Site icon OkTelugu

MLC Kavita – ED : 7 గంటల పాటు విచారణ.. మరి కవిత సంతకాలు ఎందుకో?

MLC Kavita – ED : ఢిల్లీ మద్యం కుంభకోణంలో సోమవారం బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వెళాల్సిన కవిత 10:30కే ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత విచారణ సాగింది. మధ్యాహ్నం ఒక్కసారి మాత్రం కవిత బయటకు వచ్చారు. అక్కడి ఈడీ క్యాంటిన్‌లో ఆహారం తీసుకున్నారు. తర్వాత మళ్లీ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా అరుణ్‌ రామచంద్ర్‌ పిళ్లైని కూడా ఈడీ అధికారులు పిలిపించారు. ఇద్దరినీ కాన్‌ఫ్రంటేషన్‌ విధానంలో విచారించినట్టు సమాచారం. ‘రామచంద్రన్‌ పిళ్లై మీకు ఎలా పరిచయం? ఎవరి ద్వారా పరిచయం? సౌత్‌ గ్రూప్‌లో పెట్టుబడులు ఎలా పెట్టారు? అంత డబ్బు మీకు ఎక్కడిది? ఇలా పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు కవిత నుంచి ఎటుంటి సమాధానం రాలేదని సమాచారం.

కన్‌ఫ్రంటేషన్‌ విధానంలో ఈడీ అధికారలు

ఈడీ అధికారులు సోమవారం కవితను కన్‌ఫ్రంటేషన్‌ విధానంలో విచారించారు. నలుగురితో కూడిన అధికారుల బృందం కవితను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకానొక దశలో అధికారుల దూకుడుకు కవిత అలా నిశ్చేష్టురాలైపోయింది. అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లైని తీసుకురావడంతో కవిత ఆశ్చర్యపోయింది. అతడి రాకతో ఆమె ముఖం మారిపోయింది. దీనిని ఈడీ అధికారులు ప్రముఖంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం పొద్దుపోయే దాకా సాగింది. సాయంత్రం ఏడు గంటలు దాటినా కవిత బయటకు రాకపోవడంతో బీఆర్ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. మరో వైపు కవిత వ్యక్తిగత లాయర్‌ సోమ భరత్‌, అడ్వకేట్‌ జనరల్‌ గండ్ర మోహన్‌రావు ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లడంతో కవితను అరెస్ట్‌ చేస్తారేమోన్న ఆందోళన నెలకొంది.

కవితను సుమారు ఏడు గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. డాక్యుమెంటేషన్‌పై ఆమె సంతకాలు తీసుకున్నారు. విచారణ ముగిసింది అని చెప్పేందుకేనా లేక కవితను అరెస్ట్‌ చేసే ముందుకు సంతకాలు తీసుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు కొంతమంది వైద్యులు ఈడీ కార్యాలయంలోకి వెళ్లడంతో ఒకింత ఉత్కంఠ నెలకొంది. మహిళన సాయంత్రం ఆరు గంటల దాకా విచారించకూడదని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసినప్పటికీ ఈడీ అధికారులు సాయంత్రం ఏడు దాటిన తర్వాత కూడా ఆమెను తమ కార్యాలయంలోనే ఉంచి విచారణ చేయడం గమనార్హం.

మరోవైపు ఢిల్లీలోనే ఉన్న మంత్రి కేటీఆర్‌ ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఇంటలిజెన్స్‌ అధికారులు కూడా ఈడీ పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో ఉండగా, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఢిల్లీ పరిణామల నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులకు కేసీఆర్‌ నుంచి కీలక ఆదేశాలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.

Exit mobile version