Vijayasai Reddy: ఇటీవల కాలంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోరు తగ్గింది. ఆయన వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. తనకు తాను తగ్గించుకున్నారా? లేక నాయకత్వం ప్రాధాన్యం తగ్గించిందా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. మునుపటిలా విజయసాయి తన నోరుకు పనిచెప్పడం లేదు. మాటలు చాలా పొదుపుగా వాడుతున్నారు. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేరు. ఒక వైపు నెల్లూరు రాజకీయాలు కాక రేపుతున్నా.. ఎక్కడా వాటిపై విజయసాయిరెడ్డి మాట్లాడిన దాఖలాలులేవు. దీనిపై అధికార పార్టీలోనే రకరకాల చర్చ నడుస్తోంది. వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? లేకుండా హైకమాండే కట్టడి చేసిందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఇంటా బయటా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కుటుంబసభ్యుల పాత్ర బయటపడిన నాటి నుంచి ఆయన అంతగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం తగ్గించేశారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో కూడా కనిపించడం అరుదుగా మారింది. దీంతో అసలుఏం జరుగుతోందన్న చర్చ అయితే అధికార పార్టీలో ప్రారంభమైంది. వాస్తవానికి విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ప్రత్యర్థులను తూలనాడడంతో పాటు కేంద్ర పెద్దలకు పొగడ్తలతో ముంచెత్తే వారు. వీటి కోసమే తన ట్విట్టర్ ఖాతాను ఒక ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. కానీ మునుపటిలా రాజకీయ కామెంట్స్ లేవు. కేంద్ర పెద్దల పొగడ్తలను నిలిపివేశారు.
విజయసాయిరెడ్డి అడపాదడపా తప్పిస్తే పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో కూడా కనిపించడం మానేశారు. ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు హాజరయ్యారు. అటు తరువాత బెంగళూరులో చికిత్సపొందుతున్న తన బంధువు తారకరత్నను పరామర్శించారు. అంతకు తప్పించి ఏ ఇతర విషయాల్లో జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. మొన్నటి వరకూ పార్టీలో ఏ2 గుర్తించబడిన విజయసాయికి సజ్జల రామక్రిష్ణారెడ్డి చెక్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు సజ్జల కనుసన్నల్లో నడుస్తున్నాయి. దీంతో విజయసాయి ఆధిపత్యానికి గండిపడినట్టేనని తెలుస్తోంది. అటు సోషల్ మీడియా విభాగ బాధ్యతలను సైతం సజ్జల లాక్కున్నారు. తన కుమారుడికి అప్పగించారు.

చివరకు తాడేపల్లి ప్యాలెస్ లోకి విజయసాయిరెడ్డికి ఎంట్రీ నియంత్రించారు. ఆయనకు అనుమతి లభించడం లేదన్న టాక్ నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బంధువు శరత్ చంద్రారెడ్డి అరెస్టయ్యారు. దానిని అడ్డుకోవడంలో విజయసాయిరెడ్డి విఫలమయ్యారు. అప్పటి నుంచి కుటుంబంలో కూడా విజయసాయిరెడ్డి మసకబారన్న ప్రచారం ఉంది. అటు పార్టీలోనూ, ఇటు కుటుంబంలోనూ పలుచన కావడంతో సైలెంటే శ్రేయస్కరమని భావించినట్టున్నారు. అందుకే వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. కారణాలు ఏవైనా ఒకప్పుడు పార్టీలో చక్రం తిప్పిన విజయసాయి ఒంటరైపోయారని ఆయన అనుచరులు, అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.