India Road Network:భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణాలపై దృష్టి సారించింది. మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేయడంతో పాటు భారీగా జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చించింది. ఫలితంగా తొమ్మిదేళ్లలో భారతదేశ రోడ్లు 59 శాతం మేర పెరిగాయి.
సుశాల భారత దేశంలో అనేక ప్రాంతాలకు రోడ్లు లేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే అనేక ప్రాంతాలకు రోడ్లు పడుతున్నాయి. ఇప్పటికీ రోడ్లు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు రోడ్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేపట్టిందని, దీంతో రోడ్ నెట్వర్క్ లో భారతదేశం రెండో పొడవైనదిగా గుర్తింపు పొందిందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
64 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్..
భారతదేశమంతటా దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ ఉంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్దది. 2013 – 14 లో 91,287 కిలోమీటర్లుతో పోలిస్తే ప్రస్తుతం జాతీయ రహదారుల నెట్వర్క్ 1,45,240 కిలోమీటర్లు గా ఉందని రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. గడిచిన తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశమంతా భారీగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిందని, 59% వృద్ధి చెందినట్లు ఆయన వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో మోడీ ప్రభుత్వానికి 9 ఏళ్లు అనే అంశం పైన జరిగిన సదస్సులో ప్రసంగించిన కర్కరి తన మంత్రిత్వ శాఖలో జరిగిన అభివృద్ధిని వివరించారు. రోడ్డు నెట్వర్క్ లో భారతదేశం ఏడు ప్రపంచ రికార్డులు సృష్టించింది. అమెరికా తర్వాత భారత్ రోడ్డు నెట్వర్క్ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా నిలిచింది.
టోల్ ఆదాయం లక్షా 30 వేల కోట్లకు పెంచడమే లక్ష్యం..
2013 – 14 లో దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల ద్వారా ఆదాయం రూ.4,770 కోట్లు ఉండేది. 2030 నాటికి ఈ ఆదాయాన్ని లక్షా 30 వేల కోట్లకు పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. ప్రస్తుతం రూ.41,342 కోట్ల రూపాయల ఆదాయం టోల్ గేట్లు ద్వారా ప్రభుత్వానికి సమ కోరుతోంది. ఈ మొత్తాన్ని మూడు రెట్లు పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఫాస్ట్ టాగ్ వినియోగం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకండ్లకు తగ్గించడంలో సహాయపడింది. దీన్ని 30 సెకండ్ల కంటే తక్కువకు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.