RBI Repo Rate: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు సమూలంగా మార్చివేసింది. ఫలితంగా డాలర్ బలపడుతోంది. అన్ని దేశాల కరెన్సీలు బలహీన పడుతున్నాయి. యూరో నుంచి ఇండియన్ రూపాయి దాకా అన్ని కరెన్సీలు కుయ్యో మొర్రో అని మూలుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో పడిపోతున్న రూపాయిని కాపాడేందుకు, అంతకంతకు పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ బాటలోనే ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లు రెపో రేట్ ను పెంచింది. తాజాగా శుక్రవారం జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమీక్ష సమావేశంలోనూ భారత రిజర్వ్ బ్యాంక్ మరోసారి షాక్ ఇచ్చింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 5.40 శాతానికి పెరిగింది. ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా 35 నుంచి 50 బేసిస్ పాయింట్లు వరకు రెపో రేటును పెంపుదల చేస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అందుకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ కూడా నిర్ణయం తీసుకుంది.

Shaktikanta Das
ఎందుకు ఈ నిర్ణయం
డాలర్ తో పోలిస్తే రూపాయి జీవితకాల కనిష్టానికి పడిపోయింది. ఈ పతనం ఇంకా ఎంత దాకా వెళ్తుందో తెలియదు. రూపాయిని కాపాడేందుకు విదేశీ మారక ద్రవ్య నిల్వలను బాగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే దేశం అత్యయిక స్థితిని ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. పైగా ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతున్నాయి.. భారతదేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ పతనం అంచున నిలిచాయి. ఇలాంటి తరుణంలో పడిపోతున్న రూపాయి విలువకు బలం చేకూర్చాలి, అంతకంతకు పెరుగుతున్న ధరలను కట్టడి చేయాలనే ఉద్దేశాలతో రిజర్వ్ బ్యాంకు రెపో రేటును పెంచింది. వాస్తవానికి అమెరికన్ ఫెడరల్ బ్యాంకు కూడా వడ్డీరేట్లను పెంచడంతో దేశంలో ఉన్న విదేశీ మధుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకొని అమెరికాకి తరలిస్తున్నారు. దీనివల్ల అమెరికా డాలర్ విలువ పెరుగుతోంది. మిగతా దేశాల కరెన్సీ విలువ తగ్గిపోతుంది. అందులో ఇండియన్ రూపాయి కూడా ఉంది. రూపాయి విలువ మారకం ఇలానే పడిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను దేశం ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక రిజర్వ్ బ్యాంకు రెపో రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటారా? అంబటి, అవంతిల మాదిరిగా విడిచిపెడతారా?
అంచనాలకు తగ్గట్టుగానే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లను పెంచడంతో వడ్డీ రేట్లలో చాలా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100 బేసిస్ పాయింట్లు ఒక శాతం లేదా ఒక రూపాయికి సమానం. ఇక రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే మే నుంచి జూన్ నెలలో రెండు విడతలుగా రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బ్యాంకులు కూడా గత రెండు నెలల్లో తమ వడ్డీరేట్లు అమాంతం పెంచాయి. ఇక తాజాగా ఆర్బిఐ తీసుకున్న నిర్ణయంతో రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో గృహ,వాహన, వ్యక్తిగత రుణాలపై నెల నెలా చెల్లించే ఈఎంఐ ల భారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెపో రేటు అంటే
బ్యాంకులకు ఇచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించే వడ్డీని రెపోరెటు అంటారు. రెపోరేటు 5.40 శాతానికి చేరుకుంది. రెపో రేటు పెరిగితే బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెంచుతాయి. ఫలితంగా ఖాతాదారులకు నెలనెలా చెల్లించే ఈఎంఐ లు భారంగా మారతాయి. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్త రుణగ్రహీతలకు అధిక వడ్డీ రేటు వర్తిస్తుంది.

RBI Repo Rate
ధరల పెరుగుదలను నియంత్రించడం ఆర్బిఐ కి సాధ్యమేనా
చమురు ధరలు కనివిని ఎరుగని స్థాయిలో పెరిగాయి. నిత్యవసరాలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా దేశానికి తక్కువ ధరలో రావలసిన వివిధ రకాల వస్తువులు ఎక్కువ ధర పలుకుతున్నాయి. ఇది చాలదన్నట్టు అమెరికన్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్ని పరిణామాలు దేశ ఆర్థిక రంగాన్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కరోనా సమయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత్యంతరం లేక రెపో రేటును పెంచుతోంది. దీనివల్ల ధరల నియంత్రణ మాట అటు ఉంచితే వినియోగదారులపై భారం అంతకంతకు పెరుగుతోంది. రెపోరేట్ వల్ల ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆశించినంత స్థాయిలో మాత్రం కాదు. వివిధ వస్తువుల పైన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వ్యాట్ ను ఉపసంహరించుకుంటేనే పరిస్థితి మెరుగుపడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. అయితే ప్రభుత్వాలు ఆ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుండడంతో ప్రజల పై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది.
Also Read:Popular News Channel- ED: ఈడీ భయంతోనే ఆ చానెల్ ప్లేట్ ఫిరాయించిందా?