Cockroach Janata Party youth politics: ఇటీవలి కాలంలో దేశంలో జరుగుతున్న కొన్ని నిరసన కార్యక్రమాలు యువత మానసిక స్థితిని, రాజకీయ ఉద్దేశాలను, దేశ భద్రతను ఒకేసారి ప్రశ్నించేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ పేరుతో వచ్చిన ఈ ఉద్యమం సామాజిక మాధ్యమాల్లో హైప్ సృష్టించినప్పటికీ, నిజం పరీక్షలో తేలిపోయింది. జెన్‌జీ యువతలో మానసిక వృద్ధాప్యం, గుర్తింపు సంక్షోభం ఈ నిరసనల్లో పాల్గొన్న యువకులు తాము ఎందుకు రంగంలోకి దిగారో స్పష్టంగా తెలియని పరిస్థితి కనిపించింది. కర్రలు, పెప్పర్ స్ప్రేలు తీసుకుని వచ్చి ‘‘కొట్టండి, తిరగబడండి, నరకండి’’ వంటి పిలుపులు ఇవ్వడం హింసా వైఖరిని ప్రతిబింబిస్తోంది. ఇది గుర్తింపు కోసం చేసే ఉద్యమం కాదు, మానసిక అపరిపక్వత వల్ల ఏర్పడిన ఆందోళనగా కనిపిస్తోంది. యువత తమ నిరాశలను, ఉద్యోగాలు, విద్యా వ్యవస్థ సమస్యలను రాజకీయ శక్తులు తప్పుదోవ పట్టించడానికి ఉపయోగించుకుంటున్నారు.
జంతర్ మంతర్ వద్ద నిరసన..
నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసనకు లక్షలాది మంది వస్తారని ప్రకటించినప్పటికీ హాజరు అంతంతమాత్రంగానే ఉండటం ఆయోజకుల తప్పిదాన్ని బయటపెట్టింది. సోషల్ మీడియా హైప్‌తో ప్రారంభమైన ఉద్యమం ఆఫ్‌లైన్‌లో తేలిపోవడం ఈ నాటకం పరిమితులను చూపించింది. ఇది నిజమైన ఉద్యమం కాదని, తప్పుడు ప్రచారం ద్వారా యువతను ఆకర్షించి రాజకీయ లాభం కోసం వాడుకోవాలనే ప్రయత్నమని స్పష్టమవుతోంది.
రాజకీయ ఆయుధంగా నీట్..
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను సమస్యగా చూడాలి, కానీ దాన్ని రాజకీయ లాభం కోసం ఉపయోగించడం సరైన విధానం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ సమస్యను రాజకీయీకరణ చేసి యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యా వ్యవస్థ సంస్కరణ కోసం నిర్మాణాత్మక చర్చలు చేయాల్సిన చోట, హింసాత్మక నినాదాలు, దేశ వ్యతిరేక ధోరణులు ప్రదర్శించడం యువత భవిష్యత్తును దెబ్బతీస్తోంది.
విదేశీ సహకారంతో దేశ ద్రోహ కార్యకలాపాలు..
కాక్రోచ్ జనతా పార్టీ కార్యక్రమాల వెనుక పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాల సహకారం ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరగడం ఎవరికీ మంచిది కాదు. చైనాలో ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర చర్యలు తీసుకుంటారు. కానీ భారతదేశంలో వామపక్ష, కాంగ్రెస్ భావజాలం ఉన్నవారు దేశ భావన ఉన్నవారిపై తిరగబడుతున్నారు. జాతీయవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ నిరసనలపై దేశభక్తులు తమ నిరసన తెలుపుతున్నారు.
యువ శక్తి నిర్వీర్యం..
తప్పుడు ప్రచారం, మోసాల ద్వారా యువతను రాజకీయ ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. ఇలాంటి ఉద్యమాలు దీర్ఘకాలికంగా యువతలో నిరాశ, విద్వేషాలను మాత్రమే పెంచుతాయి తప్ప, నిజమైన సమస్యలకు పరిష్కారం ఇవ్వవు. విశ్లేషకులు చెబుతున్నట్లు, యువత ఇప్పుడు సరైన మార్గదర్శకత్వం, నిజాయితీ ఉన్న నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది.
నిరసనలు ప్రజాస్వామ్య హక్కు, కానీ దాన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలు, హింస, తప్పుడు ప్రచారం కోసం ఉపయోగించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఉద్యమాలు యువతను మేల్కొల్పడం కాదు, మరింత గందరగోళంలోకి నెట్టడమే. యువత తమ శక్తిని నిర్మాణాత్మక దిశగా మళ్లించుకోవాలి. దేశం అభివృద్ధి చెందాలంటే, యువతను రాజకీయ మోసాల నుంచి రక్షించడం అందరి బాధ్యత.
