TDP Janasena Alliance: ఏపీలో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీకి సంబంధించి అభ్యర్థుల మార్పులు, చేర్పులు ఒక కొలిక్కి వచ్చాయి. అయితే ఓ ఎంపీ, ఎమ్మెల్యే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో వారు పక్క చూపులు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టిడిపిలో ఒకరు, జనసేనలో మరొకరు చేరతారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే టిడిపి నుంచి బయటకు వెళ్ళనున్నట్లు ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ఆయన వైసీపీలో చేరిక దాదాపు ఖరారైనట్లు సమాచారం.
వైసిపి పెనమలూరు టికెట్ విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. ఇక్కడ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ నిరాకరించినట్లు సమాచారం. సీఎంవోకి పిలిచి మరి ఈ విషయం చెప్పడంతో ఆయన టిడిపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 17న చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మంత్రిగా తనకు అవకాశం ఇవ్వలేదని అసంతృప్తితో పాటు.. ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదన్న ఆలోచనతోనే పార్థసారథి టిడిపిలో వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన సామాజిక సాధికార యాత్రలో జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. అప్పటికే ఆయన చంద్రబాబుకు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. టిడిపి కండువా కప్పుకునేందుకు దాదాపు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా వైసీపీని వీడుతారని ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో సినీ దర్శకుడు వివి వినాయక్ ను పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. దీంతో బాలశౌరి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరి పొత్తులో భాగంగా మచిలీపట్నం నుండి మరోసారి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అటు బాలశౌరి అనుచరులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. బాలశౌరి జగన్ కు అత్యంత సన్నిహితుడని పేరుంది. కానీ పార్లమెంట్ స్థానం పరిధిలో ఇతర వైసీపీ నాయకులతో ఆయనకు పొసగడం లేదు. దీంతో హై కమాండ్ అతనిని తప్పించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అదే జరిగితే తాను పార్టీని వీడుతానని.. జనసేనలో చేరతానని అనుచరుల వద్ద బాలశౌరి చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. అంతవరకు వెయిట్ చేయాల్సిందే.