భారతదేశంలో గత కొన్ని నెలలుగా కరోనా చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రతిరోజూ 80 వేలకు పైగా కేసులు 1000కు అటూఇటుగా మరణాలు నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిపై పరిశోధనలు కొనసాగిస్తూ కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి పరిశోధనలు చేసి మరో కొత్త విషయం వెల్లడించారు.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కరోనా వైరస్ గురించి ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం కరోనా సోకిన వాళ్లు శ్వాస సంబంధిత వ్యాధులతో మరియు తీవ్రమైన జలుబు, జ్వరంతో బాధ పడతారు. ఈ లక్శ్లుహణా గల వారు కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు వైరస్ విజృంభించిన తొలినాళ్ల నుంచి సూచనలు చేశారు.
ఇలా కరోనా సోకిన వారిలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు 590 మందిని పరిశీలించగా వారిలో చాలామంది కరోనా సోకితే వాసనను గుర్తించలేకపోయామని ఈ లక్షణమే తమకు తొలుత కనిపించిందని చెప్పారు. శాస్త్రవేత్తలు వాసన కోల్పోయిన వారిలో దాదాపు 80 శాతం మందికి వైరస్ నిర్ధారణ అయిందని వెల్లడించారు. ముక్కు, నాలుక, గొంతు వెనుక భాగం కణాలపై కరోనా ప్రభావం పడటం వల్ల రోగులు వాసన గుణాన్ని కోల్పోతున్నారు.
శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా ఎవరైనా వాసన గుణాన్ని కోల్పోతే ఖచ్చితంగా కరోనానే కావచ్చని వెల్లడిస్తున్నారు. వాసన గుణాన్ని క్పొల్పోయిన వాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కీలక సూచనలు చేశారు. దాదాపు 80 శాతం మందిలో ఇదే ప్రాథమిక లక్షణంగా కనిపించడంతో శాస్త్రవేత్తలు ఇతర లక్షణాలతో పోలిస్తే వాసనను గుర్తించలేకపోవడాన్ని ముఖ్య లక్షణంగా గుర్తించాలని చెబుతున్నారు.