్రమైన చర్చకు దారి తీసింది. ఇంతకీ ప్రణయ్ రాయ్ ఎందుకు న్యూఢిల్లీ టెలివిజన్లో వాటాలు అమ్మాల్సి వచ్చింది? 2014 వరకు నెక్స్ట్ టు పీఎం గా ఉన్న ప్రణయ్ రాయ్ ఇప్పుడు ఎందుకు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు మెజార్టీకి కొద్ది దూరంలో వాటాదారుగా మాత్రమే ఉన్న అదాని రేపు న్యూఢిల్లీ టెలివిజన్ ని పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? ఈ ప్రశ్నలే ఇప్పుడు హాట్ హాట్ చర్చకు దారి తీస్తున్నాయి

NDTV Prannoy Roy
NDTV Prannoy Roy

అసలు సమస్య అప్పే

న్యూఢిల్లీ టెలివిజన్లో 29.18% వాటాలు కొనుగోలు చేస్తున్నట్టు అదాని గ్రూప్ ఇటీవల ప్రకటించింది. మరోవైపు 26% వాటాలు కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటిస్తామని వివరించింది. ఫలితంగా న్యూఢిల్లీ టెలివిజన్లో సగానికి పైగా వాటా ఆదాని సొంతమవుతుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అతికొద్ది న్యూస్ ఛానళ్ళల్లో న్యూఢిల్లీ టెలివిజన్ ఉండేది. కానీ ఇప్పుడు అది ప్రధానమంత్రికి అత్యంత విశ్వాస పాత్రుడైన గౌతం ఆదానీ చేతుల్లోకి వెళ్తోంది. న్యూఢిల్లీ టెలివిజన్ నిర్వహిస్తున్న ఎన్ డి టీవీ 24/7, ఎన్డి టీవీ ఇండియా, ఎన్డి టీవీ ప్రాఫిట్ అనే మూడు ఛానళ్లు ఇక అదానీ గ్రూపులోకి వచ్చి చేరుతాయి. అయితే తమను సంప్రదించకుండానే ఈ ప్రకటన వెలువడిందని న్యూఢిల్లీ టెలివిజన్ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికారాయ్ ఆరోపిస్తున్నారు. 2009లో విశ్వ ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ న్యూఢిల్లీ టెలివిజన్ ప్రమోటర్ కంపెనీ అయిన ఆర్.ఆర్.పి.ఆర్ అనే హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి వడ్డీ లేకుండా 403.85 కోట్ల రుణం ఇచ్చింది. ఆర్ ఆర్ పి ఆర్ కి ఎన్డిటీవీలో 29 శాతం వాటా ఉంది. అప్పు తీర్చలేక పోతే ఆ రుణాన్ని ఆర్ఆర్ పి ఆర్ లో 99.9% వాటాగా మార్చుకోవచ్చుననే నిబంధన ఒప్పందంలో ఉంది. ఈ నేపథ్యంలో అనేక నాటకీయ పరిణామాల మధ్య విసిపిఎల్ యాజమాన్యం చేతులు మారుతూ వచ్చింది. ఇదే ఆదాని గ్రూపుకు చెందిన ఏ ఎన్ జి మీడియా నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం అప్పును వాటాగా మార్చుకోవడంలో ఏఎంజి ఎన్డిటీవీ లో 29.18 షేర్ దక్కించుకుంది. ఈ ప్రకారం 13 ఏళ్ల క్రితం ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తీసుకున్న రుణమే ఇప్పుడు ఎన్డిటీవీ టేక్ ఓవర్ కు ప్రధాన కారణంగా మారింది.

Also Read: ‘Liger’Memes : ‘పూరి’‘కొండన్నా’ ఏంటన్నా ఇదీ.. లైగర్ ఫ్లాప్ పై హోరెత్తుతున్న మీమ్స్..

ఎందుకు సంప్రదించలేదంటే

ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం విసిపిఎల్ తన రుణాన్ని వాటాగా మార్చుకోవాలంటే రాధికారాయ్, ప్రణయ్ రాయ్ లను సంప్రదించాల్సిన అవసరం లేదు. గడువు ముగిసే లోపయినా, ఆ తర్వాత నైనా అదనపు చర్చలు, ఒప్పందాలు లేకుండానే ఆర్ఆర్ పీ ఆర్ లో 99.9% వాటాగా మలుచుకోవచ్చన్న నిబంధన ఒప్పందంలో ఉంది. అయితే న్యూఢిల్లీ టెలివిజన్ కు సంబంధించి ఇప్పటికీ ప్రణయ్ దంపతులకు 32. 27% వాటా ఉంది. కానీ ఓపెన్ ఆఫర్ ప్రకటించాక న్యూఢిల్లీ టెలివిజన్లో ఎల్ టి ఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సహా మిగతా ఐదు కంపెనీలు తమ వాటాలు ఆదాని గ్రూప్ కే అమ్మే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ లెక్కన ఆదా నీ వాటా 46 శాతానికి చేరవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే 46% మాత్రమే కాకుండా మొత్తం న్యూఢిల్లీ టెలివిజన్ ను తానే దక్కించుకునేందుకు అదాని పావులు కదుపుతున్నారు.

NDTV Prannoy Roy
NDTV Prannoy Roy

దీనికి బీజం వేసింది అంబానీ

న్యూఢిల్లీ టెలివిజన్లో ఆదాని గ్రూప్ పాగా వేసేందుకు బీజం వేసింది రిలయన్స్ గ్రూపే. 2009లో ప్రణయ్ రాయ్ దంపతులకు రుణాలు మంజూరు చేసిన విసిపిఎల్, ఆ రుణాన్ని షినానో రిటైల్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ నుంచి పొందింది. ఇది కూడా వడ్డీ లేని రుణమే. ఇక షినానో కంపెనీ రిలయన్స్ గ్రూపుకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి వడ్డీ లేకుండా రుణాలు తీసుకొని దాన్ని వీసిపిఎల్ కి ఇచ్చింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం ఈ కంపెనీలన్నీ కూడా చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నవే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఎన్ డి టీవీ ని కొనుగోలు చేసేందుకు 2009లోనే బీజం పడింది. ఎందుకంటే దేశం మొత్తం మీద మీడియాను మేనేజ్ చేయగలిగిన మోడీ ఎన్డిటివి విషయానికి వచ్చేసరికి వెనకడుగు వేశారు. అందుకు కారణం ప్రణయ్ దంపతులు. ఈ ప్రణయ్ కి సోనియాగాంధీ అండదండలు మెండుగా ఉండేవి. ఇప్పుడు సోనియా గాంధీ అధికారానికి దూరంగా ఉన్నారు. యాదృచ్ఛికంగా ఇప్పుడు ప్రణయ్ రాయ్ కూడా ఎన్డిటీవీ కి దూరం అయ్యారు. ఏతా వాతా చెప్పొచ్చేది ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. తలకి మించిన అప్పు కంపెనీకి చేటు. ఇప్పుడు ఇది ప్రణయ్ రాయ్ కి బాగా అర్థమైంది. అది అర్థం అయ్యేలోపే తాను పెంచిన న్యూఢిల్లీ టెలివిజన్ అనే మొక్క అదాని కాంపౌండ్ లోకి వెళ్లిపోయింది.

Also Read:Cancer Screening: కోత కోయకుండానే కనిపెట్టొచ్చు: క్యాన్సర్ నిర్ధారణ ఇప్పుడు మరింత ఈజీ

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular