Gandhari Jatara: సాధారణ జన సీవనానికి భిన్నంగా ఉంటుంది గిరిజన సంప్రదాయం. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత వృద్ధి చెందినా ఆదివాసీలు తమ సంప్రదాయాన్ని, కట్టుబాట్లను నేటికీ పాటిస్తున్నారు. సంస్కృతిని భావితరాలకు అందిస్తున్నారు. ఆదివాసీ తెగల్లో నాయక్‌పోడ్‌ల అతిపెద్ద జాతర గాంధారి మైసమ్మ జాతర. ఈ జాతరకు గిరిజనులతోపాటు గిరిజనేతరులు పెద్దసంఖ్యలో వస్తారు. ఏటా మాఘమాసంలో జరిగే ఈ జాతర ఫిబ్రవరి 3న ప్రారంభమైంది. 5వ తేదీ వరకు కొనసాగుతుంది. గిరిజనులు తమ సంప్రదాయం ప్రకారం మైసమ్మను పూజిస్తారు. మరి ఈ గాంధారి దేవత ఎలా పుట్టింది.. గిరిజనుల కొంగు బంగారం ఎలా అయింది.. గిరిజన దేవత ప్రత్యేకత గురించి ప్రత్యేక కథనం..

Gandhari Jatara
కొండ కోనలు పులకించేలా జాతర..
గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య, కొండ కోన పులకించేలా, చెట్టు పుట్ట పరవశించేలా గాంధారి మైసమ్మ జాతరను ఏటా నాయక్‌పోడ్ గిరిజనులు నిర్వహిస్తారు. మాఘమాసంలో ఏటా మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. జాతరకు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఆదివాసీ గిరిజనులు తరలివస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఆదివాసి నాయక్ పోడులు, గిరిజనులు ఈ జాతరలో పాల్గొంటారు.
గాంధారీ కోట ఎంతో ప్రత్యేకం
గాంధారి కోటను 1300 ఏడీలో కాకతీయ పాలకుల సహాయంతో ప్రాంతాన్ని పరిపాలించిన గిరిజన రాజులు నిర్మించారని ఇక్కడ వారు బాగా నమ్ముతారు. ఈ కోటలో పురాతన మైసమ్మ దేవాలయం ఉంది. అంతేకాదు శివుడు, వినాయకుడు, కాలభైరవుడు, హనుమంతుడి విగ్రహాలను కలిగి అద్భుతమైన వాస్తు శిల్పంతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

Gandhari Jatara
కష్టాలు తీర్చే తల్లి గాంధారీ మైసమ్మ..
రక్షణాత్మక నిర్మాణాలు, స్నానపు ట్యాంకులు, ఇక్కడ ఉన్న శిల్ప సౌందర్యం సందర్శకులను కట్టిపడేస్తుంది. అనేక ఔషధాలకు, వనమూలికల మొక్కలకు నిలయమైన ఈ ప్రదేశం అక్కడికి వెళ్లిన వారి ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యాన్ని, సానుకూలతను కలిగిస్తుంది. గిరిజన ఆదివాసి నాయక్ పోడుల ఆరోగ్య దైవమైన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటే పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటామని అమ్మవారు తమను రక్షిస్తారని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం.
మొదలైన గాంధారి కోట జాతర…
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని చారిత్రక గాంధారి కోట వద్ద మూడు రోజులపాటు నిర్వహించే గాంధారి మైసమ్మ జాతర జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 3న జాతర ప్రారంభమైంది. జాతరలో భాగంగా నాయక్ పోడులు గోదావరిలోని సదర్ భీమన్న, ఇతర దేవతల చెక్క శిల్పాలకు పవిత్ర స్నానాలు ఆచరించి వాటిని మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట శివార్లలోని ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు చప్పుళ్ళతో, నృత్యాలతో ఆలయం వద్ద నాయక్ పోడులకు చెందిన రొడ్డవంశానికి చెందిన వారి ముఖ్యమైన మతపరమైన సాంస్కృతిక వ్యవహారాన్ని కొనసాగించారు. సదర్ల భీమన్న విగ్రహాల వద్ద పట్నాలు వేసి తప్పెటగూళ్లతో, పిల్లనగ్రోవి ఆటపాటలతో ఆదివాసి గిరిజనులు చేసే ఈ సంబరం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

Gandhari Jatara
రెండో రోజు కార్యక్రమాలు ఇవీ..
జాతరలో రెండవ రోజు కోటపై ఉన్న మైసమ్మకు, ఇతర దేవతలకు మహా పూజ చేసి ఇక శనివారం అర్ధరాత్రి సమయంలో నాయక్ పోడ్ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెటగూళ్లు పిల్లన గ్రోవి ప్రదర్శనలు నిర్వహిస్తారు. జాతరలో చివరి రోజు అయిన ఆదివారం నిర్వహించనున్న ప్రజా దర్బార్ అందరినీ ఆకట్టుకుంటుంది.
చివరి రోజు ప్రజా దర్బార్..
ఇక జాతరలో మూడో రోజు ఆదివాసి గిరిజనుల ఫిర్యాదుల పరిష్కారానికి చివరి రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ ప్రజా దర్బార్‌కు హాజరవుతారు. ఆదివాసీలు, గిరిజనులు తమ సమస్యలను ప్రజాదర్బార్‌లో ఏకరువు పెట్టి పరిష్కరించాలని కోరుతారు. గిరిజనులు అత్యంత ఘనంగా జరుపుకునే ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తారు.