Ram Gopal Varma Vyuhaum: రాంగోపాల్ వర్మ రాజకీయ `వ్యూహాని`కి కసరత్తు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణాంతర పరిణామాలను సినిమాగా తెరకెక్కించనున్నారు. `వ్యూహం` పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా.. త్వరలో సెట్స్ పైకి వెళ్తోంది. వర్మ ఈ విషయాన్ని ప్రకటించారు. వర్మ `వ్యూహం` అధికార పార్టీ రాజకీయ వ్యూహమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సినిమా వెనుక రాజకీయ, సామాజిక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నాయి.

వివాదాస్పద సామాజికాంశాలే కథాంశంగా రాంగోపాల్ వర్మ సినిమాలు తెరకెక్కిస్తారు. అది కూడ ప్రజల్లో బాగా ఆసక్తి ఉన్న కథాంశమే ఎన్నుకుంటారు. ప్రజాశ్రేయస్సు కోసమో, సామాజిక ప్రయోజనాల కోసమో ఉపయోగపడే కథాంశాలను ఆయన ముట్టుకోరు. దీనికి కారణం ఫ్రీ పబ్లిసిటీ. వివాదాస్పద కథాంశాలను సినిమాగా తెరకెక్కిస్తే.. టైటిల్ ప్రకటన నుంచి సినిమా విడుదలయ్యే వరకు ఉచిత పబ్లిసిటీ దొరుకుతుంది. ఈ మార్కెటింగ్ టెక్నిక్ ఆధారంగా చేసుకుని ఆర్జీవీ గతంలో సినిమాలు చేస్తూ వచ్చారు. తాజాగా రాజకీయ కథాంశాల ఆధారంగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఆ సినిమాలకు అధికార పార్టీతో సంబంధాలు ఉన్నవారు నిర్మాతలుగా వ్యవహరించడం కొత్త చర్చకు దారితీస్తోంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, రక్తచరిత్ర, బెజవాడ రౌడీలు ఇలా వరుసగా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వారి చరిత్రను కథాంశంగా ఎన్నుకుని వర్మ సినిమాలు తీశారు. వీటిలో చాలా వరకు వైసీపీ నేతలే ఫైనాన్సింగ్ చేశారు. ఒకవేళ వైసీపీ నేతలు ఫైనాన్సింగ్ చేయకపోయినా.. ఫైనాన్సింగ్ చేసిన వారికి వైసీపీ ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది. దీంతో వర్మలో ఉన్న మరో కోణం వెలుగులోకి వచ్చింది. వైసీపీకి అనుకూలంగా వర్మ వ్యవహార శైలి ఉండటం ప్రజల్లో అనుమానాలురేకెత్తిస్తోంది.
తాజాగా `వ్యూహం, శపథం` అనే రెండు టైటిల్స్ ప్రకటించారు. సీఎం జగన్ బయోగ్రఫీ కాదని చెబుతూనే.. రాజశేఖర్ రెడ్డి మరణాంతర పరిస్థితులే కథాంశంగా తెరకెక్కిస్తానని ప్రకటించారు. అది కూడ సీఎం జగన్ తో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. వైఎస్ఆర్ మరణాంతరం జగన్ ఓదార్పు యాత్ర ప్రకటించారు. కానీ సోనియా ఆధ్వర్యంలోని కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పుయాత్రకు ససేమిరా అంది. దీంతో జగన్ కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుని ఓదార్పుయాత్ర మొదలుపెట్టారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు కూడ సహకరించారని జగన్ అప్పట్లో ఆరోపించారు. జగన్ ఎదుగుదలను కట్టడి చేయడంలో సోనియా, చంద్రబాబు పాత్ర ఉందన్న కోణంలో సినిమా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్జీవీ `వ్యూహం, శపథం` సినిమాలు రెండూ జగన్ పాదయాత్ర, పరిపాలనకు సంబంధించినవే అని చెప్పకనే చెబుతున్నారు. ఆర్జీవీ పదే పదే జనసేన పై అవాకులు, చవాకులు పేలడం వెనుకు కూడ వైసీపీనే ఉందని జనసైనికులు విమర్శిస్తున్నారు. ఆర్జీవీని జగన్ వాడుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్జీవీని జగన్ ప్రోత్సహించడం వెనుక సామాజిక కోణం కూడ ఉందని తెలుస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును వైసీపీ తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. భౌతికంగా దాడి చేసినట్టు రఘురామ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజు కులంలో వైసీపీ పై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని పసిగట్టిన జగన్.. ఆ దృష్టి మరల్చేందుకు అదే కులానికి చెందిన ఆర్జీవీతో పవన్ పై విమర్శలు చేయిస్తున్నారన్న వాదన బలంగా ఉంది. ఇందుకోసమే ఆర్జీవీని వైసీపీ వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు వల్ల కలిగే డ్యామేజీని ఆర్జీవీ ఎంట్రీతో పూడ్చాలని వైసీపీ ప్రయత్నిస్తోందని చర్చ నడుస్తోంది.

ప్రధానంగా సోనియా గాంధీ, చంద్రబాబు టార్గెట్ చేసి ఆర్జీవీ మార్క్ మూవీని రూపొందిస్తున్నారు. శరామామూలుగానే ఇందులో హీరో జగన్ అవుతారు. సోనియాను ఎదురించి బయటకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి.. సోనియా కుట్రలకు బలై జైలు పాలయ్యాడు జగన్. ఆ తర్వాత పాదయాత్ర చేసి కష్టపడి సీఎం అయ్యారు. సోనియాను ఎదురించి 16 నెలలు జైలు జీవితం గడిపి.. చంద్రబాబు తెరవెనుక మంత్రాగానికి బలమైన జగన్ నిలిచి గెలిచాడని ఈ సినిమాలో చూపించనున్నారు. అలాగే ఇందులో సోనియా, చంద్రబాబులను విలన్ లుగా చూపించబోతున్నారు. ఈ మేరకు ఆర్జీవీ నయా మూవీని ఎన్నికల ముందర రిలీజ్ చేసి వైసీపీకి లబ్ధి చేకూర్చే ఎత్తుగడ వేసినట్టు సమాచారం. దీనికి వైసీపీనే ఫైనాన్స్ చేస్తుందని.. ఏపీలో సినిమా ఆడేలా చేయబోతున్నట్టు సమాచారం.