Janasena Avirbhava Sabha Highlights: ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతీసారి కూడా అధికార ప్రభుత్వాన్ని.. చేస్తున్న తప్పులను ప్రణాళికబద్దంగా విమర్శిస్తున్నారు. తాజాగా ఏపీలోని ఇప్పటంలో నిర్వహించిన జనసేన 9వ ఆవిర్భావ సభలోనూ పవన్ కళ్యాణ్ రెండు గంటల ప్రసంగంలో ఎన్నో ప్రశ్నలు సంధించాడు. వైసీపీని కడిగిపారేశారు. వైసీపీ పాలన వైఫల్యాలను ప్రజల ముందు ఉంచారు. ఇసుక దోపిడీ నుంచి మొదలుపెడితే అప్పులు తిప్పలు, అవినీతి, రోడ్ల అధ్వానం, మద్యం నిషేధం పేరిట నకిలీ బ్రాండ్లు, ఉద్యోగాలు కల్పించకపోవడం.. ఉద్యోగ సమస్యలు, నిరుద్యోగ వెతలు, ప్రకృతి వనరుల దోపిడీ వరకూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలపై ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాదాపు 100 వరకూ తప్పులను పవన్ కళ్యాణ్ ఎత్తి చూపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఏపీ ప్రజలే కాదు.. వైసీపీ నేతలు అందరూ మొత్తం చూసేశారు. అందుకే ఇలా పవన్ ప్రసంగం ముగియగానే.. వెంటనే మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబులు స్పందించారు. తాము పవన్ ప్రసంగాన్ని మొత్తం చూశామని.. దానికి కౌంటర్ ఇచ్చారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు దాడి ప్రారంభించారు. వైసీపీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబులు తీవ్రంగా కౌంటర్లు ఇచ్చారు. చంద్రబాబు, వైసీపీకి, నాగబాబుకు నమస్కారం పెట్టిన పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఎందుకు పెట్టలేదని వైసీపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.
తనను వైసీపీ నేతలు మానసిక అత్యాచారం చేస్తున్నారని గగ్గోలుపెడుతున్న పవన్ కళ్యాణ్ ఆయన మాత్రం మంత్రులు వెల్లంపల్లి, అవంతి, అంబటి రాంబాబులను మాత్రం తిట్లతో మానసిక అత్యాచారం చేయవచ్చా? అని పేర్ని నాని నిలదీశారు. అందరినీ మానసిక అత్యాచారం చేస్తున్న పవన్ కు ఏమైనా లైసెన్స్ ఉందా? అని ప్రశ్నించారు.
ఇక చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ కళ్యాణ్ ఉబలాటపడుతున్నారని.. ఇప్పటం సభలో బీజేపీ, టీడీపీని కలిపి వైసీపీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.
పవన్ చేసిన ఏ ప్రశ్నకు వైసీపీ నేతలు సమాధానం ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్యలు వదిలేసి వ్యక్తిగత దాడిచేశారు. మద్యనిషేధం చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు నకిలీ బ్రాండ్లతో ప్రజల ఒళ్లు గుల్ల చేస్తోందని.. వారిని దోపిడీ చేస్తోందని సూటిగా ప్రశ్నించారు. దీనికి పేర్ని నాని కానీ.. అంబటి రాంబాబు కానీ సమాధానం ఇవ్వలేదు. ఇక రోడ్లు అధ్వానంపై ప్రశ్నించారు. దానికి పేర్ని నాని సమాధానం ఇవ్వలేదు. చంద్రబాబు హయాంలో రోడ్లు అద్దంలా ఉన్నాయా? అంటూ సమాధానాన్ని దాటవేశారు. తమ సమస్యలపై క్లారిటీ ఇవ్వలేదు.
వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటిలు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడికే ప్రయత్నించారు. చిరంజీవిని ఎందుకు పవన్ స్మరించుకోలేదని ప్రశ్నించారు. కానీ ఎన్నో వేదికలపై పవన్ తనకు సినిమా, రాజకీయ జన్మనిచ్చింది చిరంజీవి అని చెప్పారు. అన్నయ్య లేకపోతే నేను లేనన్నారు. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి అంటే ఎంత అభిమానమో.. ప్రాణమో అందరికీ తెలిసిందే. కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని వైసీపీ నేతలు అన్నాదమ్ముల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత దాడులు చేశారు. పవన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పవన్ ఫ్యామిలీని, చంద్రబాబుతో పొత్తులను, బీజేపీని బూచీగా చూపడంపైనే వైసీపీ నేతల విమర్శలు చేశారు. అంతే తప్ప ఎక్కడా పవన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు.