Huzurabad By-Election: హుజురాబాద్.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో ఉన్న నియోజకవర్గం. ఇది రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల వలే ఒక సాధారణ నియోజకవర్గమే. కానీ ఇక్కడ ప్రస్తుతం రాజకీయ యుద్ధం నడుస్తోంది. రోజు రోజుకు ఇక్కడ పొలిటికల్ హీట్ ఎక్కువవుతోంది. హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈటలపై అధిష్టానం కోపంగా ఉండటం, ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి చేరడం, సీఎం కేసీఆర్ దానిని ప్రతిష్టాత్మకంగా భావించడం, పోటీలో ఓ విద్యార్థి నాయకుడిని నిలపడం చక చకా జరిగిపోయాయి. అయితే హుజురాబాద్ అంశం చాలా కాలం నుంచి రాష్ట్ర ప్రజల చర్చల్లో ఓ భాగం అయ్యింది.

huzurabad people
ఈ ఎన్నికల కోసమే ప్రభుత్వం దళితబంధు పథకం ప్రవేశపెట్టిందని, కేవలం హుజురాబాద్‌కే నిధులన్నీ మళ్లీస్తోందని ప్రజల్లో విమర్శలు వినిపించాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేశాయి. కానీ దీనిపై ఎక్కువగా మాట్లాడితే తమ పార్టీపై దళిత వ్యతిరేకి అనే ముద్ర పడుతుందేమోనని నిమ్మకుండిపోయాయి. అయితే ఈ పథకాన్ని నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
-హుజురాబాదీ మనసులో ఏముంది ?
హుజురాబాద్ ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్. ఇక్కడ కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలు, ఇండిపెండెంట్‌లు పోటీలో నిలిచినా.. పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉండేలా కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు తమ పార్టీ గెలిస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ ప్రచారం చేస్తున్నాయి. అయితే సాధారణ హుజురాబాద్ వాసీ ఏం కావాలనుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు.
ఇక్కడ దాదాపు 30 వేల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వీరిలో చాలా మంది ఉన్నత విద్యావంతులే. వీరికి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉంది. హుజురాబాద్ నుంచి అధిక శాతం మంది హైదరాబాద్, కరీంనగర్ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. వీరికి స్థానికంగా మంచి నైపుణ్యాలు కల్పించి, ఉపాధి కల్పించాలి.
కరీంనగర్, సిద్ధిపేట, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాలో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. ఇక్కడ కార్మికులు అధికంగా ఉన్నారు. వారి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడి విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులు చేసేందుకు వీలుగా ఇంజనీరింగ్, పీజీ, ఐటీఐ కాలేజీలు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో, పట్టణాల్లో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాల సంఖ్య పెంచి, కమాండ్ సెంటర్ స్థానికంగా ఏర్పాటు చేయాలి.
జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాలు రోజు రోజుకి విస్తరిస్తున్నాయి. దీని వల్ల వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. దీని నివారణకు సిగ్నలింగ్ వ్యవస్థను పెంచాల్సిన అవసరం ఉంది.
ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ కురిపిస్తున్న వరాలు నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధి వర్గాలకు ఏమాత్రం సంతృప్తినివ్వడం లేదట.. తమకు శాశ్వత ఉపాధి లేదని ఏడేళ్లుగా అనుభవిస్తున్నామని అంటున్నారు. దళితులు, పేదలకు లబ్ధి చేకూరుతున్నా మేజర్ ప్రాబ్లం అయిన విద్యార్థి, ఉద్యోగ, చిరు వృత్తుల వారిని మాత్రం టీఆర్ఎస్ మెప్పించలేకపోతోందట.. వారి ఆగ్రహ జ్వాల ఓటింగ్ లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఇది టీఆర్ఎస్ కు మైనస్ గా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.