Hindi Hiwas 2023: హిందీ.. భారత జాతీయ భాష. ఏటా సెప్టెంబర్ 14న జాతీయ భాషా దినోత్సవం… హిందీ దివస్‌గా జరుపుకుంటున్నాం. హిందీ భాష వినియోగం పెంచడం, హిందీ భాషలో సేవలు చేస్తున్న వారిని గుర్తించి అభినందించే ఉద్దేశంతో హిందీ దివస్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
హిందీ దివస్ చరిత్ర ఇదీ..
1949లో భారత రాజ్యాంగ సభ ద్వారా హిందీని అధికారిక భాషగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్ లేదా జాతీయ హిందీ దినోత్సవం జరుపుకుంటున్నాం. మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈ రోజున హిందీ దివస్ జరుపుకోవాలని నిర్ణయించారు. భారత జాతీయోద్యమంలో సాధారణ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. అందుకే గాంధీజీ స్ఫూర్తితో 1949, సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ ఆ రోజుల్లో పొందుపరిచారు. అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం నిర్వహిస్తున్నారు. సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ, బంగ్లా, బోడో, డోగ్రీ, సంథాలీ, గుజరాతీ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సింధి, ఉర్దూ భాషలను రాజ్యాంగం గుర్తించింది.
ఎక్కువ మంది మాట్లాడే రెండో భాష..
ఇక మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండవది కావడం విశేషం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషను 600 మిలియన్లకు పైగా జనాలు మాట్లాడతారు. మన జాతీయ భాషగా పేరుగాంచిన ‘హిందీ‘ భాషకు ‘హిందీ దివస్‘ అని ఈ రోజు పిలుచుకుంటాం. మన అధికారిక భాష హిందీ దేవనాగరిక లిపి నుంచి రూపొందించబడింది. హిందీ భాష చాలావరకూ సంస్కృతం నుంచి గ్రహించబడింది. అయితే కాలక్రమంలో ఉత్తర భారతదేశంలోని ముస్లిం ప్రభావం వల్ల పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష ఆవిర్భవించింది.
హిందీ మాట్లాడే ఇతర దేశాలివే..
ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషను 600 మిలియన్లకుపైగా జనాలు మాట్లాతున్నారు. 425 మిలియన్ల మందికి హిందీ మాతృభాషగా ఉంది. 120 మిలియన్ల మందికి రెండవ భాషగా హిందీ ఉంది.
ఇండియాలోనే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు. ఇండియాలో కాకుండా మారిషస్, నేపాల్, ఫుజి, గయానా, సురినామ్, ట్రినిడాడ్ అండ్ టోబాగో దేశాల్లో హిందీ భాష మాట్లాడతారు.