Chandrababu- BJP: బీజేపీని దారికి తెచ్చుకునే పనిలో చంద్రబాబు పడ్డారా? ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారా? అయినా హైకమాండ్ పెద్దల మనసు కరగడం లేదా? అందుకే ఇప్పుడు ప్లాన్ బీని సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కర్నాటక ఎన్నికల తరువాత తన ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయన్న ఆశాభావంతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో అన్నది అనుమానమే. బీజేపీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడమే అందుకు కారణం. ఆయన చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలవుతుండడంతో మరింత పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా మోదీ, షా ద్వయాన్ని ఒప్పించేందుకు తన టీమ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ తప్పిదంతోనే.
గత ఎన్నికల్లో ఎన్డీఏను వీడి చంద్రబాబు తప్పుచేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి మరో తప్పుచేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టి మూడో తప్పుచేశారు. అందుకే బీజేపీ పెద్దలు చంద్రబాబును నమ్మడం లేదు. గతంలో చేసిన తప్పిదాలన్నింటికీ క్షమించి మీ టీమ్ లో చేర్చుకోండి అని కాళ్లవేళ్లా పట్టినా కనికరించడం లేదు. కాంగ్రెస్ పార్టీ బతికడం బీజేపీకి ఇష్టం లేదు. అలాగని ప్రాంతీయ పార్టీలు ఉండి.. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలన్నది బీజేపీ ప్లాన్. అప్పుడే కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగించగలమని.. సుదీర్ఘ కాలం మనగలమని మోదీ, షా ద్వయం భావిస్తూ వస్తోంది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోయాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఆ పరిణామమే బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యే మార్గాలను మూసివేయించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వారంతా ఆ ప్రయత్నంలోనే..
అయితే ప్రస్తుతం బీజేపీ నేతలుగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్, పాతూరి నాగభూషణం వంటి నేతలంతా హైకమాండ్ పెద్దలకు ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. సత్యకుమార్ ను ముందు పెట్టి రాజకీయాలు నడుపుతున్నారు. ఎలాగైనా టీడీపీతో కలిసి వెళ్లాల్సిందేనని అధిష్ఠానానికి చెబుతున్నారు. అయితే వీరి ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.కానీ సానుకూల వాతావరణం సృష్టించేందుకు వీరు చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు కొత్తగా హైకమాండ్ వైసీపీ సర్కారు తప్పిదాలపై ఓ చార్జిషీట్ కమిటీని వేసింది. ఆ కమిటీలో టీడీపీ అనుకూల బీజేపీ నాయకులకు స్థానం కల్పించింది. అందులో సుజనా చౌదరి, సత్యకుమార్ ల కు చోటు దక్కడంతో ఇక మా మాటకు తిరుగులేదని.. సోము వీర్రాజు నాయకత్వాన్ని తగ్గించేందుకేనని టీడీపీ అనుకూల బీజేపీ నాయకులు ప్రచారం ప్రారంభించారు.
కర్నాటక ఎన్నికల తరువాత..
కర్నాటక ఎన్నికల తరువాత బీజేపీ వెనక్కి తగ్గుతుందని.. అక్కడ ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం టీడీపీతో పొత్తుకు రెడీ అవుతుందన్న టాక్ నడుస్తోంది. దానినే చంద్రబాబు ప్లాన్ బీ గా అమలుచేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. మొన్నటికి మొన్న ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఫర్చువల్ డిబేట్ లో చంద్రబాబు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. ఎన్డీఏతో కలిసి నడవాలని ఉందని చెప్పుకొచ్చారు. అంతకు ముందు బీజేపీ పెద్దలను పవన్ కలిశారు. చర్చలు జరిపారు. జాతీయ మీడియాలో ఎన్డీఏకు చంద్రబాబు అనుకూల ప్రకటన చేసిన తరువాత పవన్ వచ్చి చంద్రబాబును కలిశారు. అటు సత్యకుమార్, ఆదినారాయణరెడ్డి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయని ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇన్ని పరిణామాల నడుమ బీజేపీ మెత్తబడిందని.. టీడీపీ రూట్లోకి వస్తోందన్న టాక్ విస్తరిస్తోంది. అదే సమయంలో ప్లాన్ బీ అంటూ చంద్రబాబు ఆపరేషన్ ప్రారంభించారని.. దాని ఫలితంగానే వరుస పరిణామ క్రమాలు జరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు ఆపరేషన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.