
తెలంగాణలో కేసీఆర్ కున్న రాజకీయ చతురత మరెవరికీ లేదనే చెప్పాలి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో తనదైన శైలిలో రాష్ట్రంలో మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడేళ్లుగా ఆయన పాలనపై కొన్ని విమర్శలు వస్తున్నా ప్రజలను, పార్టీ నాయకులను ఆకట్టుకునే విధంగా మాటల గారడీ చేస్తారని కొందరు అంటున్నారు. తాజాగా ఆయన ఏపీతో జల వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఈ వివాదం కొత్తేమీ కాదు. కానీ ఈ సమయంలో ఇంత రేజ్ చేయడానికి కారణమేంటని కొందరు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ ఏపీతో వివాదాలకు పోలేదు. రాష్ట్రం వచ్చిన కొత్తలో చంద్రబాబుతో దోస్తీ చేసి ఎలాంటి సమస్య రాకుండా చేశారు. ఆ తరువాత 2019 ఎన్నికల ముందే జగన్ అధికారంలోకి వస్తారని కేసీఆర్ భావించారు. అనుకున్నట్లుగానే జగన్ అధికారంలోకి వచ్చారు. దీంతో వీరి మధ్య అన్నదమ్మల స్నేహం కొనసాగింది. అటు గోదావరిపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఏపీలోని కొందరు ఆందోళన చేసినా.. ఏపీ సీఎం స్వయంగా ప్రాజెక్టు శంకుస్థాపనకు వెళ్లారు. దీంతో కేసీఆర్ జగన్ కు అన్ని విధాలుగా సహకారంగా ఉన్నారు.
ఇక ఆ మధ్య రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరురాష్ట్రాల విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరించుకుంటామని.. ఇందులో ఏ వివాదం తేవొద్దని కేసీఆర్ ప్రకటించారు. ఇక కర్ణాటక జల వివాదంలోనూ కేసీఆర్ జగన్ తో కలిసి సమస్యను పరిష్కరించారు. అయితే లెటేస్ట్ గా రాయలసీమ ప్రాజెక్టుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జల వివాదంలో తెలంగాణ కు అన్యాయం జరగనివ్వమని కేసీఆర్ ఇటీవల జరిగిన కేబినేట్ మీటింగ్ లో అన్నట్లు కొన్ని మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పుడే కేసీఆర్ ఈ వివాదాన్ని తెరపైకి తేవడాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు రకారకాలుగా చర్చించుకుంటున్నారు. గత నెల రోజుల కిందట తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసింది. ఆయన ఇటీవల ఎమ్మెల్యే, పార్టీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను పైకి తీసుకొచ్చినట్లు అనుకుంటున్నారు. ఉత్తర తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈటల ఇప్పటికే కేసీఆర్ ఆంధ్రోళ్లకు వత్తాసు పలుకుతున్నాడని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ వాదన సమసిపోయేలా ఏపీతో తాడో పేడో అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.