Huge Sex Racket Gang Arrested: కొందరి వయసు పాతికేళ్ళు ఉంటుంది.. మరికొందరి వయసు 35 ఏళ్ల లోపు ఉంటుంది. అందరివీ పేద కుటుంబాలే. భగవంతుడు మంచి రూపం ఇచ్చినప్పటికీ.. మూడు పూటలా కడుపు నింపే మార్గం ఇవ్వలేదు. కన్న తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని నేపథ్యం ఉన్నవారు. అలాంటి వారినే టార్గెట్ చేసి, సేల్స్ గర్ల్స్ గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీహార్ కు చెందిన అర్ణవ్, అలియాస్ అదీమ్ వ్యభిచార వృత్తిలోకి లాగాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14, 190 మంది యువతులను ఈ రొంపిలోకి దించాడు.. ఈ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు.. కానీ వారి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

Huge Sex Racket Gang Arrested
మూడు కమిషనరేట్ల పరిధిలో
ఈ కేసులో ప్రధాన నిందితుడు అర్ణవ్. ఇతడిది బీహార్. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు ఇంటి నుంచి ప్రైవేట్ కంపెనీలో పని చేసేందుకు వెళుతున్నానని చెప్తూ ఉంటాడు. ఉదయాన్నే చక్కగా తయారై సైబరాబాద్ పరిధిలో తీసుకున్న ఫ్లాట్ కు చేరుకొని దందా సాగిస్తూ ఉంటాడు. ఈ సెక్స్ రాకెట్ లో అతడికి పరిచయమైన సిమ్రాన్ కౌర్ తో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ సెక్స్ రాకెట్ లో ఆమె ఒక ఆర్గనైజర్.. వీరితో పాటు 15 మంది ఈ సెక్స్ రాకెట్ లో ముఠా సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బంగ్లాదేశ్, నేపాల్, థాయ్ లాండ్, ఉజ్బె కిస్తాన్,రష్యా నుంచి యువతులను తీసుకొచ్చి, పదుల సంఖ్యలో హోటళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దందా సాగిస్తున్నారు.
పేద, మధ్యతరగతి యువతులే టార్గెట్
ఈ దందా సాగిస్తున్న వారు పేద, మధ్యతరగతి యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.. చూసేందుకు బాగున్న అమ్మాయిలను కొంతమంది మధ్యవర్తులు సంప్రదిస్తారు. సేల్స్ గర్ల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాట కలుపుతారు.. ఆ తర్వాత వారి ఫోటోలను నిర్వాహకులకు పంపుతారు.. వారు ఎంపిక చేసిన అమ్మాయిలకు విమానాల్లో వేరే నగరాలకు పంపుతారు.. అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంచి విలాసమైన జీవితాన్ని అలవాటు చేస్తారు.. రోజుకు వేలల్లో డబ్బులు ఇస్తారు.. డ్రగ్స్ కూడా అలవాటు చేసి తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. విటుడి అవసరాన్ని బట్టి వారి ద్వారా డ్రగ్స్ కూడా సరఫరా చేస్తారు. విటుడు చెల్లించిన డబ్బులు 30 శాతం యువతులకు ఇచ్చి, మిగతా 70% వారు తీసుకుంటారు. అయితే ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకుల్లో ఒక్కొక్కరి వద్ద పెద్ద సంఖ్యలో యువతులు సహా మిగతా రాష్ట్రాల జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, మోడల్స్ ఫోన్ నెంబర్లు, ఫోటోలు, ఇతర సమాచారం ఉన్నట్టు పోలీసులు గుర్తించి విస్తు పోయారు.. ఇక నిర్వాహకుల్లో ఒక్కొక్కరు ఈ మూడు సంవత్సరాలలో సరాసరి ఏడాదికి 40 లక్షలు సంపాదించినట్టు తెలుస్తోంది..

Huge Sex Racket Gang Arrested
ఇలా పట్టుకున్నారు
సన్ సిటీ పరిధిలోని ఒక హోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు గత నెలలో సమాచారం అందింది. సిపి స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు డిసిపి కవిత పర్యవేక్షణలో ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ బృందం దిగింది. తొలుత సల్మాన్ అనే నిర్వాహకుడిని పట్టుకున్నారు. అతడి ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లు, యువతుల ఫోటోలు, ఇతర ఆర్గనైజర్లతో ఉన్న సంబంధాలను పరిశీలించారు. తీగ లాగుతుంటే కొండంతా కదిలినట్టు.. ఇది దేశవ్యాప్త రాకెట్ అని ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇక్కడే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. ఆర్గనైజర్లలో ఒకరికి తెలియకుండా మరొకరిని అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి 34 స్మార్ట్ ఫోన్లు.. ఒక కీప్యాడ్ ఫోన్.. మూడు కార్లు… ఒక ల్యాప్ టాప్..2.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులపై నగరంలో ఇప్పటివరకు 39 కేసులు ఉన్నట్టు గుర్తించారు.
బాధితులు వీరే
ఇక ఈ ముఠాలో ఉన్న బాధిత అమ్మాయిల్లో 50 శాతం మంది పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు. 20% కర్ణాటక, 15% మహారాష్ట్ర, 7% ఢిల్లీ, 5% ఇతర రాష్ట్రాలు, 3% మంది ఇతర దేశాలకు చెందిన యువతులు ఉన్నారు. వీరి దందా మొత్తం ఆన్లైన్, వాట్సప్ ద్వారా మాత్రమే చేస్తున్నారు. పైగా పోలీసులకు చిక్కకుండా అమ్మాయిల ఫోటోలను వెబ్ సైట్, మెసెంజర్ యాప్ ల ద్వారా విటులకి పంపి, ఎక్కడికంటే అక్కడికి ఎస్కార్ట్ సర్వీస్ లు కూడా అందిస్తామని ప్రకటనలు ఇచ్చేవారు. ఇందుకోసం ఏకంగా ప్రత్యేక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. కానీ చివరికి పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం నిందితులు, బాధిత మహిళలు పోలీసుల అదుపులో ఉన్నారు.