IT Sector Jobs: సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం చేతినిండా పని. కానీ చేసేవారు కరువు. ‘బ్బాబ్బా బూ మీరు ఎలాగైనా పని చేయండి. కానీ మాకు మాత్రం సమయానికి ప్రాజెక్టు అప్పగించండి. తర్వాత కొద్ది రోజులకు దయచేసి ఆఫీసులకు రండి.. మూడు రోజులపాటు ఇక్కడే పని చేయండి.. మీకు సకల సౌకర్యాలు కల్పిస్తాం.” కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. “దయచేసి మీరు వెళ్లిపోండి. లేదంటే మేమే బయటికి గెంటేస్తాం”. అనే స్థాయికి ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు దిగజారింది. కేవలం ఈ అక్టోబర్ నెలలో హైరింగ్ 43% తగ్గింది అంటే ఆర్థిక మాంద్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగం మారే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం కోర్కెల కొండ దిగుతున్నారు. మాంద్యం తాలూకు భయాలతో ఐటీ కంపెనీలు కూడా పొదుపు చర్యలు పాటిస్తున్నాయి.

IT Sector Jobs
తగ్గుముఖం పట్టాయి
భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల రంగంలో నియామకాలు తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ తో ముగిసిన 9 నెలల సగటుతో పోలిస్తే అక్టోబర్ లో ఐటి, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీల్లో నియామకాలు 43% తగ్గాయి. సీనియర్ మేనేజ్మెంట్ నిపుణుల నియామకాలు 68 శాతానికి పడిపోయాయి. ఐటీ కంపెనీలకు నియామక సేవలు అందించే సి.ఐ.ఈ.ఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సంస్థ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి రాకపోవడం, అంకుర సంస్థల్లో పెట్టుబడులు తగ్గిపోవడం, ఆర్థిక మాంద్యం తాలూకు భయాలతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే 2023 జనవరి నుంచి మార్చి త్రైమాసికం వరకు ఐటీ కంపెనీల్లో నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ కాలంలో ఐటీ సేవలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ రంగంలో నియామకాలు అదే స్థాయిలో పుంజుకున్నాయి.. రెండు సంవత్సరాల పాటు టెకీల హై రింగ్ ఈ ఏడాది మూడో త్రైమాసికం అంటే జూలై _ సెప్టెంబర్ మధ్య మళ్లీ ప్రీ కోవిడ్ స్థాయికి తగ్గింది. భారత జాబ్ మార్కెట్లో గత రెండు సంవత్సరాలుగా అత్యధిక నియామకాలు జరిగిన రంగం ఐటినే.. మరో రెండు త్రైమాసికాల పాటు నియామకాలు అంతంతమాత్రంగా ఉండవచ్చని ఇప్పటి పరిస్థితులను బట్టి తెలుస్తోంది.
భారీగా తీసివేతలు
ట్విట్టర్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా పలు అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. సుమారు 25 వేల మంది దాకా ఉద్యోగాలు కోల్పోయారు. ఈ కంపెనీలకు చెందిన భారత కార్యాలయాల్లో సైతం పెద్ద సంఖ్యలో ఉద్వాసనలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు ఈ ఏడాది కొత్త పెట్టుబడులు నిలిచిపోవడంతో దేశీయ అంకుర సంస్థలు 20వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించాయి. వచ్చే ఏడాది వరకు అంకుర సంస్థల్లో తొలగింపులు ఇదే స్థాయిలో ఉంటాయని కంపెనీలు చెబుతున్నాయి.
దిగివస్తున్న నిపుణులు
నియామకాల జోరు తగ్గడంతో ఇన్నాళ్లు కోరికల కొండ ఎక్కి కూర్చున్న ఐటీ నిపుణులు ఇప్పుడు దిగివస్తున్నారు. కొత్త ఉద్యోగంలోకి మారే సమయంలో 60 నుంచి 100% జీతం పెంపును డిమాండ్ చేసిన వారు… ఇప్పుడు 20 నుంచి 30% ఇస్తే చాలు అని అంటున్నారు. ఐటీ లో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లిపోవడం, మున్ముందు హైరింగ్ దాదాపు స్తంభిస్తుందనే భయాలు కారణమని తెలుస్తోంది. మాంద్యం ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో కంపెనీలు ముందు జాగ్రత్త పడుతున్నాయి. పలు కంపెనీలు కొలువుల్లో కోతలు పెట్టాయి. కొత్త నియామకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

IT Sector Jobs
ఈ పరిణామం ఐఐటీల వంటి ప్రముఖ విద్యా సంస్థల ప్రాంగణ నియామకాల పైన ప్రతికూల ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ సందర్భంగా వారికి ఆఫర్ చేసే ప్యాకేజీ కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఐఐటి విద్యార్థులకే డిమాండ్ తగ్గితే మిగతా ఇంజనీరింగ్ కాలేజీల్లో అసలు ప్లేస్మెంట్స్ అనే అవకాశమే ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకా ఉద్యోగులతో కళకళలాడిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు మాంద్యం వల్ల ఉద్వాసనలు పలుకుతున్నాయి.