KCR Vs BJP: కేంద్రంతో రణమా.. శరణమా! కేసీఆర్ ప్లాన్ ఏంటి?

KCR Vs BJP: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని.. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమించాలని సీఎం కేసీఆర్‌ తన మంత్రివర్గ సహచరులకు పిలుపునిచ్చారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుమారు 6 గంటలపాటు చర్చించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. టీఆర్‌ఎస్‌కు కేంద్రాన్ని విమర్శించే అంశాలేవీ దొరకడం లేదు. ఈ క్రమంలో మళ్లీ వరి పోరుకు పిలుపునిచ్చారు. -రేవంత్‌రెడ్డి పిలుపుతో ఉలిక్కిపడి.. […]

Written By: NARESH, Updated On : March 20, 2022 12:26 pm
Follow us on

KCR Vs BJP: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని.. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమించాలని సీఎం కేసీఆర్‌ తన మంత్రివర్గ సహచరులకు పిలుపునిచ్చారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుమారు 6 గంటలపాటు చర్చించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. టీఆర్‌ఎస్‌కు కేంద్రాన్ని విమర్శించే అంశాలేవీ దొరకడం లేదు. ఈ క్రమంలో మళ్లీ వరి పోరుకు పిలుపునిచ్చారు.

-రేవంత్‌రెడ్డి పిలుపుతో ఉలిక్కిపడి..
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో వరి వేయద్దని సీఎం కేసీఆర్‌ గత డిసెంబర్‌లో రైతులకు సూచించారు. యాసంగిలో అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాలే ఉంఢవని ప్రకటించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం చేసుకున్నవారు మాత్రమే వరి వేసుకోవాలని సూచించారు. దానికి కూడా ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఏటా యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ముఖ్యమంత్రి మాటలతో ఈసారి కేవలం 30 లక్షల ఎకరాల్లోనే వరి వేశారు. మరో 10 లక్షల ఎకరాల్లో ఆరు తడి పంటలు సాగుచేశారు. మరో 20 లక్షల ఎకరాలను రైతులు బీడుగానే వదిలేశారు. నీటి సౌకర్యం ఉన్నా పంట వేసుకోలేదు. రైతులను వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో సుమారు 150 ఎకరాల్లో వరి సాగుచేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించాడు. కేసీఆర్‌ పండించిన ధాన్యం కొనేటోడే తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనాలని డిమాండ్‌ చేశారు. రైతులకు వాస్తవం తెలిపేందుకు ఫాంహౌస్‌ పరిశీలనకూ బయల్దేరాడు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఫాంహౌస్‌లో సాగుచేసిన వరి పంటకు సంబంధించిన ఫొటోలు మాత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో యాసంగి ధాన్యం కొనకపోతే రైతుల్లో అభాసుపాలవుతామని భావించిన సీఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోలుపై మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

-టీఆర్‌ఎస్‌ ఎల్పీ మీటింగ్‌..
సోమవారం టీఆర్‌ఎస్‌ ఎల్పీ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలుపై ఒత్తిడి తేవాలని భావిస్తున్న కేసీఆర్‌ ఇందుకు పార్లమెంట్‌ వేదికగా పోరాటం చేయాలని భావిస్తున్నారు. మరోపైపు మంత్రులతో కలిసి ప్రధానిని కూడా కలవాలని భావిస్తున్నారు..

-ప్రధానిని కలిసేంది అందుకేనా?
రెండే నెలలుగా కేంద్రంపై, రాష్ట్రంలో బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్న కేసీఆర్‌ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త వెనక్కి తగ్గారు. దేశంలో దుర్మార్గ పాలన నడుస్తోంది, ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పదేపదే ఆరోపిస్తున్న సీఎం కేసీఆర్‌ ఇటీవల నిర్వహించిన పలు మీటింగుల్లో కేంద్రంపై కొట్లాడేందుకు పోతున్న అని ప్రకటించారు. మీరు ఆశీర్వదించాలని అభ్యర్థించారు. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్‌ అయ్యారు. ఇప్పుడు వరి పోరు సాకుతో మళ్లీ ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారు. ప్రధానిని కూడా కలవాలని భావిస్తున్నారు. రెండు నెలలుగా చేసిన తీవ్ర ఆరోపణలు, ప్రధానిని, కేంద్ర మంత్రిని దూషించిన విషయాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు ఇక తెలంగాణపై దృష్టిపెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రం హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రణం.. కంటే శరణమే మేలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే వరి పోరు పేరిట ప్రధానిని కలిసేందుకు బయల్దేరుతున్నట్లు సమాచారం. మరోవైపు కేటీఆర్‌ బినామీ కంపెనీలపై శనివారం ఐటీ దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో కేంద్రంతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.