Hyderabad Cycle Track: పైన సౌరశక్తి… సైకిల్ పై చోదక శక్తి… ఎటువంటి ట్రాఫిక్ ఉండదు.. వాహనాలు ఎదురుగా వస్తాయనే బెడద ఉండదు. రయ్యమంటూ దూసుకుపోవడమే.. చదువుతుంటే ఆసక్తిగా అనిపిస్తుంది కదూ.. ఎక్కడ ఈ సౌకర్యం ఉందో తెలుసుకోవాలని ఉంది కదూ! ఇది మరెక్కడో కాదు.. త్వరలో హైదరాబాద్ నగర వాసులకు కలగనున్న సౌకర్యం.. ఏంటి హైదరాబాదులో…అందునా విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉండే నగరంలో… ఇలాంటి సౌకర్యం ఎలా కల్పిస్తారు అనే ప్రశ్న మీ మదిలో మెదులుతోంది కదూ! కానీ మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం.

Hyderabad Cycle Track
హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ సమస్యతో రోజు ఇబ్బందే.. ఇలాంటివారు ఉదయం తొందరగా లేచి ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకునేందుకు త్వరగా ఆఫీసులకు వెళ్తారు. సాయంత్రం పూట ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చేధించుకొని ఇళ్లకు వెళ్తారు.. ఇలాంటి సమయంలో వారి వ్యక్తిగత ఆరోగ్యం పై దృష్టి సారించడం కుదరదు. పైగా కాలుష్యం వల్ల వివిధ రకాల రుగ్మతలకు గురవుతుంటారు.. ఫలితంగా సంపాదించిన పైసలు అన్ని ఆస్పత్రికి, మందులకు ఖర్చవుతాయి. ఇలాంటి సమయంలో నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెంట సోలార్ ప్యానల్ రూఫ్ తో సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపడుతోంది. 4.5 మీటర్ల వెడల్పు సైకిల్ ట్రాక్ ఓ ఆర్ ఆర్ తో పాటు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల్లో 22 కిలోమీటర్లు, నానక్ రామ్ గూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వరకు 8.45 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13.8 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ట్రాక్ నిర్మాణం జరుగుతున్నది. ఇది ఐటీ హబ్ ను కూడా కవర్ చేస్తుంది.

Hyderabad Cycle Track
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్… దక్షిణ కొరియాను స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రణాళిక అమలు చేస్తున్నది.. సోలార్ రూఫింగ్ తో ప్రణాళిక బద్ధమైన సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నది. ఈ సైకిల్ ట్రాక్ లో మూడుసైకిల్ లైన్లను నిర్మిస్తున్నది. మార్గానికి ఇరువైపులా ఒక మీటర్ వెడల్పు తో గ్రీన్ లాన్ ను కూడా నిర్మిస్తున్నది.. సోలార్ ద్వారా 16 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. ఇది ఓఆర్ఆర్ లైటింగ్, డ్రిప్ ఇరిగేషన్, ఎక్స్ప్రెస్ వే విద్యుత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.. ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో దీనిని ప్రభుత్వం ప్రారంభించనుంది.. ఇప్పటికే ఇందుకు సంబంధించి పనులు శరవేగంగా సాగుతున్నాయి.. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులు సైకిల్ మీద ప్రయాణం చేయవచ్చు. వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పైగా ఓఆర్ఆర్ మీద వాహనాల బెడద తక్కువగా ఉంటుంది కాబట్టి హాయిగా సైకిల్ ప్రయాణం చేసుకోవచ్చు.