స్థానిక సంస్థల ఎన్నికల ముందు టిడిపి కి భారీ షాక్ తగిలింది. టిడిపి కి ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. టిడిపి అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మాణిక్యవరప్రసాద్ లేఖలో పేర్కొన్నారు.
రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. టిడిపి నేతల చౌకబారు విమర్శలను తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు.
ఎన్నికల తర్వాత కూడా టిడిపి అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందని పేర్కొన్నారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే తాను వైసిపి కి మానసికంగా దగ్గరయ్యానని.. అయితే వైసిపి నాయకత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదని మాణిక్యవరప్రసాద్ లేఖలో తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ ను కలసి ఆయన ఆ పార్టీలో చేరవచ్చని ప్రచారం జరుగుతున్నది.
2004, 2009లలో తాడికొండ నుండి శాసన సభకు ఎన్నికైన ఆయన వై ఎస్ రాజశేఖరరెడ్డి, కె రోశయ్య, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాలలో పనిచేశారు. 2004లో తాడికొండ నుండి ఓటమి చెందగానే అప్పడు అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీలో చేరి, ఒక కార్పోరేటిన్ చైర్మన్ పదవి పొందారు. ఆ తర్వాత శాసనమండలికి కూడా ఎన్నికై, ప్రభుత్వ విప్ గా వ్యవహరించారు.
2019 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటి నుండి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. రాజశేఖరెడ్డి మరణం అనంతరం జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం విముఖంగా ఉన్న సమయంలో `జగన్ లేని ప్రభుత్వాన్ని ఊహించలేక పోతున్నాను’ అంటూ ప్రకటన చేశారు.
కానీ ఆ తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయి, మరో పార్టీ పెట్టుకున్నా డొక్కా మాత్రం మంత్రి పదవిలో కొనసాగుతూ ఉండడమే కాకుండా, జగన్ పై నిశితంగా విమర్శలు చేస్తూ వచ్చారు.