Telangana Formation Day 2023: అరెస్టులు, ఆందోళనలు, కేసులు, భాష్ప వాయు గోళాలు, అణచివేతల మధ్య.. 1200 మంది అమరుల త్యాగంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. నేటి జూన్ 2 తో 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ దశాబ్ది వేళన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. మరి ఆ ఉద్యమ నినాదం ఎంతవరకు అమలైంది?
నీళ్లు
తలాపున గోదావరి.. నీ బతుకేమో ఎడారి.. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కవులు రచించిన పాట ఇది. ఆ పాటకు తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రం లో గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ.. ఆ జలాలను సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వాటిని సద్వినియోగం చేసేందుకు ప్రభుత్వం కాలేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి 2016 మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2019 జూన్ 21న ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకంతో గతంలో 90 టీఎంసీలను కూడా సరిగ్గా వాడుకోలేని తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు ఏకంగా 400 టీఎంసీలను వినియోగించుకునే స్థాయికి ఎదిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే దశలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కాలేశ్వరం పంపు హౌస్ లు నీట మునిగాయి. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని ఇటీవల కాగ్ తూర్పార బట్టింది. తాము నిర్మించిన కాలేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రమోట్ చేసుకోవడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. కాలేశ్వరం మాత్రమే కాకుండా మిషన్ కాకతీయ ద్వారా 27,627 చెరువులను అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెబుతోంది. సాగుకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని వివరిస్తోంది.
నిధులు
“మా నిధులు మాకు కావాలి.” తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగిన నినాదం ఇది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు ప్రతినెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండెంట్లు పెట్టి అప్పులు తీసుకునే స్థాయికి దిగజారింది. ఖర్చులు విపరీతంగా ఉండడంతో భూములు అమ్మేందుకు కూడా ప్రభుత్వం వెనకాడటం లేదు. చివరికి ఔటర్ రింగ్ రోడ్డును కూడా 30 ఏళ్లపాటు అతి తక్కువ ధరకు ముంబైకి చెందిన ఓ కంపెనీకి అతి తక్కువ ధరకు లీజుకు ఇచ్చింది. ఇక ఏటి కేడు బడ్జెట్ అంచనాలు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం.. నిధుల మంజూరు విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. బడ్జెట్ అంచనాలు భారీగా ఉన్నప్పటికీ వాస్తవ రాబడి ఆ స్థాయిలో లేకపోవడంతో కుదింపులు కూడా చేపడుతోంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెక్కల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3.8 లక్షలు పెరిగిందని ప్రభుత్వం చెబుతుండగా.. రాష్ట్ర ప్రణాళిక సంఘం మాత్రం 3.17 లక్షలుగా వెల్లడించడం విశేషం.
నియామకాలు
తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధుల తర్వాత స్థానం నియామకాలది. అప్పట్లో ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను విస్మరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 9 సంవత్సరాల లో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతోంది. 80,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని వివరిస్తోంది. అయితే ఇంత గొప్పగా చెబుతున్న ప్రభుత్వం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్ష పేపర్లు లీక్ అయిన విషయాన్ని మాత్రం పక్కదారి పట్టిస్తోంది. ఇందులో సూత్రధారులను, పాత్రధారులను కాపాడే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.. ఇక ఉద్యోగ నియామకాలకు సంబంధించి మొన్నటిదాకా కాలయాపన చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో హడావిడిగా నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇదే సమయంలో సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రశ్న పత్రాలు లీకవుతున్నాయి.
సైడ్ ట్రాక్ పట్టించేందుకు
ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని పక్క దారి పట్టించేందుకు కొత్త కొత్త ఎత్తుగడలను తెరపైకి తీసుకొస్తుంది. కొత్త సచివాలయం నిర్మాణం పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సెక్రటేరియట్ ను కరోనాకాలంలో ప్రభుత్వం నేలమట్టం చేసింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కొత్తగా ట్విన్ టవర్స్ నిర్మించాలని యోచిస్తోంది. ఆ ట్విన్ టవర్స్ పేరుతో వివిధ శాఖాధిపతుల భూములను అడ్డగోలుగా అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వైఫల్యాలు, అతి స్వల్పమైన విజయాలు మాత్రమే కనిపిస్తున్నాయి.