Homeజాతీయ వార్తలుBJP 4-GHMC Corporators: మోడీ చెప్పినా, బండి సంజయ్ ప్రమాణం చేయించినా ఉపయోగం లేకుండా...

BJP 4-GHMC Corporators: మోడీ చెప్పినా, బండి సంజయ్ ప్రమాణం చేయించినా ఉపయోగం లేకుండా పోయింది

BJP 4-GHMC Corporators: బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ ఢిల్లీకి పిలిపించుకొని సమావేశమయ్యారు. అయినప్పటికీ నలుగురు బీజేపీ కార్పొరేటర్లు అధికార టీఆర్ఎస్ కి తలొగ్గారు. తలవంచుకొని గులాబీ కండువాలు కప్పుకున్నారు. హైదరాబాదులో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్న వేళ ఒకరకంగా ఇది బీజేపీకి షాకే. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారనే ఆనందం కంటే.. నలుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్ లోకి వెళ్ళడమే బీజేపీ నాయకులకు ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది.. వాస్తవానికి బీజేపీ లో చేరిన నలుగురు కార్పొరేటర్లు గ్రేటర్ హైదరాబాదులోని నాలుగు వేరు వేరు నియోజకవర్గాలకు చెందినవారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఉవ్విళ్లురుతున్న బీజేపీకి.. మాకు గట్టిపట్టు ఉందని భావిస్తున్న బీజేపీకి.. నలుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరటం.. అదికూడా మోడీ హైదరాబాద్ పర్యటనకు ముందే ఒకరోజు జరగటం ఆందోళన కలిగిస్తోంది.

BJP 4-GHMC Corporators
BJP 4-GHMC Corporators

ఎందుకు చేరినట్టు?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ చుక్కలు చూపించింది. మేయర్ పీఠం మాదే అని బీరాలు పలికిన కేటీఆర్ కు 70 ఎంఎం సినిమా చూపించింది. బీజేపీ దెబ్బకు ఎంఐఎంతో పొత్తు కుదుర్చుకోవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్క ఏర్పడింది. రేపటి నాడు ఎంఐఎం ఎదురుతిరిగితే పరిస్థితి ఏంటన్న ఆలోచన కేటీఆర్ మదిలో మెదలడంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారని సమాచారం. మరోవైపు గ్రేటర్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురీదుతున్నారు. పీకే టీం తో పలుమార్లు సర్వే చేయించినా ప్రజల నుంచి ఆదే ప్రతికూల స్పందన వస్తుండటంతో పరిస్థితిని ఎలాగైనా మార్చాలని కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read: AP Govt GPF Issue: ఉద్యోగుల సొమ్ము నొక్కేసిన ఏపీ సర్కారు? మరీ ఇంత ‘దివాళా’కోరుతనమా?

చేరికలు ఏవి?

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలో పార్టీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారని ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్కరూ చేరింది లేదు. పైగా బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. గుడ్డిలో కాస్త మెల్లగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీలో చేరుతుండటం బీజేపీ కొంతమేర లాభించే విషయం. ఆయన రాకతో గ్రేటర్ బీజేపీలో కొత్త జోష్ వస్తుందని బండి సంజయ్ నమ్ముతున్నారు. మరోవైపు బండి సంజయ్ ని మరింత ఇరకాటంలో పెట్టేందుకు ఆయన సొంత సామాజిక వర్గమైన మున్నూరు కాపు నాయకులను కేటీఆర్ ఎగ దోస్తున్నారు. గంగుల కమలాకర్ తో బండి సంజయ్ పై విమర్శలు చేయిస్తున్నారు. మరోవైపు సొంత పార్టీ నాయకుల్లోని ఓ వర్గం బండి సంజయ్ పై కారాలు మిరియాలు నూరుతున్నది. దీని తెర వెనుక కూడా కేటీఆర్ ఉన్నట్టు వినికిడి. మొన్న తుక్కుగూడలో జరిగిన సమావేశంలో అమిత్ షా కు సదరు నేతలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఊహించి తుక్కుగూడ సభా వేదిక మీదే బండి సంజయ్ కి మరిన్నీ అధికారాలు ఇస్తున్నట్టు ప్రకటించారు.

BJP 4-GHMC Corporators
BJP 4-GHMC Corporators

అధికార పార్టీ నాయకులు బీజేపీలో ఎందుకు చేరడం లేదు

బండి సంజయ్ చెప్పినట్టు ఆశించినంత స్థాయిలో బీజేపీలో చేరికలు ఉండటం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్లోకి మాత్రం ఖైరతాబాద్ కాంగ్రెస్ కార్పొరేటర్ విజయా రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేరారు. కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ నాయకులు వెళ్తుంటే అడ్డు చెప్పని అధిష్టానం.. బీజేపీ లోకి వెళ్తుంటే మాత్రం ఎందుకు అడ్డుకట్ట వేస్తోంది? ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. నిధులు లేక అనేక బిల్లులను నిలిపివేస్తోంది. ప్రభుత్వం పలుచోట్ల హరిత వనాలు, స్మశాన వాటికలు, రోడ్లు, వైకుంఠధామాలు, పలు భవనాలను నిర్మించింది. ఈ కాంట్రాక్టులన్నీ అధికార పార్టీలోని నాయకులకే ఇచ్చింది. తమకు అనుకూలమైన వ్యక్తులకు ముందే బిల్లులు చెల్లించింది. ఇతర పార్టీలోకి జంప్ అయ్యే వారి బిల్లులు మాత్రం నిలిపివేసింది. దీంతో వారు బీజేపీ లోకి చేరలేకపోతున్నారని సమాచారం. బండి సంజయ్ హామీ ఇచ్చినా ₹కోట్లకు కోట్లు అభివృద్ధి పనుల కోసం వెచ్చించడంతో ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. బండి సంజయ్ సొంత జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులు బీజేపీ లో వెనకడుగు వేస్తున్నారంటే గులాబీ పార్టీ ఏ స్థాయిలో ఒత్తిడికి గురిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఆదివారం హైదరాబాద్కు రానున్నారు. ఇందుకోసం అధికార టీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అంటే టీఆర్ఎస్ దీనిని ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అదే రోజు ప్రధానమంత్రి మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో ప్రసంగించనున్నారు. మోడీ వస్తున్న నేపథ్యంలోనే ప్రజల అటెన్షన్ ఆయన నుంచి మళ్లించేందుకే కేసీఆర్ యశ్వంత్ సిన్హా పర్యటనను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నగరం మొత్తాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. ఇక యశ్వంత్ సిన్హా మొదటి టీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్తే తమ పార్టీ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. టీఆర్ఎస్ గోడ మీద వారిన కాకి కాంగ్రెస్ గోడపై వాలడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై రాహుల్ గాంధీ ఏమంటారోననేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.

Also Read:APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఎడాపెడా బాదుడు.. పల్లె వెలుగులనూ వదల్లే…

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular