Site icon OkTelugu

Jubilee Hills Gang Rape: గ్యాంగ్‌ రేప్‌ కేసు.. గంటకో మలుపు.. కీలకంగా మారిన కార్లు

Jubilee Hills Gang Rape: రాష్ట్ర రాజధాని, విశ్వనగరం, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో సంచలనం రేపిన మైనర్‌ బాలిక కేసు గంటగంటకో మలుపు తిరుగుతోంది. ప్రతిపక్షాల ఆందోళన, మీడియా చొరవతో పోలీసులు విచారణ వేగంవంతం చేశారు. ఈ కేసు విచారణలో ప్రస్తుతం కార్లు కీలకంగా మారాయి. ఈ కేసులో సైన్టిఫిక్‌ ఎవిడెన్స్‌ కోసం ఫోరెన్సిక్‌ నిపుణులు జూబ్లీ హిల్స్‌ పోలీస్టేషన్‌లో ఉన్న బెంజ్, ఇన్నోవా కార్లను ఫోరెన్సిక్‌ బృందం పరిశీలించింది.

Jubilee Hills Gang Rape

కార్లలో కీలక ఆధారాలు..
దర్యాప్తులో భాగంగా కార్ల నుంచి కీలక ఆధారాలు సేకరించింది.
క్లూస్‌ టీం బెంజ్‌ కారులో బాధితురాలి చెప్పు, వెంట్రుకలు, చెవిరింగ్‌ స్వాధీనం చేసుకుంది. అలాగే అత్యాచారం చేసిన ఇన్నోవా కారులో ఫింగర్‌ ప్రింట్స్‌ను సేకరించింది క్లూస్‌ టీం. మరోవైపు గ్యాంగ్‌ రేప్‌ కేసు క్రై మ్‌ థ్రిల్లర్‌ ను తలపిస్తోంది. ఎమ్మెల్యే రఘునందన్‌ రిలీజ్‌ చేసిన ఆధారాల్లో ఎమ్మెల్యే కొడుకు వీడియోను పోలీసులు పరిశీలించారు. వీడియోను లీగల్‌ ఒపీనియన్‌ కోసం పంపించారు. లీగల్‌ ఒపీనియన్‌ కేసు విచారణలో కీలకంగా మారనుంది.

నిందితులంతా రాజకీయ నేతల పుత్ర రత్నాలే..
మరోవైపు అమ్నేషియా పబ్‌ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘునందన్‌రావు రిలీజ్‌ చేసిన వీడియో ఆధారంగా పాతబస్తీకి చెందిన ఓ ఎమ్మెల్యే కొడుకు పేరును ఈకేసులో చేర్చే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా చేరిస్తే నేరస్తుల సంఖ్య ఆరుకు చేరుతుంది. అయితే సదరు ఎమ్మెల్యే కుమారుడు విదేశాల పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. అతడి జాడ కోసం గాలిస్తున్నారు. రేప్‌ కేసులో నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా గుర్తించారు. ఏ1 నుంచి ఏ6 వరకూ పొలిటికల్‌ పుత్ర రత్నాలేనని చెబుతున్నారు పోలీసులు. వీరందరూ ఒకే పార్టీకి చెందిన నేతల కుమారులు కావడంతో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఏ5 నిందితుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని మైనర్‌ నిందితుడు స్టేట్మెంట్‌ రికార్డు చేశారు. మైనర్‌ ను జువైనల్‌ హోమ్‌ కి తరలించారు..

Jubilee Hills Gang Rape

గ్యాంగ్‌ రేప్‌ తర్వాత ఫాంహౌస్‌కు…
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్‌లో ఆశ్రయం పొందారు. ఫామ్‌ హౌస్‌లో మందు పార్టీ చేసుకున్నారు. యువకులు ఎంజాయ్‌ చేస్తూ, వీడియోలను వాట్సప్‌ గ్రూప్‌లలో, అలాగే స్నేహితులకు షేర్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు తీసుకున్న వీడియోలు వాట్సప్‌ స్టేటస్‌ పెట్టుకోవడంతో వాటిని డౌన్‌లోడ్‌ చేసి వైరల్‌ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఘటన జరిగిన తరువాత నిందితులు పోలీసులు పక్కదోవ పట్టించేలా వ్యవహరించారు. తాము గోవా పోతున్నామని చెప్పి, వారి దగ్గర ఉన్న మొబైల్‌ ఫోన్స్‌ వారి ఫ్రెండ్స్‌ ఇచ్చి, మరో ఫోన్, సిమ్‌ తీసుకోని దొరకకుండా కర్ణాటక కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

వాస్తవాలకు భిన్నంగా పోలీసుల దర్యాప్తు…
ఇక పోలీసులు చెపుతున్న దానికి వాస్తవాలకు భిన్నంగా ఉండడంతో దర్యాప్తుపై అనేక అనుమాలు కలుగుతున్నాయి. దీంతో కేసును విచారణ కోసం ఓ ఏసీపీ స్థాయి అధికారికి అప్పగించి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు చేయకపోతే కోర్ట్‌ మెట్లు ఎక్కుతామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రేప్‌ కేసుపై తెలంగాణ గవర్నర్‌ తమిళిౖసై కూడా స్పందించారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు.

Exit mobile version