Drunken Drive: మందు తాగి పోలీసులకు దొరికితే.. ఏకంగా చర్లపల్లి జైలుకే..
తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు మద్యం షాపుల ఏర్పాటు అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. పైగా వైన్ షాపులు మాత్రమే కాకుండా ఇటు బెల్ట్ షాపుల ద్వారా కూడా మద్యం పొంగి పొర్లుతుండటంతో తాగే వారు ఎక్కువవుతున్నారు.

Drunken Drive: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? మందు తాగిన తర్వాత బైక్ డ్రైవింగ్ మీకు ఇష్టమా? అయితే ఈ కథనం మీకోసమే. తాగుడు అలవాటు ఉంటే ఇప్పుడే మానేయండి. మా వల్ల కాదూ అంటారా? కనీసం తాగిన తర్వాత కనీసం బైకైనా డ్రైవింగ్ చేయకుండా ఉండండి? ఏ హే మీరేంటి? మాకేంటి? చెప్పేది అంటారా? అయితే దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో మీరూ చదివేయండి.
“మద్య”ధర సముద్రం
తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు మద్యం షాపుల ఏర్పాటు అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. పైగా వైన్ షాపులు మాత్రమే కాకుండా ఇటు బెల్ట్ షాపుల ద్వారా కూడా మద్యం పొంగి పొర్లుతుండటంతో తాగే వారు ఎక్కువవుతున్నారు. ఇదే సమయంలో మద్యం తాగి ఆగడాలు సృష్టించే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీనికి తోడు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే వీటికి అడ్డుకట్ట వేయాలని పోలీస్ శాఖ భావిస్తున్నది. మద్యం షాపులకు ఎలాగూ కళ్లెం వెయ్యలేదు కాబట్టి.. మందు బాబులనే కట్టడి చేసేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వినూత్నమైన విధానానికి తెరలేపింది.
మద్యమే ప్రధాన కారణం
రోజూ వేల సంఖ్యలో వాహనాలు తిరిగే రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని రహదారులపై ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం తాగి నడపడం లేదా నిర్లక్ష్య డ్రైవింగ్. తాగి నడపడం వల్ల చోటుచేసుకునే ప్రమాదాల్లో వాహనదారుకు తీవ్ర గాయాలవడమో లేదా మరణించడమో జరుగుతోంది. పోలీసులు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడినవారికి.. న్యాయస్థానాలు జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నాయి. కాగా, ఇటీవల డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి జైళ్లకు వెళ్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో దొరికిన వారిని చర్లపల్లి, చంచల్‌గూడ కేంద్ర కారాగారాలకు తరలిస్తున్నారు. ఈ రెండు జైళ్లల్లో వీరి కోసం ప్రత్యేక బ్యారెక్‌లు ఏర్పాటు చేశారు.
చర్లపల్లి కేంద్రకారాగారానికి..
జిల్లా జైళ్లల్లోనూ ఇదే విధానం ఉంది. అయితే, ఇకపై హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన అందరినీ చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించే అంశాన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కారాగారంలో పారిశ్రామిక యూనిట్ ఉండటంతో పనిచేసేవారి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండి, పనిచేయగలిగే వారిని జైళ్ల శాఖ నిర్వహించే యూనిట్లలో పనిచేయించి రోజువారి కూలీ చెల్లిస్తుంటారు. డ్రంకెన్ డ్రైవ్‌తో పాటు సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం పిటీ కేసుల్లో అరెస్టై జైలుకు వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. డ్రంకెన్ డ్రైవ్‌లో కనీసం ఒక రోజు నుంచి తీవ్రతను బట్టి ఎక్కువ రోజులు జైలు శిక్ష విధిస్తుంటారు. కొన్ని తీవ్రత ఎక్కువగా ఉండే కేసుల్లో గరిష్ఠంగా 5, 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇలాంటి వారందర్ని చర్లపల్లి జైల్లో పనిచేయించడం వల్ల ఉత్పత్తి పెరగడంతో పాటు, పనివారి కొరత తీరుతుందనేది జైలు అధికారుల ఆలోచన. ఈ అంశానికి సంబంధించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
