IANS-CVoter survey: రెండు సార్లు తెలంగాణలో అధికారం కొల్లగొట్టిన సీఎం కేసీఆర్ కు మూడోసారి అధికారం అంత ఈజీ కాదన్న విషయం తెలిసిపోయింది. కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని స్పష్టమైంది. ప్రజాదరణలో అట్టడుగుకు కేసీఆర్ చేరారని తాజాగా ఐఏఎన్ఎస్-సీఓటర్ (IANS-CVoter survey) సర్వే తేల్చింది. కేసీఆర్ ప్రస్తుతం 30.30 శాతం వ్యతిరేకతను తెచ్చుకున్నారని తెలిపింది. ప్రజాదరణ కోల్పోతున్న సీఎంల జాబితాలో కేసీఆర్ నిలిచారు.
దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా చత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ భగేల్ నిలిచారు. ఈ సర్వే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించారు. 94శాతం మంది చత్తీస్ ఘడ్ సీఎం పాలన పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. మొత్తం 115 అంశాల ఆధారంగా ఈ సర్వే సాగింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ ముఖ్ మంగళవారం సాయంత్రం వెల్లడించారు.
గత ఏడాది ఆగస్టులో ‘దేశ్ కా మూడ్’ సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో సీఎం జగన్ మూడో స్థానంలో నిలవగా.. కేసీఆర్ ఐదో స్థానంలో ఉన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానం దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు ఘోరంగా వెనుకబడ్డారు. చత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ భాగేల్ తొలి స్థానంలో.. ఉత్తరాఖండ్ సీఎం రెండో స్తానం.. ఒడిశా సీఎం మూడో స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో చిట్టచివరన సీఎం కేసీఆర్ నిలిచినట్టు సంస్థ వెల్లడించింది. చివరి మూడు స్థానాల్లో 30.30 శాతంతో కేసీఆర్, 28.10 శాతంతో యూపీ సీఎం, 27.70 శాతంతో గోవా సీఎం నిలిచారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పాపులారిటీ ఘోరంగా పడిపోయిందని.. కేసీఆర్ కు తెలంగాణలో ప్రభావం తగ్గిపోతోందని సర్వే తేల్చింది. ఇదే కొనసాగితే తెలంగాణలో బీజేపీ బలోపేతానికి మంచి ఛాన్స్ అని విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉందని తేలింది.
సీ ఓటర్ సర్వే నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ గెలుస్తుందా? లేదా ? అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రజా వ్యతిరేకత అత్యంత ఎక్కువగా ఉన్న సీఎంగా అట్టడుగున కేసీఆర్ నిలవడం గులాబీ శ్రేణులను కలవరపెడుతోంది.