Preethi Died : ర్యాగింగ్.. ఈ భూతం ఇప్పటిది కాదు.. కాలేజీల్లో ఎప్పటి నుంచో ఉంది. ఎంతో మంది దీనికి బలి అయినా.. అవుతున్నా సీనియర్ల చేతిలో జూనియర్లు నలిగిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తాజాగా కాకతీయ మెడికల్ కాలేజీ ఓ సీనియర్ సైఫ్ వేధింపులకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ‘ప్రీతి’ ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. బ్రెయిన్ డెడ్ కావడంతో కృత్రిమ సాధనాలు తీసేయడంతో ఆమె మరణించారు.
ర్యాగింగ్ చేసిన సైఫ్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలు పాలు కాగా.. ఇప్పుడు ప్రీతి మరణంతో ప్రతి ఒక్కరి కడుపు రగిలిపోయింది. విద్యార్థి సంఘాలు,తల్లిదండ్రులు ప్రీతి మృతదేహంతో నిమ్స్ ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. నిమ్స్ లో కన్నుమూసిన ప్రీతి మృతదేహా తరలింపునకు ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. ఆస్పత్రికి మంత్రి కేటీఆర్ వచ్చి తమ బిడ్డ మరణానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణంగా చూసుకున్న తమ బిడ్డ నేడు ప్రాణాలు కోల్పోయి అచేతనంగా పడి ఉండటాన్ని చూసి బాధిత కుటుంబం రోదిస్తున్న తీరు ఆస్పత్రిలో ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.
హైదరాబాద్ నిమ్స్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి కన్నుమూయడంతో ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. విద్యార్థి సంఘాలతోపాటు గిరిజన సంఘాలు, బీజేవైఎం శ్రేణులు ఆందోళనకు దిగాయి.దీంతో నిమ్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
సైఫ్ లాంటి ఇగోయిస్టిక్ మానవ మృగాల వల్ల ఎంతో మంది ఆడబిడ్డలు బలి అవుతూనే ఉన్నారు. ప్రీతి మరణం అందరికీ ఓ కనువిప్పు కావాలి. . ఈ విష సంస్కృతి కాలేజీల్లో లేకుండా ఉక్కుపాదం మోపినప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడే చాన్స్ ఉంటుంది.