
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సీఎంగా చేసిన అనుభవం లేకున్నా.. రాజకీయ అనుభవం మాత్రం ఉంది. అందులోనూ తండ్రి వైఎస్సార్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్కడ హైకోర్టులో ప్రభుత్వం మీద ఎవరో ఒకరు ఏదో ఒక పిల్ వేయడం.. తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం జరుగుతోంది.
Also Read: మాట ఇచ్చి మరిచిపోతున్న ఏపీ సీఎం జగన్…?
మూడు రాజధానుల విషయమైనా.. పేదలకు భూములు పంచే విషయంలోనైనా.. ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పనినీ తప్పుబడుతూ ఓ వర్గం నిత్యం హైకోర్టులో పిల్స్ వేస్తూనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా నడుస్తోంది. కొంత కాలంగా హైకోర్టు ఇస్తున్న తీర్పులు, ఆదేశాలు చూస్తే అలానే అర్థమవుతోంది కూడా. మీడియాపైనా ఆంక్షలు విధించడం తాజాగా పెద్ద దుమారమే రేపుతోంది.
హైకోర్టు తీరుపై ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రశ్నిస్తున్నారు. పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తుండగా.. తాజాగా రాజ్యసభ ఎదుట వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. ఒక వర్గానికి అనుకూలంగా కోర్టు వ్యవహరిస్తోందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
రాజధాని భూముల వ్యవహారంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి రమేశ్, సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెల పేర్లు ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ఆ కేసు విచారించకుండా హైకోర్టు స్టే విధిస్తూనే ఆ సమాచారాన్ని మీడియాలో రాకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జాతీయ స్థాయిలో మీడియా సంస్థల నుంచి విమర్శలు వచ్చాయి. ఇదే విషయాన్ని పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రస్తావించారు.
Also Read: కప్పదాట్లను ప్రోత్సహిస్తే అంతే మరి..!
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఏపీ హైకోర్టుపై ఘాటుగానే స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉంది. ఈ ధోరణి వెంటనే మానుకోవాలి. న్యాయ వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది. మీడియా, సోషల్ మీడియాపై నిషేధం విధించింది. మాజీ అడ్వకేట్ జనరల్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ను రిపోర్టు చేయవద్దని నిషేధం విధించింది. బ్రిటిష్ తరహాలో వ్యవహరిస్తూ.. దీనికి సంబంధించిన మరో కేసు పైన కూడా స్టే విధించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారు. మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. జ్యుడీషియల్ నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కరోనా నియంత్రణలో ముందంజలో ఉంది’ అని తెలిపారు.
ఈ వ్యవహారమంతా చూస్తుంటే ఇన్నాళ్లు హైకోర్టు తీర్పులపై ఓపికతో ఉన్న వైసీపీ నేతలంతా ఒక్కసారిగా గళమెత్తుతుండడంతో పరిస్థితిలో సీరియస్‌నెస్ పెరిగినట్లైంది. ఒక్కో లీడర్ ఒక్కో వేదికపై ఆ విషయమై చర్చకు తీసుకువస్తుండడతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో హైకోర్టు తీర్పులు, ఆదేశాలపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, మేధావులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.