Bandi Sanjay Arrest : టెన్త్ హిందీ ప్రశ్నపత్రం పరీక్ష జరుగుతుండగానే బయటకు వచ్చిన అంశం తెలంగాణలో సంచలనం రేపింది. ఈ విషయంలో బీజేపీ స్టేట్‌చీఫ్ బండి సంజయ్‌ని మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్‌లో అరెస్ట్ చేయడం మరింత సంచలనమైంది. ఇదంతా ఒక ఎత్తయితే.. ప్రశ్నపత్రం బయటకు వచ్చిన అంశంపై 24 గంటల్లోనే పోలీసులు మాట మార్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అనేక సందేహాలకు తావిస్తోంది. మంగళవారం ప్రశ్నపత్రం లీక్ కాలేదని, పార్వర్డ్ మాత్రమే అయిందని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రకటించారు. మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ తనకు వచ్చిన ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో పలు గ్రూపులకు షేర్ చేశాడని, ఈ క్రమంలో 11:24 గంటలకు బండి సంజయ్‌తోపాటు పలువురు నేతలు ఉన్న వాట్సాప్ గ్రూప్‌లోకి ఫార్వార్డ్ చేశారని తెలిపారు. ఇక్కడ లీక్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.
-లీక్ చేశాడని తాజాగా కేసు…
24 గంటలు గడవక ముందే.. పోలీసుల తీరులో మార్పు వచ్చింది. మంగళవారం లీకేజీ జరగలేదని వరంగల్ సీపీ ప్రకటించగా, బుధవారం కమలాపూర్, కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. నిన్న లీకేజీ ప్రస్తావనే లేదని కేవలం ఫార్వర్డ్ మాత్రమే జరిగిందని ప్రకటించి.. నేడు లీకేజీ జరిగిందని బండి సంజయ్ పై కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది.
-విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన..
ప్రశ్నపత్రం లీక్ కాలేదని సీపీతోపాటు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా మంగళవారం స్పష్టత ఇచ్చారు. బుధవారం కమలాపూర్, కరీంనగర్‌లో ప్రశ్నపత్రం లీక్ అయిందని, ఇందులో బండి సంజయ్ కీలకంగా ఉన్నారని కేసు నమోదు చేయడం ఇప్పుడు ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులను ‘టెన్’షన్ పెడుతోంది. లీకేజీ నిజమని కోర్టు నమ్మితే పరీక్ష రద్దు చేయాల్సి వస్తుంది. అప్పుడు పరీక్ష మళ్లీ రాయాల్సి వస్తుంది. 24 గంటల్లోనే పోలీసులు మాట మార్చడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
– అనుమానాలెన్నో..
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చి విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
– వరంగల్ సీపీ రంగనాథ్ మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో 9.30 టెన్త్ పరీక్ష మొదలు కాగా, మైనర్ శివ గణేష్ 9.45 గంటలకు కమలాపూర్ పరీక్ష కేంద్రంలో చెట్టు ఎక్కి.. కిటికీ పక్కన ఉన్న విద్యార్థి పరీక్ష పేపర్ ఫొటో తీసుకున్నట్లు వెల్లడించారు.
– అ తర్వాత శివగణేశ్ మొదట తన ఫ్రెండ్ కి ప్రశ్నపత్రం ఫొటోలు పంపించాడని, అదే మెసేజ్ వరంగల్ మీడియా గ్రూప్‌కి 10.45 వచ్చిందని వెల్లడించారు.
– ఈ గ్రూపులో ఉన్న మాజీ జర్నలిస్టు బూర ప్రశాంత్ మీడియా గ్రూప్‌లో వచ్చిన హిందీ పేపర్‌ను హైదరబాద్‌లోని మీడియా హెడ్స్ కి 11.19 గంటలకు ఫార్వర్డ్ చేశాడు.
– 11.24 కి ప్రశాంత్ బండి సంజయ్‌తోపాటు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్న గ్రూప్‌కు అదే మెసేజ్‌ను ఫార్వర్డ్ చేశాడని సీపీ రంగనాథ్ ప్రకటించారు. లీక్ కాదని ఫార్వర్డ్ మాత్రమే అని సీపీ క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే పరీక్ష ప్రారంభమైన దాదాపు 2 గంటల తర్వాత ప్రశ్నపత్రం బండి సంజయ్‌కి చేరింది.
– సంజయ్‌కు చేరకముందే టీవీ చానెళ్లలో స్క్రోలింగ్..
వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పినట్లు.. హిందీ ప్రశ్నపత్రం బండి సంజయ్‌కి 11:24 గంటలకు చేరగా, టీవీ చానెళ్లలలో మాత్రం 11:15 హిదీ ప్రశ్నపత్రం లీకైనట్లు స్క్రోలింగ్ వచ్చింది. మాజీ జర్నలిస్ట్ మీడియ గ్రూపులో వేయడం వలన టీవీ చానెళ్లలో ప్రసారం అయింది. తన విధుల్లో భాగంగా పేపర్ లీక్ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసినట్లు ప్రశాంత్ కూడా వెల్లడించాడు. కానీ సంజయ్ లీకేజీలో కీలకం అని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనుమానాలకు తావిస్తోంది.
– శివగణేశ్‌కు, ప్రశాంత్‌కు లింక్ ఉందా..
