BrahMos Missile Demand: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్‌లోని నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయడంతోపాటు పాకిస్తాన్ చేసిన ప్రతిదాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా భారత్ జరిపిన దాడులతో ప్రపంచం దృష్టి ఒక్కసారిగా భారత ఆయుధాలపై పడింది. ఆపరేషన్ సిందూర్‌లో మన బ్రహ్మోస్ మిస్సైల్ సమర్థవంతంగా పనిచేసింది. దీంతో అత్యాధునిక సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను కొనుగోలుకు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు విక్రయించడంలో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. సింగపూర్‌లో జరిగిన షాంగ్రి–లా డైలాగ్‌లో భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, వియత్నాంతో ఒప్పందం ఇప్పటికే సంతకం అయిందని, ఇండోనేషియాతో చర్చలు తుది దశలో ఉన్నాయని ప్రకటించారు. ఇది భారత రక్షణ ఎగుమతుల రంగంలో కొత్త అధ్యాయం.
ఒప్పందాల పురోగతి..
వియత్నాంతో 2012 నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. 14 ఏళ్ల తర్వాత ఒప్పందం ఖరారైంది. అయితే ఒప్పంద విలువ, ఎన్ని క్షిపణులు అందించాలనే వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నాయి. ఇండోనేషియాతో కూడా చర్చలు దగ్గరలో ముగిసే దశలో ఉన్నాయి. ఇంతకు ముందు 2022లో ఫిలిప్పీన్స్‌తో సంతకం చేసిన 375 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,100 కోట్లు) ఒప్పందం కింద మూడు బ్రహ్మోస్ వ్యవస్థలను అందించాల్సి ఉంది. ఇప్పటికే రెండు సెట్లు డెలివరీ అయ్యాయి. ఫిలిప్పీన్స్ వీటిని తన తీరప్రాంత రక్షణ కోసం మోహరించింది.ౖ
చెనా అంశంతో భారత్ జాగ్రత్త..
వియత్నాం–చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంలో సరిహద్దు వివాదం ఉంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ విక్రయం చైనా అసంతృప్తిని రేకెత్తించవచ్చని భారత్ గతంలో జాగ్రత్తగా వ్యవహరించింది. ఇప్పుడు ఒప్పందం ఖరారు కావడం దక్షిణ తూర్పు ఆసియాలో చైనా ప్రభావానికి వ్యతిరేకంగా భారత్ సక్రమమైన రణనీతిని అవలంబిస్తోందని సూచిస్తుంది.
బ్రహ్మోస్ క్షిపణి విశేషాలు..
భారత్–రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణికి భారతప్రదేశ్ బ్రహ్మపుత్ర నది, రష్యా మాస్క్వా నది పేర్లను కలిపి పెట్టారు. హైదరాబాద్‌లో తయారవుతుంది. దీని బరువు సుమారు 3 వేల కిలోలు. పొడవు సుమారు 10 మీటర్లు. దీని దాడి పరిధి 300 కిలో మీటర్లు. ఇటవల భారత సాంకేతికతతో 500 కిలోమీటర్లకు పెంచారు. గంటకు సుమారు 4 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. భూమికి చాలా దగ్గరగా పయనిస్తూ రాడార్‌లకు తప్పించుకుంటుంది. లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా ఛేదిస్తుంది.
అనుమతులు లేకుండా ఎగుమతి..
బ్రహ్మోస్ అణ్వాయుధాలను మోసుకెళ్లలేని కన్వెన్షనల్ క్షిపణి కాబట్టి అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు లేకుండా ఎగుమతి చేయవచ్చు. దీనిలో 85 శాతం సాంకేతికత భారత్ సొంతం. మిగిలిన 15 శాతం (ప్రధానంగా ఇంజిన్, కొన్ని లోహ భాగాలు) రష్యా నుంచి వస్తాయి.
భారత్ వైపు ప్రపంచ దేశాల మొగ్గు..
ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు బ్రహ్మోస్‌ను ఎంచుకోవడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఇది ఇప్పటికే యుద్ధక్షేత్రంలో పరీక్షించి నిరూపించుకున్న విజయవంతమైన క్షిపణి.
పశ్చిమ దేశాలు లేదా ఇతర మేజర్ సరఫరాదారుల కంటే తక్కువ ఖర్చు.
భారత్ శిక్షణ, మోహరింపు సహాయం, స్పేర్ పార్ట్స్‌ను తక్కువ ధరకు లేదా ఉచితంగా అందిస్తోంది. ఈ క్షిపణిని భూమి నుంచి, నౌకలు, జలాంతర్గాములు, విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు.
పెరిగిన భారత రక్షణ ఎగుమతులు..
కొన్ని సంవత్సరాల్లో భారత రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో రూ. 21 వేల కోట్లు, 2024–25లో రూ. 28 వేల కోట్లు, 2025–26లో రూ. 38 వేల కోట్లకు చేరాయి. 2029–30 నాటికి రూ. 50 వేల కోట్ల లక్ష్యం నిర్దేశించారు. బ్రహ్మోస్‌తో పాటు ఆకాశ్, పినాకా, డ్రోన్లు, మందుగుండు సామగ్రి వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
గతంలో ప్రభుత్వ ఏకస్వామ్యంగా ఉన్న రక్షణ రంగం ఇప్పుడు ప్రైవేట్ సంస్థల సహకారంతో వేగంగా మారుతోంది. ఇది స్వావలంబన (ఆత్మనిర్భర్ భారత్) లక్ష్యానికి దోహదపడుతోంది. బ్రహ్మోస్ ఎగుమతులు కేవలం వ్యాపారం కాదు. చైనా ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణ తూర్పు ఆసియాలో భారత్ తన రణనీతి, సాంకేతిక సామర్థ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తున్న సంకేతం. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా చూడడం భారత రక్షణ రంగానికి పెద్ద విజయం.
