Nandamuri Balakrishna: ప్రాసతోనే జగన్ ప్రాణం తీసేలా ఉన్నావే బాలయ్యా!’
తాజాగా ఏపీ సీఎం జగన్ పై హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావణ పాలక.. దేశానికి దరిద్ర జాతకుడిలా ముఖ్యమంత్రి జగన్ మారారని నిప్పులు చెరిగారు.

Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్ అయిన వేళ బాలకృష్ణ రంగంలోకి దిగడం విశేషం. గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కలత చెందిన బాలకృష్ణ.. సినిమా షూటింగులు నిలిపివేసి రంగంలోకి దిగారు. చంద్రబాబుకు బెయిల్ లభించే వరకు బాలకృష్ణ స్థానికంగానే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేష్ పార్టీకి దిశా నిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు బెయిల్ పై గట్టిగానే పోరాడుతూనే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు భరోసాగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో బాలకృష్ణ రంగంలోకి దిగడం టిడిపి శ్రేణులకు ఉపశమనం కలిగించే విషయం.
తాజాగా ఏపీ సీఎం జగన్ పై హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావణ పాలక.. దేశానికి దరిద్ర జాతకుడిలా ముఖ్యమంత్రి జగన్ మారారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బాలకృష్ణ ప్రత్యేకంగా విజయవాడలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారీ డైలాగులతో, ప్రాసలతో సటైరికల్ గా మాట్లాడారు. పాలనను గాలికి వదిలేసి కక్షలతో రాజకీయాలు చేస్తున్న జగన్ కు ప్రజలే చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
తాను 16 నెలలు జైలులో ఉన్నాను కాబట్టి.. చంద్రబాబును 16 రోజులపాటు జైల్లో ఉంచాలని జగన్ చూస్తున్నారని దుయ్యబట్టారు. ఏ ఆధారాలు లేకుండా కుట్రపూరితంగానే చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేశారని బాలకృష్ణ ఆరోపించారు. చట్టాలను అతిక్రమించి, అవినీతి చేశారని అబూత కల్పనలు సృష్టించి చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబు అని.. ఈ విషయాన్ని విదేశీ ప్రముఖులు సైతం ఒప్పుకున్న విషయాన్ని బాలకృష్ణ గుర్తు చేశారు. అందుకే ఏపీ ప్రజలు చంద్రబాబుకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ భారీ డైలాగులు ఆకట్టుకున్నాయి ” లక్ష కోట్ల భక్షక, అవినీతి అర్భక, పక్ష పథ రూపక, ముఖ్య కంత్రి మహా మూర్ఖ,మూచీ ముద నష్టకా, జగమెరిగిన జగన్నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక, రాష్ట్రానికి రావణపాలక, జన ధనమాన చోరక మన ముఖ్యమంత్రి” అంటూ ప్రాసలతో జగన్ ను బాలకృష్ణ తూర్పార పట్టారు.
