Schools Reopen: కరోనా కల్లోలం పడి రెండేళ్లుగా చదువులు సాగడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి స్కూళ్లు మూతపడ్డాయి. అయితే ఉధృతి తక్కువగా ఉండడంతో ఫిబ్రవరి 1 నుంచి విద్యావ్యవస్థలను రీఓపెన్ చేయనున్నట్టు తెలంగాణ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రకటించిన సెలవులు ఈనెల 31 వరకూ కొనసాగనున్నాయి. కాగా ఒమిక్రాన్ వ్యాప్తితో రాష్ట్రంలో కేసులు పెరగడం వల్ల ఈనెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జనవరి 16వరకూ సంక్రాంతి సెలవులు ఇచ్చారు.
సంక్రాంతి సెలవుల తర్వాత పెరుగుదల ఆగకపోవడం వల్ల ఆ సెలవులను 30 వరకూ పొడిగించారు. 15 ఏళ్లు దాటిన వారికి టీకా పంపిణీ, విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి టీకా ఇవ్వడం.. మరోవైపు జ్వర సర్వే పూర్తవ్వడం వల్ల కరోనా వ్యాప్తి తీరును అంచనా వేసిన సర్కార్ విద్యాసంస్థలను తెరిచేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 8,9,10వ తరగతుల విద్యార్థులతోపాటు ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఇవి ప్రత్యక్ష బోధనకు ప్రత్యామాయం కాదనే భావన విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. ఇక ఆన్లైన్ చదువులతో విద్యార్థులకు ఏం ఎక్కడం లేదని ఒత్తిడి వస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఇక వార్షిక పరీక్షల కోసం కూడా షెడ్యూల్ ను ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెలవులు కొనసాగుతుండడం వల్ల పరీక్షలపై ఇంకా తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు. విద్యా సంస్థలను తెరిచిన వెంటనే వార్షిక పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.