Chandrayaan 3 : 12 దేశాలు..141 ప్రయత్నాలు.. “తొలి సాఫ్ట్ ల్యాండ్” ఘనత ఆ దేశానిదే!
1966 జనవరి 31న యూఎస్ ఎస్ ఆర్ ప్రయోగించిన లూనా-9 ల్యాండర్ ఆ ఏడాది ఫిబ్రవరి 3న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. చంద్రునిపై తొలి సాఫ్ట్ ల్యాండింగ్ ఇదే.

Chandrayaan 3 : చంద్రుడు కొరకరాని కొయ్య. అద్భుతాలకు నెలవు. అంతు చిక్కని రహస్యాల చిత్తరువు. అలాంటి చందమామ మీద.. ఆ పున్నమి రేడు మీద దాగి ఉన్న రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో చంద్రయాన్_3 ను చేపట్టింది. అది బుధవారం దక్షిణ ధ్రువం మీద సేఫ్ గా ల్యాండ్ కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇస్రో శాస్త్రవేత్తలు విజయనాదం చేశారు. దేశం యావత్తు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఈ విజయం వెనుక ఎన్నో ఆటంకాలను ఇస్రో అధిగమించింది. మరెన్నో అవరోధాలను ఎదుర్కొంది. ఇప్పటివరకు ఇలా ఎన్ని దేశాలు ప్రయోగాలు చేశాయో ఒక్కసారి తెలుసుకుందామా.
12 దేశాలు 141 ప్రయత్నాలు
చందమామను చేరేందుకు ప్రపంచంలోని 12 దేశాలు ఇప్పటిదాకా 141 ప్రయోగాలు చేశాయి. అమెరికా 59 సార్లు, సోవియట్ యూనియన్(యూఎస్ ఎస్ ఆర్) 58, జపాన్ 6, ఈయూ 1, చైనా 8, భారత్ 3, లక్సంబర్గ్, ఇజ్రాయిల్, సౌత్ కొరియా, ఇటలీ, యూఏఈ, రష్యా తలా ఒక్కో సారి చంద్రుని చేరేందుకు ప్రయత్నించాయి. ఇందులో కేవలం 69 సార్లు ఆయా దేశాలు విజయం సాధించాయి. 64 ప్రయోగాలు విఫలం అయ్యాయి. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండ్ కావడంతో ప్రపంచం మొత్తం ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తోంది.
59 సార్లు అమెరికా
ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా 59 సార్లు చంద్రుడి వద్దకు వెళ్లే ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో 40 ప్రయోగాల్లో విజయం సాధించిన అగ్రదేశం.. 16 సార్లు విఫలమైంది. ఆ తర్వాత యూఎస్ ఎస్ ఆర్(సొవియట్ యూనియన్) 58 ప్రయోగాలు చేయగా 18 సార్లు విజయవంతమైంది. ఎనిమిది ప్రయోగాలు చేసిన చైనా నాలుగు సార్లు విజయాన్ని అందుకుంది. ఇక, మూడు ప్రయోగాలు చేసిన భారత్ తొలి ప్రయత్నంలో విజయం సాధించగా.. రెండో ప్రయత్నం చంద్రయాన్-2లో చివరి నిమిషంలో విఫలమైంది. ప్రస్తుతం మూడో మిషన్ సాఫ్ట్ ల్యాండ్ జరిగింది. వాస్తవానికి చంద్రయాన్-3 చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుందా ? ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూసింది.
చంద్రయాన్-3లోని విక్రమ్ రోవర్ జాబిల్లిని ముద్దాడింది. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ ఖ్యాతి దక్కించుకుంది. ఇప్పటిదాకా భారత్ సహా 10కిపైగా దేశాలు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించాయి. కానీ, యూఎస్ ఎస్ ఆర్ (సోవియట్), అమెరికా, చైనా మాత్రమే విజయం సాధించాయి. 1966 జనవరి 31న యూఎస్ ఎస్ ఆర్ ప్రయోగించిన లూనా-9 ల్యాండర్ ఆ ఏడాది ఫిబ్రవరి 3న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. చంద్రునిపై తొలి సాఫ్ట్ ల్యాండింగ్ ఇదే.