అసలు ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో మొదట ఫొటో తీసిన వ్యక్తి శివగణేశ్‌కు, ఆ తర్వాత మీడియా గ్రూప్‌లో, రాజకీయ నేతల గ్రూప్‌లో పోస్టు చేసిన ప్రశాంత్‌కు లింక్ ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శివగణేశ్ కేవలం తన జూనియర్ స్నేహితుడి కోసం ఫొటో తీసినట్లు సీపీ ప్రకటించారు. తర్వాత ఆ ఫొటోలను తన ఫ్రెండ్‌కు పంపించాడు. అదే మెసేజ్ వరంగల్ మీడియా గ్రూప్‌కి 10.45 వచ్చిందని వెల్లడించారు. అయితే ఎక్కడా శివగణేశ్‌కు, మాజీ జర్నలిస్టుకు సంబంధం ఉన్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. మెసేజ్ కేవలం ఫార్వర్డ్ అయినట్లే నిర్ధారణ అయిందని తెలిపారు. ఫొటో తీసిన బాలుడికి, మాజీ జర్నలిస్ట్‌కు సబంధం లేనప్పుడు లీకేజీ కుట్ర అని ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ బండి సంజయ్‌కు పేపర్ ఫార్వర్డ్ చేసినంత మాత్రాన బండి సంజయ్ గారు పేపర్ లీక్ చేపించినట్టా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
-శివగణేశ్‌కు, బీజేపీకి సంబంధం లేదు..
ప్రశ్నపత్రం ఫొటో తీసిన శివగణేశ్ మైనర్. అతనికి ప్రశాంత్‌తో సంబంధం లేదు. బీజేపీతో కూడా అతనికి సబంధం లేదు. శివ గణే శ్ పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ఫొటో తీస్తుంటే ఆ స్కూల్ ప్రిన్సిపాల్, ఎగ్జామ్ ఇన్‌చార్జి, ఇన్విజిలేటర్ ఏం చేస్తున్నారని విచారణ చయాల్సిన ప్రభుత్వం నిన్న ఫార్వర్డ్ అని 24 గంటలు గడవక ముందే లీక్ అయిందని బండి సంజయ్‌పై కేసు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– సంజయ్ పేరే ఎందుకు ప్రస్తావించారు..
ఇక మంగళవారం ప్రెస్‌మీట్‌లో వరంగల్ సీపీ పదే పదే బండి సంజయ్ పేరు ప్రస్తావించారు. ప్రశాంత్ ప్రశ్నపత్రం ఫార్వర్డ్ చేసిన గ్రూపులో అనేకమంది బీఆర్‌ఎస్ నాయకులు కూడా ఉన్నారు. కానీ సీపీ మాత్రం కేవలం బండి సంజయ్ పేరునే మాత్రమే మీడియా సమావేశంలో ప్రస్తావించడం వెనుక కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-ప్రశాంత్ భుజంపై తుపాకి పెట్టి బండి సంజయ్ ను కాలుస్తున్నారా?..
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వ్యవహారం చూస్తుంటే.. మాజీ జర్నలిస్టు ప్రశాంత్ భుజంపై ప్రభుత్వం తుపాకి పెట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. కుట్రలో భాగంగానే బీఆర్‌ఎస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి ప్రశాంత్ బీజేపీ నేతలతో ఉన్న ఫొటోలు లీక్ చేశారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేతలతో ఫొటోలు దిగినంత మాత్రాన సంబంధం ఉన్నది నిజమైతే అదే ప్రశాంత్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు అనేక మంది బీఆర్‌ఎస్‌నాయకులతో కూడా ఫొటోలు దిగాడు. బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నది నిజమైతే ఆ పార్టీ నేతలే ప్రశ్నపత్రం ప్రశాంత్‌తో బండి సంజయ్ ఉన్న గ్రూపులోకి ఫార్యావర్డ్ చేయించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
– బీఆర్‌ఎస్ నాయకులకూ ప్రశ్నపత్రం
ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్‌తోపాటు బీఆర్‌ఎస్ నాయకులకు కూడా ఫార్వర్డ్ చేశాడు. కానీ, సీపీ సంజయ్ పేరును మాత్రమే బయటపెట్టాడు. బీఆర్‌ఎస్ నాయకుల పేర్లు మాత్రం వెల్లడించలేదు. వాస్తవంగా సీపీ తన బాధ్యతగా ప్రశాంత్ ప్రశ్నపత్రం పంపిన అందరిపేర్లు బయట పెట్టాలి. విచారణ పూర్తి కాలేదు కాబట్టి ఎవరి పేర్లు బయట పెట్టొద్దనుకుంటే అందరి పేర్లు దాచాలి. కానీ, బండి సంజయ్ పేరు మాత్రమే చెప్పడం వెనుక ప్రభుత్వం ఒత్తిడి ఉందా అన్న సందేహాలు వస్తున్నాయి.
మరి ఈ అనుమానాలకు అటు సీపీ రంగనాథ్ గానీ, ఇటు ప్రభుత్వం గానీ సమాధానం చెప్పాలి. కోర్టుకు కూడా సమర్పించాలి. లేని పక్షంలో ఇదంతా కుట్రలో భాగమే అని నమ్మడంతోపాటు అదే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపుపై ప్రభావం చూపుతుంది అన్నది మాత్రం నిజం