US Debt Crisis 2023: అమెరికా అప్పుల కుప్ప: ఆర్థిక పతనం దిశగా అగ్రరాజ్యం.. మన ఐటీ పరిస్థితి ఏంటి?
జూన్ 1 తరువాత అమెరికా ఖజానా పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆ దేశ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే 2008 నాటి ఆర్థిక సంక్షోభం కంటే దారుణమైన అనుభవాలు అమెరికన్ ప్రజలు చవిచూడాల్సి వస్తుందని వారు అంచనా వేస్తున్నారు.

US Debt Crisis 2023: అమెరికా అంటే ఆశల సౌధం. డాలర్ల రాజ్యం. ప్రపంచం మీద పెత్తనం చెలాయించే శ్వేత దేశం. అలాంటి ఈ దేశం ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందా? పతనం అంచున నిలిచిందా? త్వరలో కుప్పకూల బోతోందా? అంటే దీనికి అవును అనే సమాధానం చెబుతున్నారు విశ్లేషకులు. వాస్తవానికి అమెరికాలో చేసే స్వల్ప ఆర్థిక మార్కులు కూడా ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ విలువ 23 లక్షల కోట్ల డాలర్లు అంటే అతిశయోక్తి కాదు.. కానీ అంతటి అమెరికా ఇప్పుడు లోటు బడ్జెట్లో నడుస్తోంది. ప్రభుత్వానికి వచ్చే కబడి కంటే చేసే ఖర్చు ఎక్కువగా ఉండడంతో లోటు బడ్జెట్లో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులకోసం అమెరికా చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ కాంగ్రెస్ దేశ రుణ పరిమితి పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. 1960 నుంచి అమెరికా కాంగ్రెస్ 78 సార్లు రుణ పరిమితిని మార్చింది అంటే మామూలు విషయం కాదు. కానీ ఈసారి ప్రతిపక్ష రిపబ్లికన్ చట్ట సభ్యుల నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ అమెరికన్ కాంగ్రెస్ రుణ పరిమితి పెంచినప్పటికీ అది భవిష్యత్తు ఖర్చులకోసం కాదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వంటి చెల్లింపుల కోసం.
అప్పుల కుప్ప
అమెరికా డెట్ సీలింగ్ సంక్షేమం అనేది ఆర్థికంగా కంటే ఎక్కువ రాజకీయ సంక్షోభంగా మారిందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు. ఈ సమస్యకు త్వరలోనే ముగింపు కార్డు పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే పరిస్థితి భయానకంగా మారుతుందని వారు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో వారు చెప్పలేకపోతున్నారు.
జూన్ 1 తరువాత
జూన్ 1 తరువాత అమెరికా ఖజానా పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆ దేశ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే 2008 నాటి ఆర్థిక సంక్షోభం కంటే దారుణమైన అనుభవాలు అమెరికన్ ప్రజలు చవిచూడాల్సి వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అమెరికన్ కాంగ్రెస్ పరిమితి పెంచకపోతే, ఇకపై అమెరికా అప్పులు తీసుకోలేదు. ప్రభుత్వ పనులకు, ఇతర వ్యవహారాలకు అమెరికా చెల్లింపులు జరపలేదు. ఇలాంటి పరిణామాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు ఇప్పుడు ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రజలకు అమెరికన్ సహాయం ఆగిపోతే వారు రోజువారి అవసరాలు తీర్చుకోలేరు. ఇది అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థ పై అత్యంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై, పేద ప్రజలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలపై ఇది నేరుగా ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా రుణ పరిమితి పెంచకపోతే ఆర్థిక వ్యవస్థ ఆరు శాతం కుంచించుకుపోతుంది.
భారీ నష్టాలు కలగజేస్తుంది
అమెరికా ఎకనామిలో కేవలం ఒక శాతం క్షీణత వచ్చినా అది భారీ నష్టాలను కలిగిస్తుంది. కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లలో చేసే చిన్న మార్పు కూడా ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి పక్షంలో 23 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే అది కచ్చితంగా ప్రపంచంలోని చాలా దేశాలను తీవ్రంగా దెబ్బతిస్తుంది. భారత్ వంటి దేశాలు కూడా దీని ప్రభావానికి గురవుతాయి. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఆ దేశం నుంచి డిమాండ్ తక్కువ అవుతుంది. అవి తగ్గితే మన దేశం నుంచి ఎగుమతులు తీవ్రస్థాయిలో ప్రభావితం అవుతాయి. ఫలితంగా దేశంలోని కంపెనీలు నష్టాల బారిన పడతాయి..
ఐటీ పరిశ్రమ మందగమనం
ఇక అమెరికా నుంచి డిమాండ్ తగ్గిపోవడంతో భారత ఐటీ పరిశ్రమ మందగమనంలో నడుస్తోంది. వాస్తవానికి ప్రపంచం మొత్తం డాలర్ లోనే వ్యాపారం సాగుతుంది. చాలా దేశాలకు డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ. ఒకవేళ అమెరికా అప్పు తీర్చలేకపోతే డాలర్ కూడా నష్టపోతుంది. భారత్ వంటి కొన్ని వర్తమాన దేశాలు ఈ విషయంలో ప్రయోజనం పొందుతాయి. కానీ డాలర్ల క్రయవిక్రయాల్లో భారీ తేడా ఉంటుంది. ఇది ఏ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిది కాదు.
అదే కారణం
ఇక ఈ రుణపరిమితిపై ఏకాభిప్రాయం కుదరకపోవడానికి నిరంతరం అంత ఖర్చును ప్రభుత్వం భరించలేదని ప్రతిపక్ష రిపబ్లికన్ చట్టసభ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిని అమెరికన్ చరిత్రలో ” అస్థిరత ” అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ సంక్షేమ పథకాల్లో కోత విధించడం ప్రస్తుత అధ్యక్షుడికి ఇష్టం లేదు. మరోవైపు బడ్జెట్ తగ్గిస్తామని బైడెన్ హామీ ఇచ్చారని రిపబ్లిక్ అని పార్టీ నేతలు అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఎలాంటి అడుగు వేస్తుందో వేచి చూడాల్సి ఉంది.