Hyundai Motors: సేల్స్‌లో హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. ఆ కారుకు ఏకంగా లక్ష బుకింగ్‌లు.. ఎందుకో తెలుసా?
ఈ ఏడాది హ్యుందాయ్ మార్కెట్‌కు సంబంధించి గణాంకాలను సంస్థ ప్రకటించింది. భారత మార్కెట్లో ఈ సంవత్సరం(2023) హ్యుందాయ్ మోటార్స్ ఆరు లక్షల యూనిట్ల కార్లను విక్రయించి సరికొత్త మైలురాయిని చేరుకుంది.

Hyundai Motors: భారత మార్కెట్లో ప్రముఖ కార్ల కంపెనీగా హ్యుందాయ్ మోటార్ ఇండియా పేరు గాంచింది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందుబాటులో ఉంటున్నాయి. అందుకే కస్టమర్లలో ఆదరణ పొందుతూ సేల్స్‌లో ఏటా హ్యుందాయ్ బ్రాండ్ కార్లు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది హ్యుందాయ్ రికార్డు స్థాయిలో విజయాలను సాధించింది.
భారీగా సేల్స్..
ఈ ఏడాది హ్యుందాయ్ మార్కెట్‌కు సంబంధించి గణాంకాలను సంస్థ ప్రకటించింది. భారత మార్కెట్లో ఈ సంవత్సరం(2023) హ్యుందాయ్ మోటార్స్ ఆరు లక్షల యూనిట్ల కార్లను విక్రయించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. కాగా గతేడాది(2023) హ్యుందాయ్ మోటార్స్ 5.5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించగా.. ఈ సారి అంతకంటే ఎక్కువ సంఖ్యలో సేల్స్‌ను నమోదు చేసింది. హ్యుందాయ్ కార్లకు కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో సంస్థ కార్ల తయారీ సామర్థ్యాన్ని పెంచింది. ఈ క్రమంలో తమిళనాడులో 50 వేల నుంచి ఏకంగా 8,20,000 యూనిట్లను తయారు చేసింది. ఈ ఏడాది భారత మార్కెట్లో హ్యుందాయ్.. ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు, ఎక్స్‌టర్ సబ్–కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయడమే.. తమిళనాడులో ఉత్పత్తిని పెంచడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
ఆ కారుకు లక్షకుపైగా ఆర్డర్లు..
హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెన్యూ, క్రెటా, అప్‌డేటెడ్ వెర్నా ఎస్‌యూవీలు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతుండటంతో ఈ స్థాయి విజయం సాధ్యమైనట్లుగా సంస్థ భావిస్తోంది. దీంతోపాటు జూన్‌లో టాటా పంచ్‌కు పోటీగా ప్రవేశపెట్టిన హుందాయ్ ఎక్స్‌ట్రాకు కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది. ఈ కారు లక్షకు పైగా ఆర్డర్లను పొందింది. హ్యుందాయ్ ఈ ఏడాది 6 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడానికి ఇది కూడా కారణంగా చెప్పుకోవచ్చు. హ్యుందాయ్ సంస్థకు గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లోనూ స్టార్ రేటింగ్‌ను సాధించింది. అడల్ట్, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలోనూ భేష్ అని నిరూపించుకుంది. సేఫ్టీ ఫీచర్ల విషయంలో తగ్గేదే లేదు అన్న విధంగా ప్రయాణికులకు భద్రత కల్పిస్తోంది.
అందుబాటు ధర..
భారత మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్‌ట్రా వేరియంట్ల ప్రకారం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల(ఎక్స్–షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. ఈ కారును ఎక్స్, ఎస్, ఎస్‌ఎక్స్, ఎస్‌ఎక్స్‌ఓ, ఎస్‌ఎక్స్‌ఓ కనెక్ట్ అనే 5 వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది. కస్టమర్లు హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఇంజి¯Œ ఆప్షన్‌లతో కూడా కొనుగోలు చేయవచ్చు.
ప్రత్యేకతలు..
హ్యుందాయ్ ఎక్స్‌టర్ పెట్రోల్ వేరియంట్ 19.2 కేఎంపీఎల్ మైలేజ్‌ను ఇస్తుంది. ఇక సీఎంజీ వేరియంట్ అయితే 27.1 కి.మీ/కేజీ ఫ్యూయెల్ కెపాసిటీని కలిగి ఉంది. ఇందులో 8–అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లతో పాటు ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగులను పొందుపరిచారు.
ఈ కార్లు కూడా…
– ఇక హ్యుందాయ్ వెర్నా సెడాన్‌ను రూ.10.96 లక్షల నుంచి రూ. 17.38 లక్షల ఎక్స్–షోరూమ్ ధరలో సంస్థ విక్రయాలు చేస్తోంది. ఇది పెట్రోల్ ఇంజన్, మాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కొనుగోలు చేయవచ్చు. మైలేజ్ విషయానికొస్తే ఈ కారు 18.6 – 20.6 కేఎంపీఎల్ మైలేజ్‌ను ఇస్తుంది.
– హ్యుందాయ్‌కు చెందిన మరో కారు వెన్యూ.. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు రూ. 7.89 లక్షల నుంచి రూ.13.48 లక్షల ఎక్స్–షోరూమ్ ధరలో కొనుగోలు చేయవచ్చు. హ్యుందాయ్ క్రెటా రూ.10.87 లక్షల నుంచి రూ. 19.20 లక్షలు ఎక్స్–షోరూమ్ ధరతో సంస్థ ప్రవేశపెట్టింది.
